వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనూ సూద్ ఫౌండేషన్‌కు రూ. 15 వేలు విరాళం అందించిన అంధురాలు.. అత్యంత సంపన్నురాలు ఆమేనంటూ ప్రశంసలు - ప్రెస్ రివ్యూ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

'ఒకరి కష్టాలు చూసేందుకు కళ్లే ఉండాల్సిన అవసరం లేదు. మనసు ఉంటే చాలు’... అని నిరూపించింది నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలోని ఆండ్రావారిపల్లికి చెందిన బొడ్డు నాగలక్ష్మి.

23 ఏళ్ల ఆ అంధురాలు సోనూసూద్‌ ఫౌండేషన్‌కు రూ.15 వేలు విరాళం ఇచ్చిందని ఆంధ్రజ్యోతి ఒక కథనంలో పేర్కొంది.

''ఇది పెద్ద మొత్తం కాకపోవచ్చు. కానీ.. దివ్యాంగురాలైన తనకు వస్తున్న పింఛను మొత్తాన్ని ఐదు నెలలుగా దాచుకుంటూ ఇప్పుడు పరుల కోసం ఇచ్చేశారు. సోనూ తన ఫౌండేషన్‌కు విరాళాలు కోరినట్లు తన సోదరుడు ఆదినారాయణరెడ్డి ద్వారా తెలుసుకున్న వెంటనే ఇలా స్పందించింది.

ఈ విషయం తెలిసి సోనూసూద్‌ ఆమె మంచి మనసుకు చలించిపోయారు. ఆమెతో నేరుగా ఫోన్‌లో మాట్లాడి ప్రశంసించారు. తన ట్విటర్‌ ఖాతాలోనూ నాగలక్ష్మి పెద్దమనసును కొనియాడారు.

'ఒక అంధురాలు, యూట్యూబర్‌ నాగలక్ష్మి నా ఫౌండేషన్‌కు రూ.15వేలు విరాళం ఇచ్చారు. ఇది ఆమె ఐదు నెలల పింఛను. నా దృష్టిలో దేశంలో ఆమే అత్యంత సంపన్నురాలు. ఒకరి కష్టాలు చూసేందుకు కంటిచూపు ఉండాల్సిన అవసరంలేదు’ అని కీర్తించారు.

వ్యవసాయ కుటుంబంలో జన్మించిన నాగలక్ష్మి పుట్టుకతోనే అంధురాలు. 5వ తరగతి వరకే చదువుకున్న ఆమె ఇటీవలే 'కవిత నాగ వ్లాగ్స్‌’ పేరిట యూట్యూబ్‌ ఛానల్‌ను స్థాపించి దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని అనాథ శరణాలయాలు, వృద్ధులు, పేదలకు అందిస్తోంది. ఆమె యూట్యూబ్‌ చానల్‌కు లక్ష మందికిపైగా సబ్‌స్రైబర్లు ఉన్నార’’ని ఈ కథనంలో తెలిపారు.

జస్టిస్ ఎన్‌వీ రమణ

మీడియా కోసం సుప్రీం కోర్టు తీర్పుల యాప్.. త్వరలో విచారణల ప్రత్యక్ష ప్రసారం

సుప్రీంకోర్టులో జరిగే వ్యాజ్యాల విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ తెలిపారని ఈనాడు ఒక కథనాన్ని ప్రచురించింది.

సహచర న్యాయమూర్తుల అభిప్రాయం స్వీకరించి దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.

కరోనా కారణంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహిస్తున్న సుప్రీంకోర్టు కార్యకలాపాలను మీడియా ప్రతినిధులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఆయన చొరవతో 7 రోజుల్లో ప్రత్యేక మొబైల్‌ యాప్‌ సిద్ధమైంది.

సహచర న్యాయమూర్తులు జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎ.ఎం.ఖన్విల్కర్‌, జస్టిస్‌ హేమంత్‌ గుప్తాలతో కలిసి వర్చువల్‌ విధానంలో గురువారం ఈ యాప్‌ను జస్టిస్‌ రమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా ప్రాధాన్యం గురించి వివరించారు.

''పారదర్శకత సిద్ధాంతాన్ని మన దేశ న్యాయవ్యవస్థ ఎల్లప్పుడూ గౌరవిస్తూ వస్తోంది. కేసుల విచారణ కోర్టు గదుల్లో ప్రజల ముందే జరగడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, స్థలాభావం, భద్రతా సమస్యల దృష్ట్యా కొన్ని ఆంక్షలు విధించాల్సి వచ్చింది. న్యాయస్థానాలు, మరీ ముఖ్యంగా సర్వోన్నత న్యాయస్థానం జారీచేసే రూలింగ్స్‌ దేశ ప్రజలందరి జీవితాలపై ప్రభావం చూపుతాయి. సమాచారాన్ని విస్తృతంగా ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్లడంలో మీడియా పాత్ర కీలకం.

