నడిరోడ్డుపై వాలీబాల్ క్రీడాకారిణిని నరికి చంపాడు
కోల్‌కతా: పశ్చమిబెంగాల్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన ప్రేమను తిరస్కరించిందన్న కోపంలో ఓ యువకుడు, అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై మైనర్ బాలికను వెంటాడి నరికి చంపేశాడు.ఈ ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగీతా ఎయిచ్ అనే 14ఏళ్ల బాలిక స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారిణి అయిన సంగీత శుక్రవారం కోర్టులో ప్రాక్టీస్ చేస్తుండగా.. రాజా అనే 18ఏళ్ల యువకుడు అక్కడికి వచ్చి తనను ప్రేమిస్తున్నానని చెప్పాడు.

ఇందుకు బాలిక నిరాకరించడంతో తన దగ్గర ఉన్న గొడ్డలితో ఆమెపై దాడికి యత్నించాడు. దీంతో భయపడిపోయిన సంగీత అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా.. నిందితుడు వెంబడించి నడిరోడ్డుపై గొడ్డలితో నరికి పరారయ్యాడు.
రక్తపుమడుగులో పడి ఉన్న సంగీతను ఆమె సమీప బంధువు గుర్తించి.. ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications