పీఎం బోరిస్ జాన్సన్‌తో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ: భారత వ్యాక్సిన్ సర్టిఫికేట్‌కు యూకే గుర్తింపు
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పలు కీలక అంశాలపై చర్చించారు. అంతేగాక, భారత కరోనా సర్టిఫికేట్ విషయంలో శుభవార్త కూడా అందింది. వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారి తదితర సమస్యలపైనా పరస్పర సమన్వయంతో పోరాడాలని భారత్, యూకే నిర్ణయించాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోమవారం బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో సంభాషించారు. ఈ విషయాన్ని మోడీ ట్విటర్ వేదికగా వెల్లడించారు.
'బోరిస్ జాన్సన్‌తో మాట్లాడటం ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా భారత్- యూకే ఎజెండా 2030 పురోగతిని సమీక్షించాం. దీంతోపాటు గ్లాస్గోలో సీఓపీ-26 సమావేశం నేపథ్యంలో వాతావరణ మార్పుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై అభిప్రాయాలను పంచుకున్నాం. అఫ్గాన్ సహా ఇతర ప్రాంతీయ సమస్యలపై చర్చించాం' అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.

క్వారంటైన్ నిబంధనలు, వ్యాక్సిన్ ధ్రువపత్రాల గుర్తింపు విషయంలో ఇటీవల బ్రిటన్, భారత్ మధ్య వివాదం చెలరేగడం, చివరకు బ్రిటన్ దిగిరావడం తెలిసిందే. ఈ పరిణామాల మధ్య ఇరు దేశాల ప్రధానులు మాట్లాడుకోవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. భారత్ టీకా ధ్రువీకరణ పత్రాలను బ్రిటన్ గుర్తించడం స్వాగతించదగిన పరిణామమని ఇద్దరు నేతలూ అంగీకరించడం గమనార్హం.
కాగా, కొవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్నప్పటికీ.. తమ దేశానికి వచ్చే భారతీయులు 10 రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనంటూ బ్రిటన్ ఇటీవల నిబంధనలు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రతిగా భారత్ కూడా ఇక్కడికొచ్చే బ్రిటన్ పౌరులకూ క్వారంటైన్‌ను తప్పనిసరి చేసింది. ఈ క్రమంలో బ్రిటన్ వెనక్కి తగ్గి.. కొవిషీల్డ్ రెండు డోసులు వేసుకొని వచ్చే భారతీయులకు క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. సోమవారం నుంచే ఈ మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయని భారత్‌లో బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ వెల్లడించారు.
Was a pleasure to speak to Prime Minister @BorisJohnson. We reviewed progress on the India-UK Agenda 2030, exchanged views on climate action in the context of the forthcoming COP-26 in Glasgow, and shared our assessments on regional issues including Afghanistan.
— Narendra Modi (@narendramodi) October 11, 2021
'అక్టోబర్ 11నుంచి యూకే వెళ్లే భారతీయులు కోవిషీల్డ్ లేదా యూకే రెగ్యులేటర్ ద్వారా ఆమోదించిన ఏదైనా వ్యాక్సిన్ తీసుకున్నా.. క్వారంటైన్ ఉండదు. కాబట్టి ఇకనుంచి యూకే వెళ్లడం సులభం. ఈ విషయంపై యూకే ప్రభుత్వానికి సహకరించినందుకు భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు' అంటూ అలెక్స్ ఎల్లిస్ వీడియో ట్వీట్ చేశారు. దీంతో భారత్, బ్రిటన్‌ల మధ్య జరుగుతున్న రాకపోకల గొడవ ముగిసింది.
Recommended Video
ఇది ఇలావుండగా, దేశంలో కరోనా వైరస్ కేసులు తగ్గాయి. కొత్త కేసులు మార్చి ప్రారంభం నాటి స్థాయికి తగ్గగా.. క్రియాశీల కేసులు 209 రోజుల కనిష్టానికి పడిపోయాయి. ఇక రికవరీ రేటు 98 శాతానికి పెరిగింది. సోమవారం కేంద్రం విడుదల చేసిన ఈ గణాంకాలు సానుకూలంగా కనిపించాయి. అయితే ప్రస్తుతం పండుగల సీజన్ నడుస్తుండటంతో మహమ్మారి విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం, నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత 24 గంటల వ్యవధిలో 10,35,797 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 18,132 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. మరోపక్క మరణాలు కూడా 200 దిగువన నమోదయ్యాయి. నిన్న 193 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 4,50,782కి చేరింది. ఆదివారం 21,563 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కేసులు 3.39 కోట్లకు చేరగా.. రికవరీలు 3.32 కోట్లు(98 శాతం)గా ఉన్నాయి. కొత్త కేసుల కన్నా రికవరీలు ఎక్కువగా ఉంటుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం దేశంలో 2,27,347 యాక్టివ్ కేసులున్నాయి. యాక్టివ్ కేసుల రేటు 0.67 శాతానికి చేరింది. ఇక నిన్న 46,57,679 మంది టీకా వేయించుకున్నారు. మొత్తంగా పంపిణీ అయిన డోసుల సంఖ్య 95 కోట్ల మార్కును దాటింది.












Click it and Unblock the Notifications