అప్పుడు హోటల్‌లో పాత్రలు కడిగా: కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ
న్యూఢిల్లీ: ప్రతి ఒక్కరూ తాము చేసే పనిని గౌరవంగా భావించాలని, వృత్తి గౌరవాన్ని కాపాడాలని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. మంగళవారం జరిగిన రాష్ట్రాల విద్యామంత్రుల సదస్సు సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను 15ఏళ్ల క్రితం ఓ హోటల్‌లో పాత్రలు కడిగినట్లు తెలిపారు.
వృత్తిపరంగా ఒక కూలీని కూడా గౌరవించినప్పుడే ‘మేక్ ఇన్ ఇండియా' కల సాకారమవుతుందని అన్నారు. ‘నేను 15ఏళ్ల కిందట ముంబైలో అడుగుపెట్టినప్పుడు ఓ హోటల్‌లో పాత్రలు కడిగా. ఈ విషయం చెప్పేందుకు నేనేమి సిగ్గుపడటం లేదు' అని కేంద్రమంత్రి స్మృతీ ఇరాని అన్నారు.

తాము చేసే వృత్తిపై గౌరవం చూపాల్సిందేనని ఆమె చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్లు వృత్తిలో నైపుణ్యాన్ని సాధించాలని అన్నారు. ప్లంబర్, మెకానిక్ లాంటి పనులు చేసేవారు నామోషి, అవమానకరంగా భావించాల్సిన అవసరం లేదని అన్నారు. వారు తమ వృత్తితో గౌరవాన్ని పొందాలన్నారు.
పౌరులు తమ తమ వృత్తిలో నిపుణత సాధిస్తేనే మేక్ ఇన్ ఇండియా సాధ్యమవుతుందని కేంద్రమంత్రి చెప్పారు. శ్రామికులకు సమాజం గౌరవం ఇచ్చినప్పుడు వారు కూడా తమ జీవితాన్ని గౌరవంగా సాగిస్తున్నారని అన్నారు. నైపుణ్య భారతానికి ఇవన్నీ అవసరమని చెప్పారు.












Click it and Unblock the Notifications