నెక్స్ట్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ మనకే - మోదీ జెండా ఊపే తేదీ ఇదే..!!
బెంగళూరు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనత పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్- వందేభారత్ ఎక్స్‌ప్రెస్. ఇప్పటికే నాలుగు రైళ్లు పట్టాలక్కాయి. అవన్నీ కూడా ఉత్తరాది రాష్ట్రాలకే దక్కాయి. మోదీని లోక్‌సభకు పంపించిన ఉత్తరప్రదేశ్, ఆయన సొంత రాష్ట్రం గుజరాత్‌తో పాటు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న హిమాచల్ ప్రదేశ్‌లకు ఈ నాలుగు రైళ్లను మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం.
తన పర్యటనల సందర్భంగా ఆయన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌ల్లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. గాంధీనగర్ నుంచి ముంబై సెంట్రల్ వరకు రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్ ఇది. వందేభారత్ ప్రాజెక్ట్‌లో ఇది మూడో రైలు. ఇదివరకు న్యూఢిల్లీ-వారణాశి, న్యూఢిల్లీ-శ్రీమాతా వైష్ణోదేవి కాట్రా స్టేషన్ల మధ్య ఈ రైలు పట్టాలెక్కింది. మూడో ఎక్స్‌ప్రెస్ గాంధీనగర్-ముంబై సెంట్రల్ మధ్య అందుబాటులోకి వచ్చింది. నాలుగో రైలు ఢిల్లీ-హిమాచల్‌లోని ఏఎంబీ అందౌర మధ్య పట్టాలెక్కింది.

16 బోగీలు ఉన్న ఈ సెమీ హైస్పీడ్ రైలు సీట్ల సామర్థ్యం 1,128. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ప్రధాని మోదీ ఇలాంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌కు మంజూరు చేశారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వ్యక్తం అయ్యాయి. దక్షిణాది రాష్ట్రాలకు ఇప్పటివరకూ ఒక్క వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా కేటాయించలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. వీటన్నింటికీ తెర దించింది కేంద్ర ప్రభుత్వం.
దక్షిణాది రాష్ట్రానికి దీన్ని మంజూరు చేసింది. వందేభారత్ ప్రాజెక్ట్‌లో ఇది అయిదోది. చెన్నై నుంచి మైసూరు మధ్య అందుబాటులోకి రానుంది. చెన్నై-బెంగళూరు-మైసూరు మధ్య ఈ రైలును ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. నవంబర్ 10వ తేదీన దీన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. మైసూరు లేదా చెన్నైల్లో ఏర్పాటు చేసే కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు.












Click it and Unblock the Notifications