వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారణాసి: విశ్వనాథ మందిరం, జ్ఞాన్‌వాపి మసీదు పక్కపక్కనే ఎలా నిర్మించారు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

వారణాసిలో జ్ఞాన్‌వాపి మసీదు ఆవరణలో మూడు రోజుల సర్వే తర్వాత ఒక శివ లింగం కనిపించిందని హిందువుల తరఫు ప్రతినిధులు, జిల్లా అధికారులు చెబుతున్నారు. అయితే, అది ఫౌంటెయిన్ అని ముస్లింలు వివరిస్తున్నారు.

తాజా పరిణామాల నడుమ ఆ ప్రాంతాన్ని సీల్ చేయాలని స్థానిక కోర్టు ఆదేశాలు జారీచేసింది. మరోవైపు జ్ఙాన్‌వాపి మసీదు మేనేజ్‌మెంట్ కమిటీ అప్పీలుపై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది.

వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయం, జ్ఙాన్‌వాపి మసీదు పక్కపక్కనే నిర్మించడంపై చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే, వీటిని ధ్రువీకరించే ఆధారాలు చాలా తక్కువగా ఉన్నాయి.

కాశీ విశ్వనాథ దేవాలయాన్ని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ధ్వంసం చేసి, అక్కడ మసీదును నిర్మించినట్లు చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే, చారిత్రక ఆధారాలను పరిశీలిస్తే, ఇక్కడి పరిస్థితుల సంక్లిష్టత మనకు అర్థం అవుతుంది.

చరిత్రకారులు ఏం చెబుతున్నారు?

జౌన్‌పుర్‌కు చెందిన శార్కి సుల్తానులు 14శ శతాబ్దంలో జ్ఙాన్‌వాపి మసీదును నిర్మించినట్లు కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. విశ్వనాథ ఆలయాన్ని ధ్వంసంచేసి ఆ మసీదును కట్టినట్లు వారు వివరిస్తున్నారు. అయితే, ఈ వాదనతో కొందరు చరిత్రకారులు విభేదిస్తున్నారు.

ఇక్కడ శార్కి సుల్తానులు ఆ మసీదును కట్టించినట్లు లేదా ఆలయాన్ని వారి హయాంలో ధ్వంసం చేసినట్లు ఎలాంటి ఆధారాలూ లేవు.

ఇక విశ్వనాథ ఆలయ నిర్మాణం విషయానికి వస్తే, దీన్ని 1585లో అక్బర్ ఆదేశాలతో ఆయన నవరత్నాల్లో ఒకరైన రాజా టోడర్‌మల్ నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. నిర్మాణంలో దక్షిణ భారత దేశానికి చెందిన పండితుడు నారాయణ భట్ట సాయం కూడా తీసుకున్నట్లు వివరిస్తున్నారు.

జ్ఞాన్‌వాపి మసీదు

ఈ అంశంపై వారణాసిలోని కాశీ విద్యాపీఠ్‌లో చరిత్ర విభాగం ప్రొఫెసర్ డాక్టర్ రాజీవ్ ద్వివేది బీబీసీతో మాట్లాడారు. ''విశ్వనాథ ఆలయాన్ని రాజా టోడర్‌మల్ నిర్మించారు. దీనికి చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. ఇలాంటి కట్టడాలను టోడర్‌మల్ చాలా నిర్మించారు. ఇక్కడ మరొక విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. అక్బర్ ఆస్థానంలో టోడర్‌మల్‌కు చాలా విలువ ఉండేది. విశ్వనాథ ఆలయం కట్టడానికి అక్బర్ నుంచి ఆయన ఆదేశాలను తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. అందుకే అక్బర్ ఆదేశాలపై ఆయన ఆ మందిరాన్ని నిర్మించారని చెప్పడం సరికాదు’’అని రాజీవ్ ద్వివేదీ వ్యాఖ్యానించారు.

''ఆధ్యాత్మికంగా విశ్వనాథ దేవాలయానికి ఎప్పటినుంచో చాలా ప్రాధాన్యం ఉంది. కానీ, దీని గురించి చారిత్రక ఆధారాలు చాలా తక్కువగా అందుబాటులో ఉన్నాయి. ఇదివరకు అక్కడ అంతపెద్ద దేవాలయం ఉండేది కాదు. రాజా టోడర్‌మల్ నిర్మించిన ఆలయం కూడా పెద్దది కాదు’’అని రాజీవ్ వివరించారు.

