వీల్ ఛైర్‌పై మమతా బెనర్జీ.. రోడ్ షో: అసలు విషయాలు వెలుగులోకి
కోల్‌కత: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. కాస్సేపట్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతోన్నారు. కాలికి గాయం కావడంతో కోల్‌కత ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆమె.. ఈ మధ్యాహ్నం రోడ్ షో నిర్వహించనున్నారు. ఆసుపత్రి నుంచి నేరుగా రోడ్ షోలో పాల్గొననున్నారు. వీల్ చైర్‌పై ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఓ బహిరంగ సభలోనూ ప్రసంగించనున్నారు. కాలికి గాయం కావడం వల్ల ఆసుపత్రిలో అడ్మిట్ అయిన తరువాత.. మమతా బెనర్జీ పాల్గొననున్న తొలి రోడ్ షో ఇదే కావడం.. వీల్ ఛైర్‌పై ఆమె ప్రచారాన్ని నిర్వహించనుండటం అందరి దృష్టి అటు వైపు మళ్లింది.
నందిగ్రామ్‌లో చోటు చేసుకున్న తోపులాట సందర్భంగా మమతా బెనర్జీ గాయపడిన విషయం తెలిసిందే. ఆమె కాలికి ఫ్రాక్చర్ అయింది. ఫలితంగా- తన నందిగ్రామ్ పర్యటనను అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది. మమతా గాయపడటాన్ని తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా పరిగణిస్తోంది. రాజకీయ ప్రత్యర్థుల కుట్రగా ఆరోపించింది. మమత బెనర్జీపై దాడి చోటు చేసుకోలేదని, కేంద్ర ఎన్నికల కమిషన్ నియమించిన ప్రత్యేక పరిశీలకులు తేల్చారు. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓ నివేదికను అందజేశారు.

ప్రమాదవశావత్తూ మమతకు గాయాలయ్యాయని, కారు డోర్ తగలడం కాలికి దెబ్బ తగిలిందని తెలిపారు. మమతపై దాడి చోటు చేసుకుందనడానికి నిదర్శనంగా ఎలాంటి ఆధారాలు లేవని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తన నివేదికలో పేర్కొన్నారు. ఈ మధ్యాహ్నం ఆమె కోల్‌కోతలోని గాంధీ విగ్రహం నుంచి హజ్రా వరకు రోడ్ షోలో పాల్గొననున్నారు. ఆసుపత్రి నుంచి నేరుగా గాంధీ విగ్రహం వద్దకు చేరుకుంటారని, అక్కడి నుంచి హజ్రాకు ర్యాలీగా తరలి వెళ్తారని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెల్లడించారు. హజ్రా వద్ద బహిరంగ సభలో ప్రసంగిస్తారని పేర్కొన్నారు. తాను గాయపడటానికి గల కారణాలను ఆమె వెల్లడిస్తారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications