ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు రూ.2500 + ఫ్రీ బస్సు, ఉచిత కరెంట్, అమ్మాయిలకు తులం బంగారం..
తమిళనాడులో ఎన్నికల సంగ్రామం కీలక దశకు చేరింది. ఏప్రిల్ 23న తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో తొలిసారిగా పోటీ చేస్తున్న టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ దళపతి ఈ మేరకు ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ఓటర్లపై హామీల వర్షం కురిపించారు. ప్రతి కుటుంబానికి ఏడాదికి ఆరు గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని ప్రకటించారు. అలాగే రాష్ట్రంలో అర్హులైన ప్రతి మహిళకు నెలకు రూ. 2500 ఇస్తామని తెలిపారు. దాంతోపాటు ఉచిత కరెంట్, అమ్మాయిలకు బంగారం కూడా ఇస్తామని విజయ్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు.
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. రాష్ట్రంలో మరో వారం రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశాయి. డీఎంకే, టీవీకే, ఏఐఏడీఎంకే పార్టీలన్నీ నువ్వా..? నేనా..? అన్నట్లుగా భీకర పోటీని కొనసాగిస్తున్నాయి. అయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టి దళపతి విజయ్ పైనే ఉంది. సినిమాల్లో తన నటనతో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు విజయ్. ఆ తర్వాత టీవీకే పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఆయన బరిలోకి దిగనున్నారు.
ఇక తాజాగా తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో టీవీకే పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోను విజయ్ విడుదల చేశారు. మహిళలు, యువత, రైతులే లక్ష్యంగా హామీల వర్షం కురిపించారు. మేనిఫెస్టోలో భాగంగా ప్రతి మహిళకు ప్రతి నెలా రూ. 2,500 అందజేయనున్నారు. అలాగే రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి అమ్మాయిలకు పెళ్లి కానుకగా ఒక తులం బంగారం అందజేయనున్నారు. అలాగే ఓ నాణ్యమైన పట్టు చీర ఇవ్వనున్నారు. ఇక ప్రతి కుటుంబానికి ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లు అందజేయనున్నారు.
అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు విజయ్ తన టీవీకే మేనిఫెస్టోలో ప్రకటించారు. వీటితోపాటు 29 ఏళ్ల పైబడిన నిరుద్యోగులకు ప్రతి నెలా రూ. 4 వేలు ఆర్థిక సాయం చేయనున్నారు. ఇక అలాగే ఒకటి నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఏటా రూ. 15 వేలు స్కాలర్ షిప్ రూపంలో విద్యార్థుల తల్లుల అకౌంట్ లో జమ చేయనున్నారు. వీటితోపాటు యువతకు నైపుణ్యాభివృద్ధి కోసం ఇంటర్న్ షిప్ అవకాశాలు మెరుగుపరచనున్నారు. ఇంకా తమిళనాడు రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఆడ బిడ్డకు ఒక బంగారం ఉంగరం అందజేయనున్నట్లు విజయ్ తెలిపారు. అలాగే శిశు సంక్షేమ కిట్ ను కూడా ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.

వీటితోపాటుగా రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలకు రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నట్లు విజయ్ స్పష్టం చేశారు. అలాగే కేంద్ర సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు ఏటా రూ. 5 లక్షలు పూర్తిగా సబ్సిడీ ఇవ్వనున్నట్లు టీవీకే మేనిఫెస్టోలో ప్రకటించింది. ఇక విజయ్ ఎన్నికల ప్రచారాన్ని ఇప్పటికే ఉద్ధృతం చేశారు. ఏప్రిల్ 23 న రాష్ట్రంలోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు గాను పోలింగ్ జరగనుంది. మే 4 న ఫలితాలు వెల్లడి కానున్నాయి.












Click it and Unblock the Notifications