విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖ స్టీల్ ప్లాంట్: ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమానికి గంటా శ్రీనివాసరావు పిలుపు.. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కేంద్ర ప్రభుత్వ వాటా వంద శాతాన్ని ఉపసంహరించుకోవడానికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ ఆమోదం తెలిపింది.

ఈ విషయాన్ని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ (DIPAM) కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే తన అధికారిక ట్వీటర్ ఖాతాలో పేర్కొన్నారు.

దీంతో 'విశాఖ ఉక్కు...ఆంధ్రుల హక్కు'అంటూ ప్రాణ త్యాగాలతో సాధించుకున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని... ప్రైవేటు పరం చేస్తే సహించమంటూ కార్మికులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళన బాటపట్టాయి.

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేస్తున్నందుకు నిరసనగా మాజీ మంత్రి, విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మేల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. మిగతా వారంతా కూడా రాజీనామా చేసి స్టీల్ ప్లాంట్ కోసం ప్రజా ఉద్యమం చేసేందుకు కదిలి రావాలని పిలుపునిచ్చారు.

"స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. విశాఖ ఒడిలో ఎదిగిన వ్యక్తిగా నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశా. ఈ రాజీనామాతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి తొలి అడుగు వేశాను.

పార్టీలకు అతీతంగా నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసి అంతా పోరాటం చేయాలి.

స్టీల్ ప్టాంట్‌కు సొంత గనులుంటే టన్ను ఉక్కు ఉత్పత్తికి రూ.5 వేల రూపాయలు ఖర్చు తగ్గుతుంది.

స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా ఒక ప్రజా ఉద్యమం గా మారాలి.

దిల్లీలో రైతులు, తమిళనాడు జల్లికట్టు ఉద్యమంలా ప్రతి ఒక్కరు ఉద్యమంలోకి రావాలి.

మన ముఖ్యమంత్రి.. ప్రధానిపై ఒత్తిడి తీసుకు వచ్చి ప్రైవేటీకరణ ఆపాలి.

నీతి ఆయోగ్ నిర్ణయాలన్నీ ప్రభుత్వం అమలు చేయాలని లేదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం మరోసారి ఆలోచించాలి" అని గంటా మీడియాతో అన్నారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్

వీఆర్‌ఎస్ తీసుకొచ్చినప్పుడే..

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ప్రభుత్వ వాటాల విక్రయానికి గతంలోనే ప్రయత్నాలు జరిగాయి.

అయితే ఇది క్రమంగా ప్రైవేటైజేషన్‌కు దారి తీస్తుందని కార్మికుల పెద్ద ఎత్తున చేసిన పోరాటాలతో ఆ ప్రయత్నాలకు చెక్ పడింది.

అయితే గత ఏడాది (2020) నవంబరులో విశాఖ స్టీల్ ప్లాంట్‌లో వీఆర్ఎస్ స్కీమ్‌ని ప్రవేశ పెట్టినప్పుడే ప్లాంట్ ప్రైవేటీకరణకు పెద్ద కుట్ర జరుగుతుందని కార్మిక సంఘాలు ఆందోళన చెందాయి.

ముందుగా వీఆర్ఎస్, ఆ తరువాత నష్టాలు అంటూ పోస్కో (POSCO - Pohang Iron and Steel Company) వంటి కార్పొరేట్ కంపెనీలకు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు అనుమానాలు వ్యక్తపరిచాయి.

ఆనాడు ఈ విషయంపై స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులతో బీబీసీ మాట్లాడింది. "రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (RINL), కొరియాకు చెందిన పోస్కో సంస్థలు సంయుక్తంగా విశాఖపట్నంలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకున్నాయి.

ఈ రెండింటి మధ్య నాన్ బైడింగ్ ఎంవోయూ కుదిరింది. అంతకు మించి ఇంకేమి లేదు" అని స్టీల్ ప్లాంట్ ఉన్నాతాధికారులు బీబీసీతో చెప్పారు.

