Vegetable Price: తగ్గుతున్న కూరగాయల ధరలు.. ఊపిరి పీల్చుకుంటున్న సామాన్యులు..!
గత రెండు నెలలుగా పెరుగుతూ వస్తున్న కూరగాయల తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా భారీగా పెరిగిన టమాటా ధరలు అదే స్థాయిలో తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్ లోని రైతు బజారుల్లో కిలో టమాటా రూ.30 నుంచి రూ.40 మధ్య ఉంది. అటు అల్లం, ఎలిగడ్డలు, క్యాప్సికమ్ ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఉల్లిగడ్డ ధరలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. కిలో ఉల్లి రూ.40 నుంచి రూ.50 పలుకుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఉల్లిఎగమతి పై పన్ను విధించింది. దీంతో ధరలు అదుపులో ఉండే అవకాశం ఉంది.
అయితే బియ్యం ధరలు మాత్రం తగ్గలేదు. గత కొద్ది రోజులు ధరలు స్థిరంగా ఉంటున్నాయి. బాస్మాతియేతర బియ్యం ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ముందస్తు చర్యలతో ధరలు దిగివస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. తాజా పంటల రాకతో ధరల తగ్గే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. గోధుమలు, బియ్యం సేకరణ ఊపందుకుందని తెలిపింది. ఆహార ధాన్యాల బఫర్ స్టాక్ నిల్వలు పెంచుతున్నామని చెప్పింది. త్వరలో ఆహార ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని భావిస్తుంది.

రిటైల్ ద్రవ్యోల్బణం 2023 జులైలో 15 నెలల గరిష్ఠానికి చేరి 7.44 శాతానికి చేరింది. కూరగాయలు, పప్పు ధాన్యాల ధరలు భారీగా పెరగడమే ఇందుకు కారణం. ముఖ్యంగా టమాటా పెరుగుదల ప్రభావం చూపింది. కర్ణాటకలోని కోలార్ జిల్లాలో తెల్ల ఈగ వ్యాధి కారణంగా టమాటా సరఫరా చైన్ లో అంతరాయం ఏర్పడింది. ఉత్తర భారతదేశంలో అధిక వర్షాల వల్ల టమాటా ధరలు పెరిగాయి. ఆహార ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ఇప్పటికే ముందస్తు చర్యలు చేపట్టిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా స్టాక్ రాక త్వరలో మార్కెట్లో ధరల ఒత్తిడిని తగ్గించే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆహార వస్తువుల ధరల ఒత్తిడి తాత్కాలికమేనని.. గ్లోబల్ మార్కెట్లలో ఆటుపోట్లు, దేశీయ మార్కెట్లలో ఇబ్బందులు రాబోయే నెలల్లో ఇన్ఫ్లేషన్ ఒత్తిడిని పెంచవచ్చని పేర్కొంది. టమాటా, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వంటి వస్తువులు 50 శాతానికి పైగా ద్రవ్యోల్బణాన్ని నమోదు చేశాయి. మరికొన్ని వస్తువుల ధరల అసాధారణ పెరుగుదల కనిపించింది. ఆగస్టు చివరి నాటికి లేదా సెప్టెంబరు ప్రారంభంలో తాజా స్టాక్‌ల రాకతో టమాటా ధరలు మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications