నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు సభలో అసలేం జరిగింది? ప్రత్యక్ష సాక్షులు, మృతుల కుటుంబ సభ్యులు ఏమంటున్నారు...

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
చంద్రబాబు రోడ్ షోలో విషాదం

యాటగిరి విజయ ఒక వ్యవసాయ కూలీ. వారిది యానాదుల కుటుంబం. ఉలవపాడు మండలం వరిగచేను సంఘానికి చెందిన విజయ తమ గ్రామంలోని కూలీలతో కలిసి తెలుగుదేశం పార్టీ బహిరంగసభకు హాజరయ్యారు. ఇద్దరు ఆడపిల్లలను ఇంట్లోనే ఉండమని చెప్పి ఆమె తన కుమారుడిని వెంటబెట్టుకుని కందుకూరు వెళ్లారు.

సాయంత్రం ఆరుగంటల సమయంలో ఆమె తన కూతురుకు ఫోన్ చేసి కొద్ది సేపట్లో వచ్చేస్తానని, అన్నం తిని పడుకోమని కూతురికి చెప్పారు. చంద్రబాబుని చూసిన తర్వాత వెళదామని చెప్పడంతో కొడుకు కూడా తన ఫ్రెండ్స్‌తో కలిసి దూరంగా వెళ్లాడు. సరిగ్గా అప్పుడే తొక్కిసలాట జరిగింది. ఆమె కిందపడిపోయింది. ఊపిరిసలపని స్థితి ఏర్పడింది. వేదికపై నుంచి చంద్రబాబు కూడా అక్కడెవరో కాలువలో పడిపోయారు చూడండని చెబుతూనే ఉన్నారు. ఈలోగా విజయ శ్వాస ఆడక ప్రాణాలు కోల్పోయారు. ఇంటి దగ్గర తల్లి కోసం ఎదురు చూస్తున్న ఆడపిల్లలు ఇద్దరూ అమ్మ ఇక రాదని తెలిసి కన్నీరుమున్నీరవుతున్నారు.

చంద్రబాబు రోడ్ షోలో విషాదం

ఉపాధి కోసం తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు వలస వెళ్లిన విజయ భర్త శ్రీనయ్య హుటాహుటిన భార్య కడచూపు కోసం రావాల్సి వచ్చింది.

చంద్రబాబుని చూసిన తర్వాత ఇంటికి వెళ్లిపోదామని తనతో చెప్పిన తల్లిని తన చేతులతోనే ఆస్పత్రి వరకూ మోసుకెళ్ళిన ప్రాణం దక్కలేదని కొడుకు దుఃఖంలో మునిగిపోయాడు. ఆ నిరుపేద కుటుంబంలో బిడ్డలు ఇప్పుడు తల్లి లేని వారయ్యారు.

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం రాత్రి జరిగిన ఘటనలో మరణించిన 8 మందిలో విజయ ఒకరు. ఆమెతో పాటు మరో మహిళ, ఆరుగురు పురుషులు చనిపోయారు. వారి ఇళ్లల్లో విషాదం అలముకుంది. ఈ ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. అధికార, విపక్షాల మధ్య వాగ్వాదానికి దారితీస్తోంది.

చంద్రబాబు రోడ్ షోలో విషాదం

అసలేం జరిగింది..

ఏపీ విపక్ష నేత ఇటీవల రాజకీయ కార్యాచరణను వేగవంతం చేశారు. వరుసగా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే రాయలసీమ, గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలో పర్యటించారు. డిసెంబర్ 28,29,30 తేదీలలో నెల్లూరు జిల్లా పర్యటన ప్రారంభించారు. కందుకూరులో 'ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఆ సందర్భంగా కందుకూరు పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ కి ఆయన షెడ్యూల్ కన్నా రెండు గంటలు ఆలస్యంగా చేరుకున్నారు.

అప్పటికే వేలమంది టీడీపీ శ్రేణులు, ప్రజలు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. చంద్రబాబు కోసం చాలాసేపు వేచిచూసిన జనం ఆయన రాకతో ఒక్కసారిగా ముందుకు కదిలారు. అదే సమయంలో చంద్రబాబు కూడా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత వాహనాన్ని ముందుకు కదిలించారు. పామూరు రోడ్డు వైపు ఆయన వాహనం కదలగానే జనంలో తొక్కిసలాట మొదలైంది. ఆ సమయానికే కాన్వాయ్‌కి ఎడమవైపు ఉన్న చిన్న బజార్ లో గందరగోళం ఏర్పడింది.

