విజయ్ కు ఎదురైన అపశకునం
తమిళనాడులో పోలింగ్ ఆరంభమైంది. ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 234 నియోజకవర్గాలకు నేడు ఒకే దశలో ఓటింగ్ జరుగుతోంది. డీఎంకే, ఏఐఏడీఎంకే, టీవీకే.. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గెలిచి తీరాలనే పట్టుదలతో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించాయి. దీనికి అనుగుణంగా వ్యూహ ప్రతివ్యూహాలను రూపొందించుకున్నాయి. టీవీకే పూర్తిస్థాయిలో ఎన్నికల బరిలో నిల్చోవడం వల్ల త్రిముఖ పోరు ఏర్పడింది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ హోరాహోరి పోరు నెలకొంది. ఈ పోరులో విజేత ఎవరనేది మే 4వ తేలుతుంది.
టీవీకే చీఫ్ విజయ్ ఈ ఉదయమే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నీలాంకారైలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. పోలింగ్ కేంద్రానికి చేరుకున్నప్పుడు అక్కడ కొంత గందరగోళం నెలకొంది. విజయ్ రాకతో ఆయన అభిమానులు, మీడియా ప్రతినిధులు భారీ సంఖ్యలో ఒకేసారి దూసుకువచ్చారు. ఆయన ఫొటోలు తీయడానికి ఎగబడ్డారు. దీంతో అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక షామియానా కూలిపోయింది. షామియానాకు సపోర్ట్ గా పెట్టిన కర్రలు వంగిపోయాయి.

అదృష్టవశాత్తు.. అక్కడున్నవారికి ఎటువంటి గాయాలు కాలేదు. కూలిపోవడాన్ని గమనించిన వెంటనే అక్కడున్న వాళ్లు షామియానా పూర్తిగా కింద పడకుండా అడ్డుకున్నారు. అందరూ కలిసి దాన్ని నిలబెట్టారు. ఈ పరిణామం చర్చనీయాంశమౌతోంది. విజయ్ బహిరంగ ప్రదేశాల్లో కనిపించిన ప్రతిసారీ ఏదో ఒక అవాంతరం జరుగుతోందని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో కూడా ఆయన పాల్గొన్న అనేక ప్రచార సభల్లో, సమావేశలలో పలు దుర్ఘటనలు సంభవించాయి, కొన్ని ప్రాణ నష్టానికి కూడా దారితీశాయి.
గత ఏడాది సెప్టెంబర్ 27న కరూర్ జిల్లా వేలుచ్చామిపురంలో విజయ్ పాల్గొన్న టీవీకే ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ దారుణ ఘటనలో మరో 110 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ దుర్ఘటన తర్వాత విజయ్ రెండు నెలలకు పైగా ఏ బహిరంగ కార్యక్రమాల్లోనూ పాల్గొనలేదు. ఆ తదనంతరం పుదుచ్చేరి, కాంచీపురం, ఈరోడు, సేలం వంటి కొన్ని ప్రాంతాలలో ప్రజా సమావేశాలను నిర్వహించడం ప్రారంభించారు. ప్రజలతో మమేకమయ్యారు.
ఈ సమావేశాల్లో కూడా విషాదాలు వెంటాడాయి. ఫిబ్రవరి 13న సేలంలో జరిగిన సమావేశంలో ఒక వ్యక్తి మరణించడం మరోసారి దిగ్భ్రాంతిని కలిగించింది. విక్రవాండి సమీపంలో నిర్వహించిన ఈ మహాసభకు ఉదయం నుండే లక్షలాది మంది కార్యకర్తలు తరలివచ్చారు. మధ్యాహ్నం 4 గంటల తర్వాత విజయ్ వేదికపైకి చేరుకున్నారు. ఉదయం నుండి లక్షలాది మంది జనం నీళ్లు లేక,తీవ్రమైన ఎండను తట్టుకోలేక వందలాది మంది మూర్ఛపోయారు.












Click it and Unblock the Notifications