ఈ తెల్లవారు జామున ఢిల్లీలో దిగిన వ్లాదిమిర్ పుతిన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. భారత పర్యటన ఆరంభమైంది. ఈ తెల్లవారు జామున ఆయన ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. మూడు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది. ఇందులో భాగంగా ఢిల్లీ వేదికగా జరుగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. ఇది 18వ బ్రిక్స్ సమ్మిట్. ఈ సారి భారత్ దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశాలకు హాజరవుతారు. ఈ సందర్భంగా పలు ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది.
2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ తో యుద్ధం ఆరంభమైన తర్వాత.. రష్యా వెలుపల ఏర్పాటైన బ్రిక్స్ సమ్మిట్ కు పుతిన్ స్వయంగా హాజరు కావడం ఇదే మొదటిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలో బ్రిక్స్ భేటీలకు ఆయన వర్చువల్ గా హాజరయ్యారు. ఈ తెల్లవారు జామున ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్.. ఆయనను సాదరంగా స్వాగతం పలికారు.

ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్న అమెరికా నూతన టారిఫ్.. వంటి పరిస్థితుల మధ్య బ్రిక్స్ సమ్మిట్ భారత్ లో జరుగబోతోంది. తన పర్యటనలో మొదటి రోజు.. పుతిన్ తొలుత బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ ప్లీనరీ సమావేశానికి హాజరవుతారు. ఈ ఫోరమ్ ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ప్రధాని మోదీతో కలిసి రెండు దేశాల పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ప్రతిష్ఠాత్మక ఇన్నోప్రామ్ ను సందర్శిస్తారు.
ఆ తర్వాత మోదీతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. రక్షణ, ఆయిల్ కొనుగోళ్లు, టెక్నాలజీ బదలాయింపు, ఫార్మాసూటికల్స్ వంటి రంగాల బలోపేతం, పరస్పర అవగాహన ఒప్పందాలు.. వంటి అంశాలు ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రెండు దేశాల ప్రజల మధ్య బంధాన్ని మరింత మెరుగుపరుచుకోవడం వంటి కీలక అంశాలపై చర్చిస్తారు.
ఈ సదస్సులో పాల్గొనడానికి చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో విచ్చేశారు. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్-సిసి, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కూడా ఈ ఉన్నత స్థాయి చర్చల్లో పాల్గొనడానికి దిల్లీ చేరుకున్నారు.
బ్రిక్స్ ప్రధాన భేటీ శనివారం ప్రారంభౌతుంది. భారత్ రూపొందించిన నూతన ప్రతిపాదనలు, రక్షణ, ఆర్థిక వ్యూహాలు, సాంస్కృతిక సంబంధాలపై ఇందులో చర్చించనున్నారు. అంతర్జాతీయ, ప్రాంతీయ సవాళ్లను ఎదుర్కోవడానికి అవసరమైన ఉమ్మడి వ్యూహాల రూపకల్పన, సరికొత్త సుస్థిర ఆర్థిక విధానాలపై అగ్రదేశాల నేతలు తమ ఆలోచనలను వేదికపై పంచుకుంటారు. అనంతరం ఉమ్మడి తీర్మానాన్ని ఆమోదిస్తారు.














Click it and Unblock the Notifications
