మా సహనాన్ని పరీక్షించొద్దు: ఆందోళన చేస్తున్న రైతులకు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ హెచ్చరిక
ఛండీగఢ్: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక, ఆందోళన చేస్తూ దాడులకు పాల్పడితే సహించేది లేదంటూ హెచ్చరించారు.
ప్రభుత్వం సహిస్తోంది కదా అని.. హద్దులు మీరొద్దని గట్టిగా హెచ్చరించారు. ప్రభుత్వానికీ సహనం కోల్పోయే ఓ రోజు వస్తుందంటూ వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్-ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమకారులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య బుధవారం జరిగిన ఘర్షణల నేపథ్యంలో హర్యానా సీఎం ఖట్టర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

మేము సహనంతో ఉంటున్నాం కాదా అని కొందరు హద్దులు మీరుతున్నారు. ప్రతిదానికీ ఓ హద్దు ఉంటుంది. ఓ రోజంటూ వస్తే సహనం నశిస్తే పరిస్థితులు వేరేగా ఉంటాయంటూ మనోహర్ లాల్ ఖట్టర్ రహదారులపై ఆందోళన చేస్తున్న రైతు నేతలను గట్టిగా హెచ్చరించారు.
ప్రజాప్రతినిదులు ఊళ్లలో పర్యటించకుండా అడ్డుకోవడం వంటి చర్యలను సీఎం ఖట్టర్ ఖండించారు. పంజాబ్, హర్యానాతోపాటు పశ్చిమ ఉత్తరప్రదేశ్ కు చెందిన రైతులు గత 200 రోజులకుపైగా కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రైతు నేతలతో సమావేశాలు నిర్వహించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో రైతు తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు.
ఇటీవల గవర్నర్లకు వినతి పత్రం ఇవ్వాలని రైతు నేతలు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో గవర్నర్లకు రైతులు వినతిపత్రం ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. అంతకు ముందు దేశరాజధాని న్యూఢిల్లీలో చేపట్టిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. అనేక మంది పోలీసులు తీవ్రగాయాలపాలయ్యారు. కొందరు రైతు నేతలకు కూడా ఈ ఘటనలో గాయాలయ్యాయి. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు తాము తమ ఆందోళనలను కొనసాగిస్తామని రైతు నేతలు స్పష్టం చేశారు. తాము రైతులతో చర్చలకు సిద్ధమేననికేంద్రం ఇప్పటికే ప్రకటించింది.












Click it and Unblock the Notifications