కోవిడ్‌ విజృంభణతో ఇదివరకున్న పద్ధతులపై ఆధారపడే పరిస్థితి లేకుండా పోయింది. ప్రజలకు న్యాయం అందించే ప్రక్రియ ఆగకూడదన్న ఉద్దేశంతో న్యాయ వ్యవస్థ వేగంగా కొత్త విధానాన్ని అందిపుచ్చుకొంది. వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా కేసులు విని, తీర్పులు వెలువరించే క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కొన్నిచోట్ల నుంచి కేసుల విచారణను పరిశీలించే వెసులుబాటును తొలుత మీడియా ప్రతినిధులకు కల్పించాం. అందులో ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని చాలామంది పాత్రికేయులు సరళమైన వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని నాకు విజ్ఞప్తి చేశారు.

ఇ-కమిటీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న సోదర న్యాయమూర్తుల ముందు ఈ అంశాన్ని ఉంచగా వెంటనే సాంకేతిక బృందాన్ని మోహరించి 7 రోజుల్లోనే మొబైల్‌ అప్లికేషన్‌ రూపొందించారు. ఇప్పుడు మొబైల్‌ అప్లికేషన్‌కు అదనంగా మీడియా కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ ఏర్పాటు చేస్తున్నాం. సుప్రీంకోర్టు ఇచ్చే చరిత్రాత్మక తీర్పుల క్లుప్త రూపాన్ని దీనిద్వారా సులభంగా, సరళంగా అర్థమయ్యే రీతిలో అందుబాటులో ఉంచుతాం. ఇది మీడియాకు, ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది’’ అని జస్టిస్‌ రమణ తెలిపారని ఈ వార్తలో రాశారు.

ట్విట్టర్‌లో ట్రెండ్ అయిన 'ఆస్క్ కేటీఆర్' హ్యాష్‌ట్యాగ్

కరోనా వ్యాక్సినేషన్‌లో తెలంగాణ దేశ సగటు కన్నా ముందు వరుసలో ఉన్నదని, ఇతర రాష్ట్రాలతో పోల్చితే మొదటి స్థానంలో నిలిచిందని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారని, అయితే అసలు సమస్య వ్యాక్సిన్‌ కొరతేనని చెప్పినట్లు నమస్తే తెలంగాణ ఒక కథనాన్ని ప్రచురించింది.

రాష్ట్రాలకు వ్యాక్సిన్‌ పంపిణీ అంశం పూర్తిగా కేంద్రం చేతిలోనే ఉన్నదని, రాష్ట్రానికి వీలైనంత ఎక్కువ డోసులు తెచ్చేలా కేంద్రంతో ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. మంత్రి కేటీఆర్‌.. కోవిడ్ నియంత్రణ, సంబంధింత అంశాలపై గురువారం ట్విట్టర్‌ వేదికగా ప్రజలతో సంభాషించారు.

'ఆస్క్‌ కేటీఆర్‌’ పేరిట జరిగిన ఈ సంభాషణలో భాగంగా పలువురు నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. 'ఆస్క్‌ కేటీఆర్‌’ హ్యాష్‌ట్యాగ్‌ జాతీయస్థాయిలో ట్విట్టర్‌ ట్రెండింగ్‌లో నంబర్‌ వన్‌గా నిలువడం విశేషం

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ సమర్థంగా కొనసాగుతున్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించలేదని కొందరు విమర్శిస్తున్నా.. ప్రజల సౌకర్యార్థం 4 గంటలు వెసులుబాటు ఇస్తున్నామని చెప్పారు.

రాష్ట్రంలో జ్వర సర్వే ఇప్పటికే 70 లక్షల ఇండ్లల్లో పూర్తయిందన్నారు. దీంతోపాటు మంత్రులంతా జిల్లా స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి కలెక్టర్‌, డీఎంహెచ్‌వో, స్థానిక దవాఖానల అధికారులతో నిత్యం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.

ఈ ప్రయత్నంలో నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలూ భాగస్వాములు అవుతున్నారని చెప్పారు. ప్రభుత్వ చర్యలతోపాటు లాక్‌డౌన్‌ వల్ల కరోనా తీవ్రత కొంత తగ్గుముఖం పడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ సర్వే వల్ల కలిగే అద్భుతమైన ఫలితాలను త్వరలోనే చూస్తారన్నారు.

'ప్రతి పదిలక్షల మందిలో 1,41,939 మందికి టీకాలు వేశాం. అదే దేశంలో 1,29,574మందికి, ఏపీలో 1,39,986 మందికి, తమిళనాడులో 87,021 మందికి, ఉత్తరప్రదేశ్‌లో 61,164 మందికే వేశారు.

