కరోనా వ్యాక్సిన్లు తీసుకున్న వారు నపుంసకులుగా మారుతారా?
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహ్మారిని నిర్మూలించడానికి అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లపై డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) కీలక ప్రకటన చేసింది. ఇప్పటిదాకా సీరమ్ ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌తో పాటు భారత్ బయోటెక్ తయారు చేసిన కోవ్యాగ్జిన్‌ను దేశంలో అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చినట్లు తెలిపింది. ఈ విషయాన్ని డీసీజీఐ వీజీ సొమానీ ఆదివారం వెల్లడించారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందట ఆయన న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. కరోనా వ్యాక్సిన్లు ఎంతమేర ప్రభావం చూపుతాయనే విషయంపై వివరించారు.
కోవిషీల్డ్, కోవ్యాగ్జిన్‌లకు లాంఛనంగా అనుమతి..
భారత్ బయోెటెక్, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేసిన ఈ రెండు వ్యాక్సిన్లను అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వినియోగించడానికి అనుమతి ఇచ్చినట్లు స్పష్టం చేశారు. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, హైదరాబాద్‌కు చెందిన భారత బయోటెక్ రూపొందించిన కోవ్యాగ్జిన్లను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. సాధారణ ప్రజల కోసం వాటిని వినియోగించడానికి ఇదివరకే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీఓ) అనుమతి ఇచ్చింది.

జైడస్ క్యాడిల్లా మూడు డోసులు..
అదే విషయాన్ని వీజీ సొమానీ లాంఛనంగా వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ రెండు వ్యాక్సిన్లను వినియోగించుకోవడానికి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. కోవ్యాగ్జిన్, కోవిషీల్డ్‌లను రెండు డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. జైడస్ క్యాడిల్లా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను మూడు డోసులుగా ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. వ్యాక్సిన్ అభివృద్ధి చేయడంలో గానీ, క్లినికల్ ట్రయల్స్ నిర్వహణలో గానీ ఏ చిన్న లోపం తలెత్తినా తాము ఆయా వ్యాక్సిన్ల వినియోగానికి అనుమతి ఇచ్చేవాళ్లం కాదని సొమానీ స్పష్టం చేశారు.

నపుంసకులుగా మారుతారా?
వ్యాక్సిన్లు వందశాతం ప్రభావాన్ని చూపుతాయని తాము నిర్ణయానికి వచ్చిన తరువాతే.. అనుమతి ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. తమ అంచనాలకు అనుగుణంగా అవి వందశాతం సేఫ్‌గా పనిచేస్తాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఎలాంటి వ్యాక్సిన్‌ను తీసుకున్నాస్వల్పంగా జ్వరం, నొప్పి, అలర్జీ వంటి సైడ్ ఎఫెక్టులు వస్తాయని పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే నపుంసకులుగా మారుతారనే వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదని ఆయన కొట్టి పారేశారు. అలాంటి వార్తలను నమ్మొద్దని సొమాని విజ్ఞప్తి చేశారు.

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో
ఈ వ్యాక్సిన్లను అత్యవసర సమయాల్లో వినియోగించడానికి అనుమతి ఇచ్చే విషయంలో తాము కోట్లాది మంది ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకున్నామని అన్నారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశం కావడం వల్ల తాము తొందరపడి ఎలాంటి నిర్ణయాలను తీసుకోలేదని చెప్పారు. తాము అనుమతి ఇచ్చిన వ్యాక్సిన్లు వందకు 110 శాతం ప్రభావం చూపుతాయని సొమాని పదేపదే స్పష్టం చేశారు. ఈ విషయంలో పుకార్లను నమ్మొద్దని చెప్పారు.

ప్రధాని హర్షం
కోవాగ్జిన్, కోవిషీల్డ్ వినియోగానికి డీసీజీఐ అనుమతి లభించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన శాస్త్రవేత్తలు, అభివృద్ధి చేసిన సంస్థలు, దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ ఆరోగ్య వ్యవస్థలో ఇదొక చారిత్రాత్మక మలుపుగా అభివర్ణించారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనడానికి దేశ పౌరులు నిరంతర యుద్ధాన్ని కొనసాగిస్తున్నారని, ఈ పోరాటంలో ఓ అద్భుత విజయాన్ని అందుకున్నట్టయిందని చెప్పారు.