మరోవైపు విశ్వనాథ మందిరాన్ని ఔరంగజేబు ధ్వంసం చేసిన తర్వాతే జ్ఞాన్‌వాపి మసీదును నిర్మించారని చాలా మంది విశ్వసిస్తుంటారు.

ఈ అంశంపై జ్ఞాన్‌వాపి మసీదును పర్యవేక్షించే అంజుమాన్ ఇంతేజామియా కమిటీ జాయింట్ సెక్రటరీ సయ్యద్ మొహమ్మద్ యాసిన్ మాట్లాడారు. ''1585లో అక్బర్ తన కొత్త మతం దీన్-ఎ-ఇలాహీని ప్రారంభించినప్పుడే ఈ మసీదును కట్టినట్లు చాలా మంది చెబుతుంటారు’’అని ఆయన అన్నారు.

''అక్బర్ స్థాపించిన ఆ కొత్త మతంతో ఔరంగజేబు వ్యతిరేకిస్తూ విశ్వనాథ మందిరాన్ని ధ్వంసం చేయించారని కొందరు చెబుతుంటారు. ఇక్కడ దేవాలయాన్ని ధ్వంసంచేసి మసీదును కట్టలేదు. అక్బర్ సమయంలోనే ఆ మసీదును కూడా నిర్మించారు. ఇక్కడ ఉండే ఓ కొలనులో శివ లింగం ఉందని చెప్పడం కూడా సరికాదు. ఎందుకంటే 2010లో మేం మొత్తం మసీదును శుభ్రంచేశాం. అక్కడ మాకు ఎలాంటి శివ లింగమూ కనిపించలేదు’’అని సయ్యద్ మొహమ్మద్ యాసిన్ చెప్పారు.

మరోవైపు ఇక్కడ మందిరాన్ని ఔరంగజేబు హయాంలో ధ్వంసం చేయించారని న్యాయవాది విజయ్ శంకర్ రస్తోగీ చెబుతున్నారు. ''విశ్వనాథ ఆలయాన్ని ఔరంగజేబు హయాంలో ధ్వంసం చేయించారు. కానీ, అక్కడ మసీదు కట్టాలని ఆయన ఆదేశాలు ఇవ్వలేదు. చాలా కాలం తర్వాత దేవాలయ శిథిలాల్లో మసీదు కట్టారు’’అని ఆయన వివరించారు.

అసలు ఈ మసీదును ఎప్పుడు స్పష్టంగా నిర్మించారో స్పష్టమైన ఆధారాలేమీ లభించలేదు. అయితే, ''మందిరాన్ని ధ్వంసంచేసిన తర్వాతే మసీదు కట్టి ఉండొచ్చు. ఎందుకంటే ఆ కాలంలో అలాంటివి చాలా జరిగాయి కదా’’అని ప్రొఫెసర్ రాజీవ్ ద్వివేదీ అన్నారు. ''అది ఔరంగజేబు సమక్షంలో జరిగి ఉండకపోయుండొచ్చు. కానీ, మందిరాన్ని పడగొట్టడానికి ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఆయన హయాంలోనే మసీదు కూడా నిర్మించారు’’అని ద్వివేదీ అన్నారు.

అయితే, అక్బర్ తన కొత్త మతం దీన్-ఎ-ఇలాహీలో భాగంగా ఈ మసీదు కట్టించారా? లేదా ఔరంగజేబు దీన్ని నిర్మించారా? అనే అంశంలో చరిత్రకారుల్లో భిన్నమైన సమాధానాలు ఉన్నాయి.

జ్ఞాన్‌వాపి మసీదు

చరిత్ర ఏం చెబుతోంది?

విశ్వనాథ ఆలయాన్ని ధ్వంసం చేయడం, జ్ఞాన్‌వాపి మందిరాన్ని నిర్మించడం వెనుక చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే, వీటికి స్పష్టమైన ఆధారాలేమీ కనిపించడం లేదు.

