నేతాజీ అదృశ్యంపై ముగింపు పలకాలి, మోడీ అడగాలి
న్యూఢిల్లీ: స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యానికి సంబంధించి తమ వద్ద ఉన్న రహస్య దస్త్రాల వివరాలను వెల్లడి చేయాల్సిందిగా ఆయా దేశాల ప్రభుత్వాలను ప్రధాని నరేంద్ర మోడీ కోరాలని చంద్రబోస్ కుటుంబసభ్యులు అభ్యర్థించారు.
నేతాజీ అదృశ్యానికి సంబంధించిన చిక్కుముడిని విడదీయగలిగిన కీలక పత్రాలను ఇదివరకటి ప్రభుత్వాలు ఇప్పటికే ధ్వంసం చేసి ఉండవచ్చన్న భయాందోళనలను వ్యక్తం చేశారు. నేతాజీ మనవడు చంద్రబోస్ ఆదివారం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ప్రస్తుతం కేంద్రప్రభు త్వం వద్ద ఉన్నట్లుగా పేర్కొంటున్న పత్రాల్లో నేతాజీ అదృశ్యానికి సంబంధించి ఏవైనా కొత్త విషయాలుంటాయని తాను అనుకోవడం లేదన్నారు. నేతాజీకి సంబంధించిన నాలుగు దస్త్రాలను ఇందిరా గాంధీ హయాంలో ధ్వంసం చేసినట్లు ముఖర్జీ కమిషన్ పేర్కొన్న విషయం గమనార్హమన్నారు.

నేతాజీ అదృశ్యానికి సంబంధించిన అన్ని అంశాలను క్రోడీకరించేందుకు వీలుగా రష్యా, జపాన్, చైనా, అమెరికా, బ్రిటన్, జపాన్, సింగపూర్, మలేసియాలను తమ వద్ద ఉన్న సంబంధిత దస్త్రాలన్నిటినీ బహిర్గతం చేయాలని కోరాల్సిందిగా భారత ప్రధాని నరేంద్ర మోడీని తాము కోరుతామన్నారు.
నేతాజీకి సంబంధించి కేంద్రం వద్ద ఉన్న ఫైళ్ల విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వేరుగా చెప్పారు.
ఆదివారం మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. వచ్చేనెలలో నేతాజీ కుటుంబ సభ్యులతో సమావేశం కానున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో చంద్రబోస్‌తోపాటు నేతాజీ మరో సోదరి మనవడు అభిజిత్ రే స్పందించారు.
విదేశాలను ఫైళ్లు విడుదల చేయాలని కోరాలంటే ముందుగా మనం ఆ పనిని చేయాల్సి ఉంటుందని, అందుకే కేంద్రం వద్ద ఉన్న ఫైళ్లను బయటపెట్టాల్సిందిగా కోరతామని అభిజిత్ రే తెలిపారు. నేతాజీకి సంబంధించి పలు కథనాలు ప్రచారంలో ఉన్నందున.. వాటికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications