రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారిన వక్ఫ్ సవరణ బిల్లు
వక్ఫ్ సవరణ బిల్లు 2025(Waqf Amendment Bill 2025)కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఆమోద ముద్ర వేశారు. దీంతో వక్ఫ్ సవరణ బిల్లు చట్టంగా మారింది. ఇటీవల ఈ బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. కాగా, వక్ఫ్ బిల్లుపై బుధవారం లోక్‌సభలో 14 గంటలకుపైగా చర్చ జరిగింది.
అనంతరం సవరణల వారీగా ఓటింగ్ ప్రక్రియ నిర్వహించగా.. బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటేశారు. రాజ్యసభలో బిల్లుకు అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది సభ్యులు ఓటేశారు. కాగా, ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి.

వక్ఫ్ సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని, ఏ ఒక్కరి మత విశ్వాసాలను దెబ్బ తీయడం ప్రభుత్వం ఉద్దేశం కాదని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు బిల్లు చర్చ సందర్భంగా స్పష్టం చేశారు. మరోవైపు, వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు నిరసనలు చేపట్టాయి.
వక్ఫ్ బిల్లుకు ఉభయసభల ఆమోదం
పార్లమెంట్ ఉభయ సభల్లో వక్ఫ్ సవరణ బిల్లు 2025 ఆమోదం పొందిన నేపథ్యంలో ఆ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. వక్ఫ్ సవరణ బిల్లు 2025పై కాంగ్రెస్, ఎంఐఎం సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి.
కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్, ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ బిల్లు రాజ్యాంగ చెల్లుబాటు అంశాన్ని సుప్రీంకోర్టులో అసదుద్దీన్ ఒవైసీ సవాల్ చేశారు. ఈ బిల్లులో నిబంధనలు ముస్లిం సమాజ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉన్నాయని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ బిల్లు వక్ఫ్ ఆస్తులు, వాటి నిర్వహణపై ఏకపక్షంగా ఉందని, ముస్లిం సమాజానికి చెందిన మతపరమైన స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తుందని కాంగ్రెస్ ఎంపీ జావేద్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
మరోవైపు, వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం లభించిన నేపథ్యంలో దేశంలోని పలు నగరాల్లో ముస్లింలు నిరసనలు చేపట్టారు. కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్‌లలో శుక్రవారం ప్రార్థనల అనంతరం పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. తమిళనాడులో సినీనటుడు, తమిళగ వెట్రి కజగం పార్టీ అధ్యక్షుడు విజయ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. దీంతో చెన్నై, కోయంబత్తూరు వంటి నగరాల్లో టీవీకే కార్యకర్తలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.












Click it and Unblock the Notifications