వీఆర్ఎస్‌ను తెర మీదకు తెచ్చిన మూడు నెలల్లోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లోని ప్రభుత్వానికి ఉన్న 100 శాతం వాటాను ఉపసంహరించుకునేందుకు రంగం సిద్ధం చేసింది.

దీంతో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే దిల్లీ రైతు ఉద్యమం తరహాలోనే ఇక్కడా ఉద్యమం చేస్తామంటూ కార్మికులు హెచ్చరిస్తున్నారు.

కార్పొరేట్లకు అప్పగించేందుకే..

ఆంధ్రుల పోరాటంతో విశాఖలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటైంది.

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో 100 శాతం వాటా కేంద్ర ప్రభుత్వానిదే.

గతంలో ఉత్పత్తుల్లో అనేక రికార్డులు సాధించిన విశాఖ స్టీల్ ప్లాంట్ 2015 నుంచి నష్టాలను చవిచూస్తోంది.

గత రెండేళ్లలో నష్టాలు మరింత పెరిగాయి. విశాఖ ఉక్కుకు సొంత గనులు లేకపోవడమేనని దీనికి ప్రధాన కారణమని కార్మిక సంఘాలు అంటున్నాయి.

"జిందాల్, ఎస్సార్ వంటి ప్రైవేటు సంస్థలకు ఒడిశాలో గనులను కేటాయించిన ప్రభుత్వం... విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనులు కేటాయించలేదు.

సొంత గనులు లేకపోవడంతో ముడి ఖనిజాన్ని కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో ఉత్పత్తి వ్యయం పెరుగుతోంది.

కరోనావైరస్ వ్యాప్తి నడుమ ఆంక్షలు, విదేశాల నుంచి ఇనుము దిగుమతి వంటివి కూడా నష్టాలను మరింత పెంచాయి.

ఇప్పుడు ఆ నష్టాలనే సాకుగా చూపించి కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థను పూర్తిగా ప్రైవేటుకు అప్పగించడానికి సిద్ధమైంది.

2015-16 నుంచి 2019-20 వరకూ రూ. 4600 కోట్ల నుంచి రూ.5 వేల కోట్లు వరకు నష్టం వచ్చిందని అంచనా.

ప్లాంట్ ఆధునికీకరణ, విస్తరణ చేపట్టడం వలన కూడా ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి.

అలాగే ఉక్కు ఉత్పత్తి ఖర్చులు కూడా సుమారు 10 శాతం పెరిగాయి. ప్రస్తుతం దేశంలో స్టీలుకు డిమాండు పెరుగుతుండటంతో భవిష్యత్తులో మళ్లీ లాభాల బాటపట్టే అవకాశం ఉంది. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు సిద్ధమైంది. నష్టాలకు కారణాలను అన్వేషించి...పరిష్కారం చూపించాల్సిందిపోయి...ప్రైవేటీకరణకు మొగ్గు చూపడం అన్యాయం" అని స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘం నాయకుడు మంత్రి మూర్తి అన్నారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్

''ఎటాచ్‌మెంట్... సెంటిమెంట్''

విశాఖపట్నంలో ఏర్పాటైన స్టీల్ ప్లాంట్ కోసం ఎందరో పోరాటాలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నలు మూలల నుంచి కూడా 'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' అంటూ సాగిన ఉద్యమంలో పాల్గొన్నారు.

1966లో గుంటూరు జిల్లాకు చెందిన టి.అమృతరావు విశాఖలో దీక్ష ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో దీనిలో పాల్గొన్నారు. తరగతుల బహిష్కరణ, ఆందోళనలతో నిరసనలు పెద్ద ఎత్తున సాగాయి. రాజకీయ పక్షాలు కూడా విద్యార్థులకు మద్దతుగా నిలిచాయి.

1966 నవంబర్ 1వ తేదీన విశాఖపట్నంలో విద్యార్థులు చేపట్టిన భారీ ర్యాలీని చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఇందులో 9 మంది మరణించారు.

