దోహా విమానంను ఢీకొన్న వాటర్ ట్యాంకర్... కోల్‌కతా విమానాశ్రయంలో ఘటన
కోల్‌కతా: కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం తప్పింది. 100 మంది ప్రయాణికులతో దోహాకు వెళుతున్న ఖతార్ ఎయిర్ వేస్ విమానాన్ని రన్‌వేపై వాటర్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది. ప్రయాణికులు తెల్లవారు జామున 2:20 గంటలకు విమానంలోకి వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటన జరిగిన వెంటనే ప్రయాణికులను విమానం నుంచి దించివేశారు. జరిగిన ఘటనపై పౌరవిమానాయాన శాఖకు తెలిపినట్లు విమానాశ్రయం డైరెక్టర్ అతుల్ దీక్షిత్ చెప్పారు.
జరిగిన ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు. 103 మంది ప్రయాణికులతో ఉన్న ఖతార్ ఎయిర్ వేస్ విమానం ఘటన జరగడంతో టేకాఫ్ తీసుకోలేదు. వాటర్ ట్యాంకర్ బలంగా ఢీకొట్టడంతో విమానం కింది భాగం ధ్వంసమైందని ఓ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. దీంతో విమానాన్ని మరమత్తలు కోసం తీసుకెళ్లినట్లు పేర్కొంది. ఇక విమానాశ్రయంలో వాహనాలు ఏ రూట్లలో వస్తాయో అన్నదానిపై స్పష్టత లేదన్నారు ఓ సీనియర్ అధికారి. అంతేకాదు రన్‌వే పక్కన మితిమీరిన వేగంతో వాహనాలు దూసుకొస్తుంటాయని చెప్పారు. డ్రైవర్ వాటర్ ట్యాంకర్ వాహనం పై నియంత్రణ ఎలా కోల్పోయారో ముందుగా తెలియాల్సి ఉందన్నారు.

ఇదిలా ఉంటే ఖతార్ ఎయిర్‌వేస్ విమానంలో దోహాకు వెళ్లాల్సిన ప్రయాణికులను హోటల్ గదులకు తరలించారు. వారిని శుక్రవారం ఉదయం మూడు గంటలకు దోహా వెళ్లే మరో విమానంలో తరలించనున్నారు. ఈ మధ్య తరుచూ విమాన ప్రమాదాలు ఎక్కడో అక్కడ జరుగుతుండటంతో పౌర విమానాయాన శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది.












Click it and Unblock the Notifications