కోవిడ్ 19 టీకా రెండో డోసు తీసుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు...
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆదివారం(ఏప్రిల్ 4) కోవిడ్ 19 టీకా రెండో డోసు తీసుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు ఆయనకు టీకా వేశారు. టీకా తీసుకున్న అనంతరం కొద్దిసేపు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. అనంతరం తన నివాసానికి బయలుదేరారు. చెన్నైలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వెంకయ్య నాయుడు కోవిడ్ 19 టీకా మొదటి డోసు తీసుకున్న సంగతి తెలిసిందే.
'ఎయిమ్స్ ఆస్పత్రిలో కోవిడ్ 19 రెండో డోసు ఇవాళ తీసుకున్నాను. అర్హులైన ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా.దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.' అని వెంకయ్య నాయుడు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.

ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా మూడో దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. మూడో దశలో భాగంగా 45 ఏళ్లు నిండిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. రెండో దశలో 45 ఏళ్లు నిండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి మాత్రమే టీకా ఇచ్చారు. ప్రస్తుతం మూడో దశలో దీర్ఘకాలిక వ్యాధులు లేకపోయినా... 45 ఏళ్లు నిండినవారందరికీ టీకా ఇస్తున్నారు. వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ కోసం సమీప వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లవచ్చు. లేదా కోవిన్ పోర్టల్‌లో రిజస్టర్ చేసుకోవచ్చు. ఆరోగ్య సేతు యాప్ ద్వారా కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. ప్రభుత్వ ఆస్పత్రులు,క్లినిక్స్‌లో ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఒక డోసుకు రూ.250 చార్జి చేస్తారు.
వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం ఏదేని ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపిస్తే సరిపోతుంది. ఆధార్,డ్రైవింగ్ లైసెన్స్,నరేగా గ్యారెంటీ కార్డు,నరేగా జాబ్ కార్డ్,పాన్ కార్డు,బ్యాంకు లేదా పోస్టాఫీస్ పాస్ బుక్,పెన్షన్ డాక్యుమెంట్,సర్వీస్ ఐడెంటిటీ కార్డు,ఓటర్ ఐడీ కార్డు... ఇలా ఏ కార్డు చూపించైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు అవసరం లేదు. అయితే కొంతమందిలో నీరసం,ఫీవర్,వాంతులు,కీళ్ల నొప్పులు వంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించవచ్చు. ఒకటి,రెండు రోజుల్లోనే ఇవి తగ్గిపోతాయి. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సర్టిఫికెట్ అందజేస్తారు.












Click it and Unblock the Notifications