మమత కోటలో ముసలం.. మరో రాజ్యసభ ఎంపీ రాజీనామా!
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్ర మమతా బెనర్జీకి రాజకీయంగా మరో బిగ్ షాక్ తగలింది. ఆ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ ప్రకాష్ చిక్ బరైక్ తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవలి కాలంలో తృణమూల్ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన మూడో రాజ్యసభ ఎంపీ ఈయనే కావడం గమనార్హం. ప్రకాష్ కంటే ముందే పార్టీకి చెందిన ఇద్దరు కీలక రాజ్యసభ ఎంపీలు సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితా దేవ్ కూడా ఎంపీ పదవులకు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు కీలక నేతలు వైదొలగడంతో పార్లమెంట్ ఎగువసభలో టీఎంసీ బలం కేవలం 10 స్థానాలకు పడిపోయింది. అయితే ప్రకాష్ చిక్ బరైక్ తన రాజీనామాకు గల అసలు కారణాలను ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు.
బెంగాల్ రాజకీయాల్లో వచ్చిన మార్పుల తర్వాత మమతా బెనర్జీకి సంక్షోభాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఎమ్మెల్యేల నుంచి ఎంపీల వరకు ఎందరో నేతలు ఆమెకు దూరం అవుతున్నారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ చరిత్రలోనే అత్యంత తీవ్రమైన అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ నిలువునా చీలిపోయే ప్రమాదంలో పడింది. తృణమూల్ కాంగ్రెస్ తరఫున గెలిచిన మొత్తం 80 మంది ఎమ్మెల్యేలలో 58 మంది తిరుగుబాటు బావుటా ఎగురవేసి రీతబ్రత బెనర్జీ నాయకత్వంలో ప్రత్యేక గ్రూపుగా ఏర్పడ్డారు. ఈ పరిణామాల మధ్య పార్టీ ఉనికికే ముప్పు వాటిల్లే పరిస్థితి కనిపిస్తోంది.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలోనే కాకుండా ఇప్పుడు పార్లమెంట్‌లో కూడా తృణమూల్ కాంగ్రెస్ చీలిపోతుందనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. లోక్‌సభలో టీఎంసీకి ఉన్న 28 మంది ఎంపీలలో ఏకంగా 19 మంది ఎంపీలు మమతా బెనర్జీపై తిరుగుబాటు చేశారు. కాకోలి ఘోష్ నాయకత్వంలో నడుస్తున్న ఈ తిరుగుబాటుదారుల జాబితాలో మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్, సాయోని ఘోష్, బారూయ్‌పూర్ ఎంపీలతో పాటు శతృఘ్న సిన్హా, దీపక్ అధికారి (దేవ్), జూన్ మాలియా, రచనా బెనర్జీ వంటి ప్రముఖుల పేర్లు ఉన్నాయి.
మరోవైపు రాజ్యసభలో కూడా టీఎంసీ బలం క్రమంగా పడిపోతోంది. గతంలో రాజ్యసభలో టీఎంసీకి 13 మంది ఎంపీల బలం ఉండగా.. ముగ్గురు కీలక నేతల రాజీనామాలతో ఇప్పుడు ఆ సంఖ్య 10కి పడిపోయింది. రాబోయే రోజుల్లో మరికొంత మంది ఎంపీలు కూడా పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇదే గనుక జరిగితే పార్లమెంట్‌లో తృణమూల్ కాంగ్రెస్ గ్రాఫ్ మరింత పడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications