రెజ్లింగ్ రింగ్ నుంచి ఎన్నికల బరిలో వినేష్ ఫొగట్: మూడు సీట్లల్లో..!!
Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్ 2024లో అనర్హత వేటుకు గురైన భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫొగట్.. సంచలనాలకు తెర తీశారు. రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతోన్నారు. రెజ్లింగ్ రింగ్ నుంచి ఎన్నికల బరిలో దిగబోతోన్నారు. సహచర రెజ్లర్ బజరంగ్ పునియాతో కలిసి రాజకీయాల్లో అరంగేట్రం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ తీర్థాన్ని పుచ్చుకోనున్నారు.
ఇటీవలే ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 50 కేజీల రెజ్లింగ్ విభాగంలో వినేష్ ఫొగట్ ఫైనల్స్ వరకు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. తుదిపోరులో అమెరికాకు చెందిన రెజ్లర్ సారా హిండెబ్రాండ్‌ను ఢీ కొట్టాల్సి ఉండగా.. బౌట్ ఆరంభానికి కొన్ని గంటల ముందు డిస్ క్వాలిఫై అయ్యారు. 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఫొగట్ అనర్హత వేటుకు గురయ్యారు. ఫలితంగా ఒక్క పతకం కూడా దక్కించుకోలేకపోయారు.

ఈ పరిస్థితుల మధ్య ఇక రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతోండటం సంచలనం రేపుతోంది. బజరంగ్ పునియాతో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో రెండు రోజుల కిందటే దేశ రాజధానిలో సమావేశం అయ్యారు. అనంతరం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కేసీ వేణుగోపాల్‌తోనూ భేటీ అయ్యారు.
కొద్దిసేపటి కిందటే ఆమె రైల్వేలో ఉద్యోగానికి రాజీనామా చేశారు. నార్తర్న్ రైల్వేలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ / స్పోర్ట్ లెవెల్ 7 గా రైల్వేలో పని చేస్తోన్నారు. రాజకీయాల్లో అడుగు పెట్టబోతోన్నందున రైల్వే ఓఎస్డీ ఉద్యోగానికి ఆమె రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను నార్తర్న్ రైల్వే జనరల్ మేనేజర్‌కు పంపించారు.
ఆ వెంటనే వినేష్ ఫొగట్, బజరంగ్ పునియా.. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున్ ఖర్గేతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. మర్యాదపూరకంగా కలుసుకున్నారు. రాజకీయ అరంగేట్రంపై తన అభిప్రాయాలను తెలియజేశారు. కాంగ్రెస్‌లో చేరాలనే ఆకాంక్షను బయటపెట్టారు.
త్వరలో హర్యానాలో జరిగే ఎన్నికల బహిరంగ సభ సందర్భంగా వారిద్దరూ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకొంటారని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా గాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో పార్టీలో చేరొచ్చు.
త్వరలో జరగబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వినేష్ ఫొగట్, బజరంగ్ పునియా పోటీ చేయడం లాంఛనప్రాయమే. వారిద్దరి కోసం మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు- చర్ఖీ దాద్రి, బద్లి, ఝులానా పేర్లను పరిశీలిస్తోన్నారు. సామాజిక వర్గాల వారీగా వినేష్ ఫొగట్, బజరంగ్ పునియాకు బలమైన ఓటుబ్యాంక్ ఉండటమే దీనికి కారణం.












Click it and Unblock the Notifications