శెభాష్: 92 ఏళ్ల వయసులో బడికెళ్తోన్న బామ్మ..
చదువుకోవాలంటే.. ఆసక్తి ఉండాలి కానీ, వయసుతో పనేముంది అని ప్రశ్నిస్తోంది ఓ 92 యేళ్ల వృద్ధురాలు..ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులందర్‌షహర్‌కు చెందిన సలీమా అనే వృద్ధురాలు చదువుకోవాలనే తన కలను సాకారం చేసుకునేందుకు ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఈ సంఘటన విన్నవారికి, చూసినవారికి ఆశ్చర్యంగానే అనిపించొచ్చు. కానీ, ఇందులో వింతేముంది. సలీమాకు 14 ఏళ్ల వయసులో వివాహం జరిగింది. ఆ వయసులో తను చదువుకోవాల్సింది. కానీ, కుటుంబ పరిస్థితులు ఆమెను పెళ్లి అనే బంధంతో కట్టిపడేసాయి.
చదువుకోవాల్సిన వయసులో సంసార బాధ్యతల్లో మునిగిపోయింది. పెళ్లి, పిల్లలు, వారి పెళ్లిళ్లు.. ఇలా బాధ్యతలన్నీ పూర్తిచేసుకుంది. ఇక, ఈ కాస్తసమయంలోనైనా తన కలను నిజం చేసుకోవాలని అనుకుంది సలీమా. అనుకున్నదే తడవుగా ఆరు నెలల క్రితం తన కంటే దాదాపు 8 దశాబ్ధాలు చిన్న వారైన విద్యార్ధులతో కలిసి స్కూల్‌కు వెళ్లడం ప్రారంభించింది. ఈ క్రమంలో తరగతి గదిలో ఒకటి నుంచి వంద వరకు అంకెలను లెక్కిస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఈ బామ్మ కథ గురించి బయటి ప్రపంచానికి తెలిసింది.

బామ్మ మాటల్లో :'నేను కూడా చదవగలుగుతున్నాను. రాయగలుగుతున్నాను. డబ్బు లెక్కపెట్టగలుగుతున్నాను. నా మనవలు డబ్బు తక్కువ ఇచ్చి నన్ను మోసం చేసేవారు. కానీ, ఇప్పడు అన్నీనాకు తెలుస్తున్నాయి. నేను అన్నీ చదవగలుగుతున్నాను అంటూ తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు సలీమాఖాన్. విద్యా వాలంటీర్ల చొరవతో సలీమాఖాన్ పాఠశాలకు వెళ్లి చదువుతున్నట్లు సమాచారం.
మరో 25 మంది మహిళలకు స్పూర్తి :మొదట్లో సలీమాఖాన్‌కు చదువు చెప్పడానికి టీచర్‌లు ఆలోచించారని, అయితే ఆమెకు చదువు మీదున్న శ్రద్ధ, ఆసక్తి, చూసి ఉపాధ్యాయులు కూడా ఒక అడుగు ముందుకు వేశారని, స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ప్రతిభా శర్మ అన్నారు. ఆమె పట్టుదల చూసి టీచర్లకు సైతం ఎంతో ఉత్సాహం వచ్చిందని ప్రతిభ శర్మ చెప్పుకొచ్చారు. సలీమాఖాన్ స్కూల్‌కు వెళ్లడం ప్రారంభించడంతో అదే గ్రామానికి చెందిన మరో 25 మంది మహిళలు కూడా చదువుకోవడానికి స్కూల్‌కు వెళ్లడం మొదలుపెట్టారట..! ఈ వృద్ధురాలి కథ ఎంతోమందికి స్పూర్తినిచ్చింది. ఈ అవ్వకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..












Click it and Unblock the Notifications