Weather: తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు: రానున్న మూడు రోజులపాటు వర్షాలు
హైదరాబాద్/అమరావతి: మార్చి నెల ప్రారంభం నుంచే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ నెలలో కూడా భానుడు భగభగలాడుతున్నాడు. దీంతో ప్రజలంతా ఎండవేడిమికి అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది.

తెలంగాణలో మూడురోజులపాటు వర్షాలు
తెలంగాణలో రాగల మూడు రోజులు రాష్ట్రంలో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. శ్రీలంక సమీపంలో కొమరీన్ ప్రాంతంపై బంగాళాఖాతంలో అల్పపీడనం ఆవరించి ఉంది. ఇది తమిళనాడు తీరం వరకు గాలులతో కూడిన ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతోనే ఈ రోజు భారీ వర్షాలు, మంగళవారం నుంచి మూడు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

హైదరాబాద్‌లో రెండ్రోజులపాటు వర్షాలు, ఇతర జిల్లాల్లోనూ
రాబోయే 48 గంటల పాటు హైదరాబాద్ నగరమంతా మేఘావృతం అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. సాయంత్రం, రాత్రి సమయాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో మంగళవారం వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఏపీలోనూ మూడురోజులపాటు వర్షాలు, సీమలో పొడి వాతావరణం
ఇది ఇలావుండగా, ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు అధికంగానే ఉన్నాయి. దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ, నైరుతి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో నేటి నుంచి మూడు రోజులపాటు వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రలో పొడి వాతావరణం, అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. దీంతో ప్రజలకు విపరీతమైన ఎండల నుంచి కాస్త ఉపశమనం లభించనుంది. అయితే, రాయలసీమలో మాత్రం నేటి నుంచి మూడు రోజులపాటు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని తెలిపింది.












Click it and Unblock the Notifications