weather update: ఏపీ, తెలంగాణలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు
హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండగా మరో మూడు రోజులు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఏర్పడిన ఉత్తర దక్షిణ ద్రోణి, సోమవారం బలహీనపడింది. తూర్పు-పశ్చిమ ద్రోణి సుమారు 17 డిగ్రీల ఉత్తర అక్షాంశం వెంబడి స్థిరంగా ఉండి, సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల మధ్య కొనుసాగుతూ ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణంవైపునకు వంపు తిరిగి ఉంది.
జులై 23న వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావం తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. సోమవారం, మంగళవారం, బుధవారం తెలంగాణలోని అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక హైదరాబాద్ నగరంలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇప్పటికే కురిసిన వర్షాలతో జిల్లాల్లోని చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి. వాగులువంకలు పొంగుతున్నాయి.

ఏపీలోనూ మరో మూడు రోజులపాటు వర్షాలు
రాగల మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తరాంధ్ర తీర ప్రాంతం, పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో జులై 21న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
మరోవైపు ఉత్తర మధ్య మహారాష్ట్ర పరిసరాల్లో అవర్తనం బలహీనపడింది. దీని ప్రభావంతో మరో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. కాగా దేశంలోని ఉత్తర, తుర్పు, దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.












Click it and Unblock the Notifications