మరోవైపు విశాఖలో విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా ఉమ్మడి రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఆందోళనలు జరిగాయి. అవి కూడా పోలీసు కాల్పులకు దారితీశాయి. ఈ కాల్పుల్లో అదిలాబాద్‌, వరంగల్, విజయవాడ, విజయనగరం, తగరపువలస, కాకినాడ, సీలేరు, గుంటూరులలో మొత్తం 23 మంది మరణించారు.

విశాఖతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది ప్రాణాలు కోల్పోయారు.

స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘం నాయకుడు గంధం వెంకటరావు బీబీసీతో నాటి విషయాలను చెప్పుకొచ్చారు.

"అన్ని ప్రాంతాల వారు ప్రాణాలు అర్పించి సాధించుకున్న విశాఖపట్నం స్టీల్‌ప్లాంటుతో అందరికీ అనుబంధం ఉంటుంది.

విశాఖ స్టీల్ ప్లాంట్ పేరు చెప్పగానే...అందరికీ ఇది మాదే అనే అనుభూతి కలుగుతుంది. చాలా మంది ఇక్కడ తయారైన స్టీల్‌తో తమ ఇళ్లను నిర్మించుకోవడాన్ని సెంటిమెంట్‌గా కూడా భావిస్తారు.

కర్మాగారంలో శాశ్వత ఉద్యోగులు 17 వేల మంది వరకు ఉండగా, కాంట్రాక్టు ఉద్యోగులు మరో 18 వేల మంది వరకు పనిచేస్తున్నారు.

వీరే కాకుండా స్టీల్ ప్లాంట్‌కు అనుబంధంగా పనిచేసే చిన్నతరహా పరిశ్రమలపై మరో లక్ష మంది వరకు ఉపాధి పొందుతున్నారు.

ఇంత మంది జీవితాలతో ముడిపడి ఉన్న ప్లాంట్ ని కేంద్ర ప్రభుత్వం ఏలా ప్రయివేటీకరిస్తుంది...? కేంద్రానికి అసలు స్టీల్ ప్లాంట్ చరిత్ర తెలుసా...?" అని వెంకటరావు ప్రశ్నించారు.

''భూములు ఇచ్చేయండి''

స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం నాడు పొలాలు, భూములతోపాటు ఆ భూములకు అనుకుని ఉన్న కొండలతో కలిపి సుమారు 26 వేల ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది.

ప్లాంట్‌, టౌన్‌షిప్‌ నిర్మాణం చేయగా ఇంకా సుమారు 8,500 ఎకరాల భూమి స్టీల్‌ ప్లాంట్‌ వద్ద ఉందని ప్లాంట్ నిర్వాసితులు అంటున్నారు.

ప్లాంట్‌ నిర్మాణం కోసం సుమారు 18 వేల మంది భూములు ఇచ్చినప్పటికీ వారిలో సగం మందికి మాత్రమే ప్లాంట్‌లో ఉద్యోగాలు లభించాయి.

ఇంకా చాలా మంది ఆర్ కార్డులు (నిర్వాసితులకిచ్చే గుర్తింపు కార్డులు) పట్టుకుని ఉద్యోగాలు కోసం ఎదురు చూస్తున్నారు.

"అప్పట్లో పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని స్టీల్ ప్లాంట్ కోసం మా పెద్దలు భూములు ఇచ్చారు.

మొత్తం 64 గ్రామాల నుంచి 26 వేల ఎకరాలను సేకరించించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నా...ఇంకా మాకు ఉద్యోగాలు రాలేదు. ప్లాంట్ వారిచ్చిన ఆర్ కార్డులు పట్టుకుని అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాం.

ఇంతలో పిడుగులాంటి ప్రైవేటీకరణ వార్త తెలిసింది. మాకు ఏం చేయాలో తెలియడం లేదు.

ప్రైవేటీకరణ చేద్దామని కేంద్ర ప్రభుత్వం అనుకుంటే మా భూములు మాకు తిరిగి ఇచ్చేయమనండి.