ఒకరిపై ఒకరు పడిపోయారు. అక్కడే ఉన్న ఐస్ క్రీమ్ బండి కూడా తిరగబడింది. మోటార్ వాహనాలు కింద పడిపోయాయి. కొందరు తొక్కిసలాటలో కింద పడి అపస్మారక స్థితిలో ఉన్నారు. వారిని కాపాడేందుకు కొందరు ప్రయత్నించినా గందరగోళం మధ్య సాధ్యం కాలేదు. తొక్కిసలాట కారణంగా సభ కూడా సుమారు పది నిమిషాల పాటు నిలిచిపోయింది.

కిందపడిన వారిలో ఇద్దరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.

మరో 18 మందిని స్థానికులు ఘటనా స్థలానికి 100 మీటర్ల దూరంలోనే ఉన్న ఏరియా ఆస్పత్రికి మోసుకెళ్లారు. కానీ, అప్పటికే కొందరు తుదిశ్వాస విడిచారు. మొత్తంగా గురువారం సాయంత్రానికి 8 మంది చనిపోయినట్లు అధికారికంగా ధ్రువీకరించారు.

చంద్రబాబు రోడ్ షోలో విషాదం

తొక్కిసలాట ఎలా మొదలైంది?

తొక్కిసలాటకు కారణాలు ఏమిటో తెలుసుకునేందుకు బీబీసీ ఘటనా స్థలానికి వెళ్ళి స్థానికులతో మాట్లాడింది. కందుకూరు పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ బాగా రద్దీగా ఉండే ప్రాంతం. ఆర్టీసీ బస్టాండ్‌తు సమీపంలో ఉంటుంది. అక్కడే సభ నిర్వహించడానికి పూనుకోవడం ఒక సమస్య కాగా, ఊహించిన దానికి మించి జనసమీకరణ జరగడంతో కిక్కిరిసిపోవడం మరో కారణంగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మొదట అంతా డ్రైన్ లో పడి చనిపోయారనే ప్రచారం జరిగినా అది వాస్తవం కాదని ప్రత్యక్ష సాక్షి బీబీసీకి తెలిపారు.

"కాలువలోంచి కొందరు దూకారు. కానీ వారికి ఏమీ కాలేదు. తొక్కిసలాటలో కింద పడిపోయిన వారే ప్రమాదానికి గురయ్యారు. ఎవరికి వారు తమ ప్రాణాలు కాపాడుకోవడానికే పరుగులు పెట్టారు. బాధితులను కాపాడే అవకాశం కూడా లభించలేదు. రెండో వైపు కూడా తొక్కిసలాట పరిస్థితి వచ్చినా ఎక్కువ చోటు ఉండడం వల్ల ముప్పు కలగలేదు. కానీ, ఇటువైపు ఇరుకుగా ఉండడం వల్ల ప్రాణ నష్టం జరిగింది" అని కందుకూరు వాసి దత్తాత్రేయ తెలిపారు.

"కాన్వాయ్ ముందుకు కదలడం వల్ల ప్రమాదం జరిగింది. అక్కడ ఉండొద్దు అని చంద్రబాబు చెబుతూనే ఉన్నారు. కానీ, ఫ్లెక్సీలు అడ్డంగా ఉండడం వల్ల జనం ఎటూ పోవడానికి వీలు కాలేదు" అంటూ మరో స్థానికుడు వెంకట్రావు చెప్పారు.

చంద్రబాబు రోడ్ షోలో విషాదం

ప్రభుత్వ నిర్లక్ష్యం...

చంద్రబాబు సభలో ప్రాణ నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఇంటిలిజెన్స్, పోలిస్ యంత్రాంగం విఫలమైందని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు.

"కందుకూరు దుర్ఘటనకు ప్రభుత్వ బాధ్యతా రాహిత్యమే కారణం. పోలీస్, ఇంటిలిజెన్స్ వైఫల్యం వల్లే ఇది జరిగింది. ప్రతిపక్షనేత సభలకు భారీఎత్తున ప్రజలు వస్తుంటే, అందుకు తగినట్టు భద్రతాచర్యలు చేపట్టాల్సిన బాధ్యత పాలకులపై లేదా? మా కుటుంబసభ్యుల్ని కోల్పోయిన బాధలో మేముంటే, వైసీపీనేతలు దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఓదార్పుయాత్ర, జగన్ రెడ్డి పాదయాత్రలో చనిపోయిన వారి కుటుంబాలకు టీడీపీప్రభుత్వం చంద్రన్నబీమా కింద ఆర్థికసాయం చేసింది. కానీ, కందుకూరు బాధితుల పట్ల ఉదారంగా వ్యవహరించలేకపోయింది" అనిత విమర్శించారు.

ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుందని చంద్రబాబు ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ. 24 లక్షల చొప్పున అందించాలని నిర్ణయించారు. పార్టీ తరపున రూ. 15 లక్షలు, ఇతర నేతలంతా కలిసి మరో రూ. 9 లక్షలు బాధిత కుటుంబం ఒక్కొక్కరికీ అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించారు.

కేంద్ర ప్రభుత్వం తరపున రూ. 2 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం తరుపున మరో రూ. 2లక్షలు చొప్పున బాధిత కుటుంబాలకు అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.

చంద్రబాబు రోడ్ షోలో విషాదం

ఆస్పత్రిల్లో ఉన్న వారి పరిస్థితి ఏంటి...

ప్రమాదంలో గాయపడిన మరో 10 మందికి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందించారు. వారిలో నలుగురు డిశ్చార్జి అయ్యారు. ఇంకా ఆరుగురికి వైద్యం అందుతోందని , ఎవరికీ ప్రాణాలకు ముప్పు లేదని కందుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు.

"ముందుగా అన్ని అనుమతులు తీసుకున్నాం. అయినా పోలీసు భద్రత ఏదీ? మునిసిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగింది. రోడ్లు ఆక్రమించి నిర్మాణాలకు పూనుకుంటున్నా అడ్డుకోలేదు. అధికార పార్టీ నేతలే అందుకు బాధ్యులు. అయినా మా పార్టీ తరపున బాధితులందరికీ అండగా ఉంటున్నాం. ప్రమాదంలో గాయపడిన వారందరినీ కాపాడుకునేందుకు చర్యలు తీసుకున్నాం. ఒంగోలు, నెల్లూరు వంటి ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నాం. ఎవరికీ ముప్పు లేదు. అందరూ కోలుకునే వరకూ వారికి సహాయ సహకారాలు అందిస్తాం" అంటూ ఇంటూరి బీబీసీకి తెలిపారు.

ఏపీ హోం మంత్రి తానేటి వనిత

ప్రభుత్వం ఏమంటోంది...

ప్రధానమంత్రి మోదీ, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ హరిచందన్‌లతో పాటు పలువురు ప్రముఖులు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

అయితే, అధికార పార్టీ నేతలు మాత్రం టీడీపీని టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబు ప్రచార యావ వల్లనే ఇంతటి ముప్పు వాటిల్లిందని విమర్శిస్తున్నారు.

ఇరుకు సందుల్లో రాత్రి వేళల్లో సభలు ఏర్పాటు చేయడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఏపీ హెం మంత్రి తానేటి వనిత అన్నారు.

"చంద్రబాబు ప్రచార పిచ్చి వల్లే ప్రాణ నష్టం జరిగింది. ఈ ఘటనకు వారే బాధ్యత వహించాలి. పోలీసుల విచారణ కొనసాగుతోంది. దోషులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాం" అని వనిత అన్నారు.

ఏపీ పోలీస్ శాఖ ఐపీసీ సెక్షన్ 174 కింద అనుమానాస్పద మృతులుగా కేసు నమోదు చేసింది. గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. పోస్ట్ మార్టమ్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలుంటాయని తెలిపారు.

"ఫోటో షూట్లు, డ్రోన్ షాట్ల కోసమే హంగామా చేశారు. బాబు "షో" వికటించి 8 మంది బలయ్యారు. పబ్లిసిటీ పిచ్చికి ఇంకెంత మందిని బలి తీసుకుంటావు బాబూ..? కందుకూరు దుర్ఘటనలో బాబును ముద్దాయిగా చేర్చి, విచారణ చేయాలి. ఆయన విపరీత ధోరణి వల్లనే ముప్పు వచ్చింది. ఏపార్టీ వారైనా కూలీ డబ్బుల కోసం వచ్చి ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. ఇరుకు సందుల్లో రోడ్ షోలు, డ్రోన్ వీడియోలు చూపించి సక్సెస్ అంటూ బాకాలు ఊదుకోవడం ఈ ప్రమాదానికి కారణం" అంటూ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాకి చెందిన ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి విమర్శించారు.

వైఎస్సార్సీపీ , టీడీపీ నేతల వాదనలు ఎలా ఉన్నప్పటికీ ప్రతిపక్ష నేత బహిరంగసభ వద్ద అవసరమైన సంఖ్యలో పోలీస్ యంత్రాంగం లేదని స్థానికులు చెబుతున్నారు. అదే సమయంలో సభా ప్రాంగణంలోనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అసలే చిన్నగా ఉన్న రోడ్లను మరింత ఇరుకుగా మార్చేసిన నిర్వాహకుల తీరు మీద కూడా విమర్శలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

English summary
What actually happened in Chandrababu's meeting? What eyewitnesses and family members of the deceased say...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X