విదేశాలకు డబ్బును తరలించేందుకు వీఐపీ విమానాలు వినియోగిచారు: ఈడీ
ఢిల్లీ: దేశంలోని డబ్బును విదేశాలకు పెద్ద ఎత్తున తరలించేందుకు వీఐపీలు వినియోగించే విమానాన్ని వినియోగించారా... వీఐపీల విమానాలను పెద్దగా తనిఖీ చేయకపోవడమే కొందరు అడ్వాంటేజ్‌గా తీసుకున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మాజీ జర్నలిస్టు, వ్యాపారవేత్త అయిన ఉప్పేంద్ర రాయ్‌ని ఈ ఏడాది మేలో సీబీఐ అరెస్టు చేయడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసును విచారణ చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్ ఈడీకి కూడా పలు షాకింగ్ విషయాలు తెలిశాయి.

వీఐపీ విమానాల్లో డబ్బు తరలింపు..?
దేశ విదేశాలకు పెద్దమొత్తంలో డబ్బును తరలించేందుక వీఐపీలు తమ ప్రయాణాలకోసం వినియోగించే ఛాటర్డ్ విమానాలను ఉపేంద్ర రాయ్ వినియోగించినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేసింది. వీఐపీ విమానాలను పెద్దగా తనిఖీ చేయరు. దీన్నే ఆసరాగా చేసుకుని అందులో కొన్ని ప్రత్యేకంగా రంద్రాలు చేయించి అందులో క్యాష్‌ను దాచి దేశాలను దాటించే వారని ఈడీ చెబుతోంది. అయితే ఇది విమానం యజమానులకు తెలిసే జరిగిందా లేక వారికి అస్సలు ఇది తెలియదా అనేదానిపై విచారణ జరపుతున్నట్లు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలు చెప్పాయి. ఇందులో ప్రయాణించే వీఐపీలను కూడా విచారణ చేసే అవకాశమున్నట్లు సీబీఐ, ఈడీలు తెలిపాయి.
మాజీ జర్నలిస్టు, వ్యాపారవేత్త ఉప్పేంద్ర రాయ్ ఏరోడ్రోమ్‌లోకి ప్రవేశించేందుకు పాస్ జారీ చేయాలని పౌరవిమానాయానా శాఖను భద్రతా అధికారులను కోరారు. ఇందుకోసం ఆయన తప్పుడు డాక్యేమెంట్లను సమర్పించడంతో ఇది వెలుగులోకి వచ్చింది. దేశంలోని అన్ని విమానాశ్రయాలకు ఎంట్రీ పొందేలా పాస్ జారీ చేసింది భద్రతా సిబ్బంది. ఉప్పేంద్ర రాయ్ తరుచూ ప్రయాణించే ఎయిర్ వన్ విమాన సిబ్బందిని కూడా సీబీఐ అరెస్టు చేసింది కానీ... అసలు రాయ్ ఎందుకు ఈ పాస్‌కోసం దరఖాస్తు చేశాడో అనేది ఇంకా తేల్చలేదు.

విమానం లోపల డబ్బును అమర్చేందుకు రీ మోడలింగ్
ఇదిలా ఉంటే ఉప్పేంద్ర రాయ్‌కు సంబంధించిన రూ.26 కోట్ల ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. అంతేకాదు షెల్ కంపెనీల ద్వారా తన కంపెనీల్లోకి నిధులు బలవంతంగా తరలించేవాడని ఈడీ వెల్లడించింది. అంతేకాదు రాయ్ ఒక ఏవియేషన్ ఇంజనీర్‌తో కలిసి ప్రైవేట్ విమానాల్లో ఎవ్వరికీ కనిపించకుండా ఉండేలా పాకెట్స్ తయారు చేయాలని సూచించేవాడని ఈడీ వెల్లడించింది. విమాన యజమానికి తెలియకుండా ఈ పాకెట్స్‌లో క్యాష్ నింపి దేశాన్ని దాటించేవాడని ఈడీ చెబుతోంది. ఇందుకోసం తనిఖీలు తక్కువగా నిర్వహించే వీఐపీ విమానాలనే టార్గెట్‌గా చేసుకునేవాడని ఈడీ వెల్లడించింది.

దుబాయ్‌లో చాలాకాలంగా పార్క్ చేసి ఉన్న ఎయిర్ వన్ విమానం
ఉప్పేంద్ర రాయ్ ఎక్కువగా ఎయిర్ వన్ విమానంనే వినియోగించేవాడని తెలిపిన ఈడీ... దుబాయ్‌లో ఎక్కువ కాలం ఈ విమానాలు పార్క్ చేసి ఉండేవని తెలిపింది. ఎక్కువకాలం విమానం అక్కడే పార్క్ చేసి ఉండటంతో అనుమానం వచ్చినట్లు ఈడీ పేర్కొంది. దుబాయ్ ప్రధాన విమానాశ్రయం కాకుండా అల్ మక్టూమ్ అంతర్జాతీయ విమానాశ్రయంను పార్కింగ్ కోసం వినియోగించేవాడని తెలిపింది. దుబాయ్‌తో పాటు ఎయిర్ వన్ విమానాలు రష్యాకు కూడా వెళ్లేవని ఈడీ వివరించింది.
ఇక 2016 నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎంత మొత్తంలో డబ్బులు విదేశాలు దాటాయనే దానిపై అధికారులు దృష్టి సారించారు. అంతేకాదు పెద్ద నోట్ల రద్దు తర్వాత ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయ లిమిటెడ్‌కు కొన్ని విదేశీ సంస్థలు పలు ప్రశ్నలు సంధించాయి. ఢిల్లీ విమానాశ్రయం నుంచి వచ్చిన విమానాల్లో భారీ ఎత్తున డబ్బులు దొరికిందని వాటికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని విదేశీ సంస్థలు కోరాయి. అయితే ఇందుకు ఢిల్లీ విమానాశ్రయ వర్గాలు మాత్రం సమాచారం ఇచ్చేందుకు నిరాకరించారు.

చిన్న విమానాశ్రయాల్లో డబ్బును నింపేవారు..?
దేశంలో మొత్తం 400 చిన్న విమానాశ్రయాలుండగా అందులో 100 మాత్రమే కమర్షియల్ ఆపరేషన్స్‌కు వినియోగిస్తున్నారు. వీఐపీ విమానాల్లో డబ్బును నింపేందుకు ఈ చిన్న విమానాశ్రాయాలను టార్గెట్‌గా చేసుకుని ఉండొచ్చనే అనుమానం విచారణాధికారులు వ్యక్తం చేస్తున్నారు . ప్రైవేట్ విమానలను కూడా కస్టమ్స్ అధికారులు చెక్ చేయాల్సి ఉంటుంది. అయితే అందులో వీఐపీ ఉండటంతో వారు ఎలాంటి తనిఖీలు చేయరని ఈడీ స్పష్టం చేసింది. అయితే ఈ భద్రతా ప్రమాణాలను ఉల్లంఘిస్తూ డబ్బులు విదేశాలకు తరలించడంలో ఎవరు ముఖ్య పాత్ర పోషించి ఉంటారో ఇంకా తెలియడం లేదని చెప్పింది ఈడీ. ఉప్పేంద్ర రాయ్‌కు పాస్ ఇవ్వడం వెనక ఎయిర్ వన్ యాజమాన్యం ఉందని, ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్ నుంచి కూడా దరఖాస్తు రావడంతో తాము పాస్ జారీ చేశామని బీసీఏఎస్ తెలిపింది.












Click it and Unblock the Notifications