'వృక్షమాత' తిమ్మక్క ఇకలేరు.. 114 ఏళ్ల వయసులో..
ప్రముఖ పర్యావరణ వేత్త..పద్మశ్రీ సాలుమరద తిమ్మక్క కన్నుమూశారు. వృక్ష సంరక్షణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన తిమ్మక్క 114 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. కర్ణాటకలోని తుమకూరు జిల్లా గుబ్బ మండలానికి చెందిన తిమ్మక్క గత కొంత కాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న తిమ్మక్క.. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతి పట్ల దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
తిమ్మక్క తన భర్త చిక్కయ్య తో కలిసి వృక్ష సంరక్షణ కోసం పాటుపడింది. స్టేట్ హైవే 94 కూడూర్ నుంచి హులికల్ వరకు రోడ్డుకు ఇరువైపులా 385 రావి మొక్కలను నాటారు. అవి పెరిగి పెద్దవై ప్రయాణికులను ఎండ, వాన నుంచి రక్షిస్తున్నాయి. తిమ్మక్క నిరక్షరాస్యురాలు. ఆమె ఓ క్వారీలో కూలీగా పనిచేసింది. అనంతరం భర్త చిక్కయ్యతో కలిసి మగధి మండలంలోని హులికాల్ గ్రామంలో నివాసం ఏర్పరచుకున్నారు. ఈ దంపతులకు పిల్లలు లేరు. అయితే వృక్షాలనే తమ సంతానం భావించారు. అలా వృక్ష సంరక్షణ కోసం జీవితాన్ని త్యాగం చేశారు. స్టేట్ హైవే 94 పై ఏకంగా 385 మొక్కలు నాటి వృక్షాలపై తమకున్న ప్రేమను చాటుకున్నారు. అంతేకాక వాటికి రోజూ నీళ్లు పోసి వాటి సంరక్షణ బాధ్యతలను నిర్వర్తించారు.
ఇక తిమ్మక్క సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2019 లో ఆమెకు పద్మశ్రీ ఇచ్చి ఘనంగా సత్కరించింది. అంతేకాక తిమ్మక్క 2016 లో బీబీసీ టాప్ 100 మంది ప్రభావిత వ్యక్తుల జాబితాలోనూ చోటు సాధించింది. పర్యావరణ సంరక్షణ కోసం నిరంతరం తిమ్మక్క శ్రమించింది. 2019 లో తిమ్మక్క మొక్కలు నాటిన బాగేపల్లి- హలగూరు రోడ్డు విస్తరణలో భాగంగా ఇరు వైపులా ఉన్న చెట్లను తొలగించాలని అధికారులు నిర్ణయం తీసుకోగా.. తిమ్మక్క ఈ నిర్ణయాన్ని తప్పుబట్టింది. అప్పటి కర్ణాటక సీఎం హెచ్.డీ. కుమారస్వామి, డిప్యూటీ సీఎం జీ. పరమేశ్వరకు అప్పీలు చేసింది. దీంతో ఆ ప్రాజెక్ట్ ను ప్రభుత్వం నిలిపివేసింది.

ఇక తిమ్మక్క మృతిపై దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కర్ణాటక సీఎం సిద్ద రామయ్య సంతాపం తెలిపారు. ఆమె అంత్యక్రియలకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తుందని తెలిపారు. ఆమెకు ఒక మ్యూజియం కట్టాలన్న డిమాండ్ ను తాము పరిగణలోకి తీసుకుంటామని అన్నారు. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆమెకు నివాళులు అర్పించారు. తిమ్కక్కను అందరూ వృక్షమాతగా పిలుచుకుంటారు.












Click it and Unblock the Notifications