ఇప్పుడు ఎకరం ఐదు కోట్లకు పైనే పలుకుతుంది. లేదా ప్రయివేటికరణ ఊసెత్తకుండా...మాకు ఉద్యోగాలు కల్పించాలి. లేదంటే రాజకీయ పక్షాలతో కలిసి నిర్వాసితులమంతా దిల్లీలో రైతుల్లా ఉద్యమం చేస్తాం" అని స్టీల్ ప్లాంట్ నిర్వాసితుడు, ఆర్ కార్డు హోల్డర్ రామిరెడ్డి బీబీసీతో అన్నారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్

భూముల విలువే లక్ష కోట్లు

''స్టీల్ ప్లాంట్‌కు ప్రధాన సమస్య సొంత గనులు లేకపోవడమే. ఈ కర్మాగారం లాభాల నుంచి నష్టాలపాలు అవ్వడానికి ఇదే ప్రధాన కారణం.

స్టీల్ ప్లాంట్ నుంచి కేంద్రం ఎంతో ఆదాయాన్ని పొంది...ఇప్పుడు ప్రయివేటీకరిస్తున్నామని చెప్పడం సరైన చర్య కాదని.. దీనిపై సీఎం జగన్ కేంద్రంతో మాట్లాడాలి''అని మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ.. ముఖ్యమంత్రికి లేఖ రాశారు.

"వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం 1971లో రైతుల వద్ద నుంచి భూసేకరణ చట్టం పేరుతో 20 వేల ఎకరాలకు పైగా వ్యవసాయ భూములను సేకరించింది.

ఈ భూమి విలువ ఈరోజు మార్కెట్ ధరల తో పోలిస్తే లక్ష కోట్లకు పైమాటే. అటువంటి భూమిని ప్రైవేట్ కంపెనీలకు అప్పగించాలని అనుకోవడం అన్యాయం.

విశాఖ ఉక్కు కర్మాగారం కేంద్ర ప్రభుత్వానికి ఏటా ట్యాక్సుల రూపంలో వేలాది కోట్ల రూపాయలు చెల్లిస్తోంది.

కొన్ని సంవత్సరాలుగా విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ప్రైవేట్ యాజమాన్యాలు కన్ను వేశాయి. ఒడిశాలో ప్లాంట్ పెట్టేందుకు పాస్కోకు వ్యతిరేకత ఎదురవడంతో విశాఖ స్టీల్ ప్లాంట్ పై దృష్టి పెట్టింది. బహుశా పోస్కోకు స్టీల్ ప్లాంట్‌ను అప్పగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనపడుతుంది అని ఈఏఎస్ శర్మ బీబీసీతో అన్నారు.

పోస్కో స్టీల్

స్టీల్ ప్లాంటే విశాఖకి ఆధారం

విశాఖ స్టీల్ ఫ్లాంట్‌ను అమ్మకానికి పెట్టడం చాలా బాధాకరం, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోలేకపోవడం సిగ్గుచేటని సీనియర్ టీడీపీ నాయకుడు అయ్యన్నపాత్రుడు బీబీసీతో అన్నారు.

"సీఎం జగన్ మోహన్ రెడ్డి కేసులకి భయపడి కేంద్రంతో ఏ విషయంలోనూ పోరాటం చేయలేకపోతున్నారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్...ఇప్పుడు స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ...ఇలా రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే ఏ అంశంలోనూ జగన్ కేంద్రాన్ని నిలదీయలేకపోతున్నారు. అప్పట్లో 64 గ్రామాల ప్రజలు ఫ్యాక్టరీకి తమ భూములను త్యాగం చేశారు. విశాఖలో 25 శాతం మంది స్టీల్ ఫ్లాంట్‌పై ఆధారపడి జీవిస్తున్నారు. అసలు విశాఖ అభివృద్ధికి కారణం స్టీల్ ప్లాంటే. కానీ ఇటువంటి పెద్ద సమస్య వచ్చినప్పుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉంటున్నారు? సీఎం అయ్యాక జగన్ మోహన్ రెడ్డి 20 సార్లు దిల్లీ వెళ్ళి... ఏం సాధించారు? రాష్ట్రాన్ని జగన్ మోహన్ రెడ్డి తన వ్యాపార సంస్థగా మార్చుకున్నారు" అని అయ్యన్న పాత్రుడు విమర్శించారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్

అవసరమైతే రాజీనామాలు చేస్తాం

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళనలు పార్టీలకు అతీతంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం రాజకీయాలతో పని లేకుండా విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నామని వైకాపా ఎంపీలు అన్నారు.

"విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కోసం పార్లమెంట్‌లో పోరాడతాం. 32 మంది ప్రాణ త్యాగాలతో ఏర్పాటైన స్టీల్‌ ప్లాంట్‌ను…ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుని తీరుతాం. స్టీల్‌ ప్లాంట్‌ కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం. కరోనాతో ఆర్థిక వ్యవస్థ కుదేలైందన్న సాకుతో.. వేల కోట్లు లాభాలు ఆర్జించిన స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేట్‌ పరం చేయాలనుకోవడం తగదు. ఎంతో ఘన చరిత్ర కలిగి...ఉద్యమాలతో సాధించుకున్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కోసం పార్లమెంట్‌లో ఇతర ఎంపీలతో కలిసిపోరాడతాం. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటీకే ప్రధానికి, కేంద్ర మంత్రులకు లేఖలు రాశాం. ఒక వేళ అవసరమైతే రాజీనామాలకు కూడా సిద్ధం" అని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, అనకాపల్లి ఎంపీ కె. సత్యవతి అన్నారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్

పార్టీలు ఏమన్నాయంటే...

"ఎంతో ప్రాముఖ్యం ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్పై కేంద్రం నిర్ణయం రాష్ట్ర ప్రజలకు బాధ కలిగిస్తోంది. ఇది ఆంధ్రుల మనోభావాలకు సంబంధించిన నిర్ణయం కాబట్టి...దీనిపై తమ ప్రభుత్వంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం." - మంత్రి బొత్స సత్యనారాయణ

"విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కేవలం ఒక పరిశ్రమగా మాత్రమే చూడొద్దు. విశాఖ ఉక్కు మా ఆత్మ గౌరవం. విశాఖ ఉక్కు నుంచి విశాఖను వేరు చేయడం అంటే మా ప్రాణాల్ని మా దేహాల నుంచి వేరు చేయడమే. అసలు కేంద్రం తీరు చూస్తుంటే దక్షిణ భారతీయులుపై వివక్ష చూపుతున్నట్లు ఉంది." - టీడీపీ సీనియర్ నాయకుడు పల్లా శ్రీనివాసరావు

విశాఖ స్టీల్‌ ప్లాంట్

"2000 సంవత్సరంలో నా తండ్రి ఎర్రన్నాయుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను పార్లమెంట్‌లో అడ్డుకున్నారు. వైసీపీలోని 28 మంది ఎంపీలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఎందుకు అడ్డుకోలేకపోయారు. వైసీపీ ప్రభుత్వం చేతగానితనానికి ఇది నిదర్శనం." - శ్రీకాకుళం ఎంపీ రామ్మెహన్ నాయుడు

"ప్రజల మనోభావాలకు ముడిపడి ఉన్న విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయడం సరికాదు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే స్టీల్ ప్లాంట్‌ను నిర్వహించాలి. ఇదే విషయాన్ని ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్‌కు వినతి పత్రం ద్వారా తెలిపాం." - బీజెపీ ఎమ్మేల్సీ మాధవ్

"పెట్టుబడులు పెంచేందుకే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌‌ను ప్రైవేటీకరణ చేస్తున్నాం. స్టీల్‌ ప్లాంట్‌ విశాఖలోనే ఉంటుంది. వేరే దేశానికి తీసుకెళ్లడం లేదు. టీడీపీ, వైసీపీలు ఆందోళన చేసినంత మాత్రాన ప్రైవేటీకరణ మాత్రం ఆగదు." - బీజేపీ ఎంపీ సుజనాచౌదరి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Ganta Srinivas calls for public movement against privatization
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X