కూలీలకేం పని: వెంకయ్య, శేషాచలం ఎన్‌కౌంటర్‌పై హెచ్ఆర్సీ సీరియస్
న్యూఢిల్లీ/ చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు స్పందించారు. అడవుల్లో కూలీలకు ఏం పని అని ఆయన అడిగారు. ఉగ్రవాదులపై తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు నిఘా పెంచాలని, రెండు రాష్ర్టాలు సమన్వయంతో పనిచేయాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సూచించారు.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ర్టాలు కోరితే కేంద్రం సాయం చేస్తుందని చెప్పారు. ఎర్రచందనం స్మగ్లర్లపై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎర్రచందనం చెట్లు నరికివేయడం, తరలించడం నేరమని, కూలీలకు అడవుల్లో ఏం పని ఉంటుందని వెంకయ్య నాయుడు అన్నారు.
ఇదిలావుంటే, చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్ఆర్సీ) తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ డిజిపికి నోటీసులు జారీ చేసింది.

ఎర్రచందనమ స్మగ్లర్ల ఎన్‌కౌంటర్ అంశాన్ని ఎన్‌హెచ్ఆర్సీ సభ్యుడు జస్టిస్ మురగేశన్ సంఘం దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మావన హక్కుల ఉల్లంఘన జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపామనే పోలీసుల వాదనలో పస లేదని ఆయన అన్నారు. ఈ ఘటనపై ఈ నెల 23వ తేదీన హైదరాబాదులో వాదనలు వింటామని మానవ హక్కుల సంఘం ప్రకటించింది.
కాగా, చిత్తూరు జిల్లాలోని శేషాచలం ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఎర్రచందనం స్మగ్లర్ల మృత దేహాలను తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించింది.
తమిళనాడుకు చెందిన వేలూరు పోలీసులు కూడా ఎన్‌కౌంటర్ ప్రదేశాన్ని పరిశీలించారు. మృత దేహాలను తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించనున్నారు. పోస్టుమార్టం అనంతరం మృత దేహాలను వారి బంధువులకు అప్పగించనున్నారు.












Click it and Unblock the Notifications