ఈ అంశాన్ని చరిత్రకారుడు ఎల్‌పీ శర్మ ''ద హిస్టరీ ఆఫ్ మిడైవల్ ఇండియా’’ పుస్తకంలో 232వ పేజీలో ప్రస్తావించారు. ''1669లో హిందూ దేవాలయాలు, పాఠశాలలను ధ్వంసం చేయాలని సుబేదార్లకు, ముసాహిబ్‌లకు ఆదేశాలు జారీచేశారు. దీని కోసం ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటుచేశారు. అయితే, అన్ని దేవాలయాలు, హిందూ పాఠశాలలను ఒకేసారి ధ్వంసం చేయడం వీలుకాలేదు. కానీ, బనారస్‌లోని విశ్వనాథ ఆలయం, మథురలోని కేశవదేవ్ ఆలయం, పటాన్‌లోని సోమనాథ్ దేవాలయం లాంటి పెద్దపెద్ద ఆలయాలను ఆ కాలంలో ధ్వంసం చేయించారు’’అని శర్మ వివరించారు.

అయితే, ఈ విషయాన్ని ధ్రువీకరించే చారిత్రక ఆధారాలేమీ కనిపించడం లేదు. ఈ అంశంపై అలహాబాద్ యూనివర్సిటీలోని మధ్యయుగ చరిత్ర విభాగం ప్రొఫెసర్ హెరంబ్ చతుర్వేది మాట్లాడారు. ''ఆ కాలంలోని రచయితలు మథురలోని దేవాలయాన్ని ధ్వంసం చేయడం గురించి ప్రస్తావించారు. కానీ, కాశీ ఆలయం గురించి ఎలాంటి ప్రస్తావనా లేదు’’అని ఆయన అన్నారు.

మొహమ్మద్ యాసిన్

''ఔరంగజేబుకు సమకాలీనులైన సాకీ ముస్తయీద్ ఖాన్, జుజాన్ రాయ్ భండారి లాంటి రచయితల రచనలు చాలా ముఖ్యమైనవి. ఆ కాలానికి సంబంధించిన చాలా ముఖ్యమైన విషయాలను వారు గ్రంథస్థం చేశారు. కానీ, వారు విశ్వనాథ ఆలయాన్ని ధ్వంసం చేయడం గురించి ప్రస్తావించలేదు. ఔరంగజేబు హయాంలో భారత్ వచ్చిన విదేశీ పర్యటకులు కూడా దీన్ని గురించి ఏమీ పేర్కొనలేదు’’అని శర్మ పేర్కొన్నారు.

జ్ఞాన్‌వాపి మసీదు నిర్మాణంపై ప్రొఫెసర్ చతుర్వేది మాట్లాడుతూ.. ''ఆ మసీదును కచ్చితంగా ఎప్పుడు కట్టారో చెప్పే ఆధారాలేమీ ప్రస్తుతం అందుబాటులో లేవు. అసలు ఆ మసీదు మొదటిపేరు జ్ఞాన్‌వాపి అయ్యుండకపోవచ్చు. ఎందుకంటే అది ఒక స్కూల్ పేరు. పాత కాలంలో ఒక మతంలో ఒకేలాంటి ఆచారాలను పాటించే వర్గాన్ని ఒక స్కూల్‌గా చెబుతుంటారు. అలా జ్ఞాన్‌వాపి అనేది ఒక స్కూల్’’అని ఆయన చెప్పారు.

విశ్వనాథ మందిరం, జ్ఞాన్‌వాపి మసీదుపై సీనియర్ జర్నలిస్టు యోగేంద్ర శర్మ చాలా పరిశోధన చేపట్టారు. ''ఆ దేవాలయాన్ని అక్బర్ హయాంలోనే రాజా టోడర్‌మల్ నిర్మించారు. అయితే, వందేళ్ల తర్వాత ఔరంగజేబు హయాంలో దాన్ని ధ్వంసం చేశారు. ఆ తర్వాత 125 ఏళ్లు ఇక్కడ విశ్వనాథ ఆలయం లేదు. మళ్లీ 1735లో ఇందౌర్‌కు చెందిన మహారాణి దేవి అహిల్యాబాయి ఆ దేవాలయాన్ని పున:నిర్మించారు’’అని ఆయన అన్నారు.

''పురాణాల్లో ఆది విశ్వేశ్వర ఆలయం పేరుతో ఒక ఆలయం గురించి ప్రస్తావించారు. అది ప్రస్తుత విశ్వనాథ ఆలయమేనా అనే విషయంలో స్పష్టతలేదు. అయితే, మసీదును మాత్రం దేవాలయాన్ని ధ్వంసం చేసిన తర్వాతే నిర్మించారు. ఇక్కడ సమీపంలో జ్ఞాన్‌వాపి పేరుతో ఒక బావి ఉండేది. ఆ బావి ఇప్పటికీ అలానే ఉంది. దాని పేరు మీదే ఆ మసీదుకు ఆ పేరు పెట్టి ఉండొచ్చు’’అని ఆయన అన్నారు.

జ్ఞాన్‌వాపి మసీదు

జ్ఞాన్‌వాపి మసీదు నిర్మాణం ఎలా?

జ్ఞాన్‌వాపి మసీదు నిర్మాణానికి సంబంధించిన చరిత్రను పరిశీలిస్తే, 1883-84కాలంనాటి చారిత్రక ఆధారాలు మనకు కనిపిస్తాయి. జామా మసీద్ జ్ఞాన్‌వాపి పేరుతో రెవెన్యూ డాక్యుమెంట్లు అందుబాటులో ఉన్నాయి.

''ఈ రెవెన్యూ డాక్యుమెంట్ చాలా పాతది. దీని ఆధారంగా 1936లో స్థానిక కోర్టులో ఒక పిటిషన్ నమోదుచేశారు. దీంతో ఆ తర్వాత ఏడాది ఈ మసీదుకు మరమ్మతులు నిర్వహించేందుకు కోర్టు అంగీకారం తెలిపింది. ఇక్కడ మసీదు ఉందనే విషయాన్ని కూడా కోర్టు గుర్తించింది. ఈ నిర్ణయాన్ని ఆ తర్వాత హైకోర్టు కూడా సమర్థించింది. 1669కి ముందే ఈ మసీదు ఇక్కడ ఉంది. అప్పటినుంచే ప్రార్థనలు కూడా జరుగుతూ వస్తున్నాయి. కోవిడ్-19 వ్యాప్తి సమయంలోనూ మసీదులో మేం ప్రార్థనలు కొనసాగించాం’’అని సయ్యద్ మొహమ్మద్ యాసిన్ చెప్పారు.

అయితే, సయ్యద్ మొహమ్మద్ చెబుతున్నట్లుగా 1669కి ముందే, ఈ మసీదును నిర్మించినట్లు ధ్రువీకరించే ఎలాంటి ఆధారాలు మాకు లభించలేదు.

మరికొన్ని ఆసక్తికర అంశాలు..

అయితే, కాశీ విశ్వనాథ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి మసీదు నిర్మాణానికి ముడిపెడుతూ కొన్ని ఆసక్తికరమైన కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్. విశ్వంభర్ నాథ్ పాండే తన పుస్తకం ''ఇండియన్ కల్చర్, మొఘల్ హెరిటేజ్: ఔరంగజేబు ఫర్మాన్’’లోని 119, 120 పేజీల్లో ఈ అంశం గురించి ప్రస్తావించారు. రచయిత పట్టాభి సీతారామయ్య వ్యాఖ్యలను ఆయన దీనిలో ఉటంకించారు.

''ఔరంగజేబు బనారస్ గుండా వెళ్తున్నప్పుడు.. ఆయనకు సన్నిహితురాలైన కచ్ రాణిని కొందరు విశ్వనాథ దేవాలయంలో దోపిడీచేసిన సంగతిని తెలుసుకున్నారు. దీంతో వెంటనే ఆ ఆలయాన్ని ధ్వంసం చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు’’అని ఆ పుస్తకంలో పేర్కొన్నారు.

''ఔరంగజేబు ఆదేశాలను అనుసరించిన సైనికులు వెంటనే ఆ ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కచ్ రాణి వెంటనే.. ఆ ఘటనలో దేవాలయం తప్పేమీ లేదని, అక్కడ పండాలే దోపిడీకి పాల్పడ్డారని చెప్పారు. అక్కడ మళ్లీ దేవాలయం నిర్మించాలని ఆమె కోరారు. కానీ, ఔరంగజేబుకు అక్కడ దేవాలయం నిర్మించడానికి తన మతం అడ్డొచ్చింది. దీంతో రాణి ఆదేశాలకు అనుగుణంగా మందిరానికి బదులు ఆయన మసీదును నిర్మించారు’’అని విశ్వంభర్ నాథ్ రాసుకొచ్చారు.

ఆ ఘటన జరిగే ఉంటుందని ప్రొఫెసర్ రాజీవ్ ద్వివేదీ కూడా బీబీసీతో చెప్పారు. ''ఔరంగజేబుకు హిందువులపై ద్వేషం కాదు. రాణికి అక్కడ అవమానం జరిగిందని కోపం మాత్రమే ఉండొచ్చు’’అని ఆయన అన్నారు.