అసలు సమస్య వ్యాక్సిన్‌ కొరత. వ్యాక్సిన్‌ పంపిణీ అంశం పూర్తిగా కేంద్రం చేతిలోనే ఉన్నది. ఆయా సంస్థలు తయారుచేసే డోసుల్లో 85% కేంద్రానికి ఇవ్వాల్సిందే. మిగిలిన 15% రాష్ట్రాలు, ఇతరులు కొనుగోలు చేసుకోవాలి. వాక్సిన్‌ సరఫరాను పెంచేలా కేంద్రం నుంచి ప్రయత్నం చేస్తున్నాం.

అదే సమయంలో వ్యాక్సిన్‌ తయారీ కంపెనీలు భారత్‌ బయోటెక్‌, సీరం, డా.రెడ్డీస్‌తో చర్చిస్తున్నాం. కానీ అవి దేశానికి అవసరమైన వ్యాక్సిన్ల సంఖ్యను జూలై చివరికి లేదా ఆగస్టులో అందుకునే అవకాశం ఉంది. 70% ప్రజలకు వ్యాక్సిన్‌ వేస్తే కరోనా చైన్‌ను బ్రేక్‌ చేయొచ్చు.

ఇందుకు రాష్ట్రంలో ఉన్న 2.9 కోట్ల మంది పెద్ద వయస్సు వారిలో 1.9 కోట్ల మందికి వేయాల్సి ఉంటుంది. వీరికి రెండు డోసుల వేసేందుకు 3.8 కోట్ల డోసులు కావాలి’ అని పలు ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు.

కరోనాకు సంబంధించి సహాయం కోసం 108 లేదా 040-21111111కు ఫోన్‌ చేయొచ్చని మంత్రి కేటీఆర్‌ సూచించారు. పిల్లల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా 1098, 040-23733665 హెల్ప్‌లైన్‌ నంబర్లు ఏర్పాటు చేసిందని తెలిపారు.

గిఫ్ట్‌ ఏ స్మైల్‌ పిలుపులో భాగంగా ఇచ్చిన 90కి పైగా అంబులెన్స్‌ల ద్వారా ఈ విపత్కర సమయంలో ప్రజలకు సేవలు అందిస్తున్నామన్నారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చడంపై సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.

సంక్షోభ కాలంలో కోవిడ్ నియంత్రణకు పనిచేస్తున్న పౌరులు, సంస్థల సేవలను కొనియాడిన కేటీఆర్‌.. వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారని ఈ వార్తలో రాశారు.

కోహ్లీ

టెస్ట్ ర్యాకింగ్స్‌లో భారత్ నంబర్ వన్

అంతర్జాతీయ క్రికెట్‌మండలి(ఐసీసీ) గురువారం ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు మళ్లీ అగ్రస్థానానికి ఎగబాకిందని ప్రజాశక్తి వార్త రాసింది.

భారత్‌ టెస్టు ర్యాంకింగ్స్‌లో 121 రేటింగ్‌ పాయింట్లతో టాప్‌ ర్యాంకుకు చేరింది. ఇక న్యూజిలాండ్‌ 120 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. భారత్‌-కివీస్‌ల మధ్య ఒక్క పాయింట్‌ మాత్రమే తేడా ఉంది.

ఇంగ్లండ్‌ వేదికగా జూన్‌లో జరిగే ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఈ రెండు జట్లే టైటిల్‌కై తలపడనున్నాయి.

ఈ ఏడాది ఆస్ట్రేలియాపై 2-1తో టెస్టు సిరీస్‌ గెలిచిన భారత్‌.. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ 3-1తో సిరీస్‌ను కైవసం చేసుకుని, ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.

ఐసిసి 2020 నుంచి జరిగిన మ్యాచులకు 100%, అంతకుముందు రెండేళ్లకు 50% పాయింట్ల చొప్పున రేటింగ్స్‌ ఇచ్చింది. ఇంగ్లండ్‌(109పాయింట్లు) ఒక స్థానం ఎగబాకి మూడో స్థానంలో నిలవగా, ఆస్ట్రేలియా (108) నాలుగుకు చేరుకుంది. ఇక పాకిస్తాన్‌(94), వెస్టిండీస్‌(84) వరుసగా ఐదు, ఆరో స్థానాల్లో నిలిచాయి. దక్షిణాఫ్రికా(80), శ్రీలంక(78), బంగ్లాదేశ్‌(46), జింబాబ్వే(10) టాప్‌-10లో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయని ఈ కథనంలో తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Visually impaired woman donates 15000 to Sonusood foundation
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X