రెజ్లర్ల నిరసనల వెనుక కాంగ్రెస్-తప్పుకుంటే ఒప్పుకున్నట్లే-బ్రిజ్ భూషణ్ కామెంట్స్..
తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ వారం రోజులుగా ఢిల్లీలో మహిళా రెజ్లర్లు చేస్తున్న నిరసనలపై ఎట్టకేలకు బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ స్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తానని, విచారణకు సహకరిస్తానని చెబుతూనే రెజ్లర్ల నిరసనల్ని తప్పుబడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారు రెజ్లర్లే కాదని, కాంగ్రెస్, కొందరు పారిశ్రామికవేత్తలు దీని వెనుక ఉన్నారని బ్రిజ్ భూషణ్ ఆరోపించారు.
లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో బ్రిజ్ భూషణ్ పై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదైన ఒక రోజు తర్వాత, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తాను నిర్దోషినని, విచారణ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. జంతర్ మంతర్ వద్ద టాప్ రెజ్లర్లు చేపట్టిన నిరసనల వెనుక కాంగ్రెస్ పార్టీ, కొంతమంది పారిశ్రామికవేత్తల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. రాజీనామా పెద్ద విషయం కాదు కానీ తాను నేరస్థుడిని కాదన్నారు.

తాను రాజీనామా చేస్తే రెజ్లర్ల ఆరోపణలను అంగీకరించినట్లు అవుతుందని బ్రిజ్ భూషణ్ తెలిపారు. తన పదవీకాలం దాదాపు ముగిసిందని పేర్కొన్నారు. తద్వారా రాజీనామా చేసేది లేదని ఆయన మరోసారి తేల్చిచెప్పినట్లయింది. బ్రిజ్ భూషణ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు రెజ్లర్లు ఆరోపిస్తున్నప్పటికీ పోలీసులు మాత్రం ఈ బీజేపీ ఎంపీపై కేసు కూడా పెట్టలేదు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు.

అయితే ఢిల్లీ పోలీసుల ఎఫ్ఐఆర్ తర్వాత కూడా రెజ్లర్లు ఆందోళనలు విరమించేందుకు ఇష్టపడటం లేదు. బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేయడంతో పాటు పదవి నుంచి కూడా తప్పించాలని రెజ్లర్లు కోరుతున్నారు. కానీ అధికార బీజేపీ ఎంపీ కావడంతో ఆయనపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు జంకుతున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలోనూ ఆయన అరెస్టుపై పోలీసులు నోరు మెదపడం లేదు.












Click it and Unblock the Notifications