రూ.3 వేల కోట్ల కావాలి.. టీకా సామర్థ్యం పెంచాలంటే తప్పదు: అధర్ పునావాలా
సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కరోనా టీకా ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు పెంచాలంటే 3 వేల కోట్ల పెట్టుబడి అవసరమని 'సీరం' ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా పేర్కొన్నారు. దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో టీకా ఉత్పత్తి పెంచాలన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. అధికంగా వినియోగిస్తున్న కొవిషీల్డ్ కరోనా టీకాను సీరమ్ తయారు చేస్తోంది.
కరోనా టీకాలపై ప్రస్తుత స్థాయి కంటే మరింత ఎక్కవగా లాభాలు ఆర్జించాల్సిన అవసరం ఉందని తెలిపారు. తద్వారా ఈ నిధులను టీకా ఉత్పత్తి సామర్థ్యం పెంచేందుకు వినియోగించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. 'ప్రస్తుతం 'సీరం' ప్రభుత్వానికి భారీ సబ్సీడీపై ఒక్కో టీకాను కేవలం రూ. 150-160కే సరఫరా చేస్తోంది. అయితే టీకా సగటు ధర మాత్రం దాదాపు 20 డాలర్లు (రూ. 1500) ఉంది. మోడీ ప్రభుత్వ అభ్యర్థన మేరకు మేం సబ్సీడీ ధరలకు టీకా సరఫరా చేస్తున్నామని చెప్పారు.

తమకు అసలు లాభాలే లేవని కాదు.. కానీ ఇంతకంటే ఎక్కువగా లాభాలు రావాల్సిన ఉందన్నారు. మళ్లీ పెట్టుబడి పెట్టేందుకు ఇదే కీలకంగా మారుతుందని చెప్పారు. ప్రస్తుతం టీకా సామర్థ్యం పెంచేందుకు రూ. 3 వేల కోట్లు అవసరం అన్నారు. ప్రక్రియ పూర్తి చేయడానికి 85 రోజుల సమయం పట్టొచ్చు అని చెప్పారు. మూడు నెలల లోపలే మేం టీకా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశం ఉందన్నారు. దీనిపై ఇప్పటికే తాము కేంద్రానికి లేఖ రాశామని, ఇది కుదరని పక్షంలో లోన్ల కోసం బ్యాంకులను ఆశ్రయిస్తామని తెలిపారు.
సీరం రోజుకు రెండు మిలియన్ డోసులను సరఫరా చేస్తోందని అదర్ చెప్పారు. ఇప్పటివరకు ప్రభుత్వానికి వంద మిలియన్ డోసులను ఇచ్చామన్నారు. ప్రస్తుతం నెలకు 60 నుంచి 60 మిలియన్ డోసుల ఉత్పత్తి జరుగుతోందని, దీన్ని 100 మిలియన్ డోసులకు పెంచాలనేది తమ లక్ష్యమని పేర్కొన్నారు. జనవరిలో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా టీకా సరఫరాలో కొంత ఆలస్యం జరిగిందని కూడా అదర్ పేర్కొన్నారు.