అయితే, ''దేవాలయం ధ్వంసం చేయడానికి మాత్రమే ఔరంగజేబు ఆదేశాలు ఇచ్చారు. కూలదోసే ప్రక్రియలను కఛ్‌వాహా పాలకుడు రాజా జై సింగ్ దగ్గరుండి పర్యవేక్షించారు’’అని ప్రొఫెసర్ చతుర్వేది చెప్పారు.

1991నాటి పిటిషన్లు

ఈ ఏడాది ఏప్రిల్‌లో జ్ఞాన్‌వాపి మసీదు ప్రాంగణంలో భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో సర్వే చేపట్టాలని స్థానిక కోర్టు ఆదేశించింది. 1991 నుంచి ఈ విషయంలో దాఖలైన పిటిషన్లను విచారిస్తూ కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. 1991లోనే ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్‌ను భారత పార్లమెంటు ఆమోదించింది.

1991 సెప్టెంబరు 18నాటి ఈ చట్టం ప్రకారం, 15 ఆగస్టు 1947కి ముందు సదరు ప్రార్థనా స్థలాలు ఏ మతాన్ని అనుసరిస్తున్నాయో ఆ తర్వాత కూడా అదే మతాన్ని పాటించాలి. ఈ నిబంధనను ఉల్లంఘించేందుకు ప్రయత్నిస్తే ఏడాది నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశముంది. అయితే, అయోధ్య కేసు ఈ చట్టం చేయకముందు నుంచీ పెండింగ్‌లో ఉండటంతో దీనికి ఆ చట్టం నుంచి మినహాయింపు ఇచ్చారు.

ఇక్కడ మసీదు-మందిరంపై మొదట్నుంచీ వివాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఈ వివాదం స్వాతంత్ర్యానికి ముందు నుంచీ ఉందని వారు వివరిస్తున్నారు. ఇక్కడ 1809లో మత ఘర్షణలు కూడా చెలరేగాయి.

''1991 చట్టం తర్వాత మసీదు, దేవాలయం మధ్య ఇనుము గోడ ఏర్పాటు చేశారు. గోడ నిర్మాణానికి ముందు ఇక్కడ పెద్ద ఘర్షణలేమీ జరగలేదు’’అని స్థానిక జర్నలిస్టు అజయ్ సింగ్ చెప్పారు. మరోవైపు ఇంతేజామియా కమిటీ జాయింట్ సెక్రటరీ సయ్యద్ మొహమ్మద్ యాసిన్ కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించారు.

''1937నాటి కోర్టు తీర్పు తర్వాత, మసీదు స్థలం ఎంత ఉందో నిర్ధారించారు. 1991లో కేవలం మసీదు చుట్టూ ఇనుము గోడ కట్టారు. అంతకుముందు ముందు ఎంత విస్తీర్ణంలో మసీదు ఉందో, ఇప్పుడు అంతే ఉంది. నాకు తెలిసినంతవరకు ఈ విషయంలో ఎలాంటి వివాదం లేదు. కొన్నిసార్లు శుక్రవారం ప్రార్థనలతో శివరాత్రి కూడా కలిసి వస్తుంది. అప్పుడు కూడా శాంతియుతంగానే రెండు వైపులా ప్రార్థనలు జరిగేవి’’అని యాసిన్ చెప్పారు.

1991లో సర్వే కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన హరిహర్ పాండే మాట్లాడుతూ ''1991లో నేను, సోమనాథ్ వ్యాస్, రామరంగ్ శర్మ కలిసి పిటిషన్ వేశాం. అయితే, ఆ ఇద్దరు ప్రాణాలతో లేరు’’అని ఆయన చెప్పారు.

స్థానిక కోర్టుల్లో ఈ పిటిషన్ దాఖలైన కొన్ని రోజులకే, దీనికి వ్యతిరేకంగా మసీదు మేనేజ్‌మెంట్ కమిటీ హైకోర్టుకు వెళ్లింది.

అయితే, 1993లో యాథాస్థితిని కొనసాగించాలని అలహాబాద్ హైకోర్టు సూచించింది. మళ్లీ 2019లో వారణాసి కోర్టులో ఈ కేసుకు సంబంధించిన పిటిషన్ల విచారణ మొదలుపెట్టారు. ఆ తర్వాత మసీదు ప్రాంగణంలో సర్వేకు అంగీకారం తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Varanasi: How was the Viswanatha Mandir and the Gnanavapi Masjid built side by side
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X