వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పుతో అబార్షన్లు, మారిటల్ రేప్‌కు సంబంధించి మహిళల హక్కుల్లో వచ్చిన మార్పులు ఏంటి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
మహిళలు

అబార్షన్ల విషయంలో చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. పరస్పర అంగీకారంతో వచ్చిన గర్భం విషయంలో ఒంటరి మహిళ కూడా అబార్షన్ (గర్భస్రావం) చేయించుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 20-24 వారాల లోపు గర్భం తీయించుకోవడానికి ఒంటరి మహిళకు, పెళ్లి కాని మహిళకూ ఎవరి అనుమతీ అక్కర్లేదని తేల్చి చెప్పింది.

అంతేకాదు, భర్త భార్యతో బలవంతంగా కలవడం వల్ల వచ్చిన గర్భాన్ని తొలగించుకునే హక్కు కూడా మహిళకు ఉందని సుప్రీంకోర్టు చెప్పింది.

భారతదేశంలో అబార్షన్లకు సంబంధించి మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనే చట్టం ఉంది. ఆ చట్టంలోని సెక్షన్ 3Bలో 20-24 వారాల లోపు గర్భాన్ని తీయించుకునే హక్కు ఏ మహిళలకు ఉందో వివరణ ఉంటుంది. ఆ జాబితాలో లేని మహిళలకు చట్టపరంగా గర్భస్రావం చేయించుకునే అవకాశం లేదు. తాజాగా ఆ చట్టంలోని పలు సెక్షన్లపై సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది.

కడుపు తీయించుకునే హక్కు పెళ్లికాని, ఒంటరి మహిళలకు లేకపోవడం రాజ్యాంగవిరుద్ధం అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

''చట్టపరంగా, సురక్షితంగా అబార్షన్ చేయించుకునే హక్కు మహిళలందరికీ ఉంది'' అని కోర్టు వ్యాఖ్యానించింది.

''కేవలం పెళ్లి చేసుకున్న ఆడవాళ్లకే గర్భం తీయించుకునే హక్కు ఉండడం అంటే, పెళ్లి అయిన ఆడవారే శృంగారంలో పాల్గొనాలని స్టీరియోటైప్ చేసినట్టు అవుతుంది. అది రాజ్యాంగం ప్రకారం నిలవదు. పెళ్లి అయిన, పెళ్లి కాని మహిళలను వేరుగా చూడడం అనే వాదన నిలవదు. మహిళలకు తమ హక్కులను పాటించే స్వేచ్ఛ ఉంది'' అని తీర్పు ఇచ్చిన బెంచి ముఖ్య న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ అన్నారు.

''పిల్లల్ని కనే విషయంలో, పెళ్లయిన మహిళలకు ఏ హక్కులు ఉంటాయో,పెళ్లి కాని మహిళకు కూడా అవే హక్కులు ఉంటాయి'' అని కోర్టు వ్యాఖ్యానించింది.

గర్భంలోని పిండం మహిళ శరీరంపై ఆధారపడి పెరుగుతుంది. అంటే గర్భస్రావం అనేది పూర్తిగా ఆ మహిళ శరీరంపై తనకు ఉన్న హక్కు. ఆ మహిళకు ఇష్టంలేని పిండాన్ని మోయాల్సిందే అని చట్టం చెప్పడం మహిళ గౌరవానికి భంగం కలిగించడమే అని కోర్టు చెప్పింది.

''ఈ చట్టం 1971లో చేసింది. అప్పట్లో కేవలం పెళ్లయిన మహిళలనే దృష్టిలో పెట్టుకున్నారు. సమాజ విలువల్లో వచ్చే మార్పులు ప్రకారం చట్టాలు కూడా మారుతుండాలని'' కోర్టు వ్యాఖ్యానించింది. కొత్తగా వస్తోన్న సంప్రదాయేతర కుటుంబ వ్యవస్థలను చట్టబద్ధంగా గుర్తించాలన్న అవసరాన్ని ప్రస్తుత సమాజం గుర్తు చేస్తోంది అన్నారు జడ్జీలు జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఎఎష్ బొపన్న, జస్టిస్ జెబి పార్దీవాలాలు.

ఈ తీర్పుపై మానవహ్ హక్కుల కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

''చాలా సంతోషం అనిపించిన విషయం ఏంటంటే నైతిక అంశాలు ప్రాతిపదికగా కాకుండా ప్రాక్టికల్ పద్ధతిలో ఉంది తీర్పు. మారుతున్న పరిస్థితులను బట్టి కొత్త కుటుంబ వ్యవస్థలను చట్ట ప్రకారం గుర్తించాలన్న వ్యాఖ్య నాకు చాలా నచ్చింది. గతంలో మైనర్ల అబార్షన్ చాలా సమస్యగా ఉండేది. జడ్జీల పర్మిషన్లు అవసరం పడేది. ఇప్పుడు ఆ సమస్య తీరుతుంది అని ఆశిస్తున్నాం. అయితే ఇది ఆచరణలోకి వచ్చాక మనకు దీని ప్రభావం తెలుస్తుంది.'' అని బీబీసీతో అన్నారు భూమిక ఫౌండర్ కొండవీటి సత్యవతి.


ఇప్పటి వరకూ అబార్షన్ హక్కు ఎవరికి ఉంది?

ఇప్పటి వరకూ అమలులో ఉన్న చట్టం ప్రకారం సెక్షన్ 3B కింద అబార్షన్ చేయించుకునే హక్కు ఉన్న వారు

  • లైంగిక దాడి, రేప్, దగ్గర కుటుంబ సభ్యుల వల్ల గర్భం దాల్చిన వారు
  • మైనర్లు
  • వివాహ స్థితి (మేరిటల్ స్టేటస్).. గర్భం ఉన్న సమయంలో విడిపోవడం, భర్త చనిపోవడం
  • శారీరక వైకల్యం
  • మానసిక సమస్యలు, వైకల్యం
  • పిండంలో లోపాల వల్ల తల్లి ఆరోగ్యంపై ప్రభావం లేదా బిడ్డ పుట్టాక వైకల్యం వచ్చే అవకాశం
  • తీవ్రమైన విపత్తు, అత్యవసర, మావన విపత్తు సంబంధించిన పరిస్థితుల్లో

తాజా తీర్పుతో ఎవరి పర్మిషన్ లేకుండా గర్భం తీయించుకోగలిగిన వారు:

  • పెళ్లి కాక ముందే గర్భం ధరించిన మేజర్లు
  • పెళ్లి తరువాత కూడా గర్భం ఉంచుకోవడం ఇష్టం లేని భార్య
  • భర్త బలవంతంగా కలవడం వల్ల వచ్చిన గర్భం (మేరిటల్ రేప్)
  • పోక్సో చట్టం ప్రకారం ఇకపై అబార్షన్ చేయించుకునే అమ్మాయి పేరు పోలీసులకు ఇవ్వక్కర్లేదు.

కేసు ఎవరు వేశారు?

దిల్లీకి చెందిన 25 ఏళ్ల పెళ్లి కాని అమ్మాయి దిల్లీ హైకోర్టుకు వెళ్లారు. అప్పటికే ఆమెకు 23 వారాల 5 రోజుల గర్భం ఉంది. పరస్పర ఆమోదంతో ఒక వ్యక్తితో బంధంలో ఉన్నప్పుడే వచ్చిన గర్భం అది. అయితే ఆ తరువాత ఆ వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకోవాడానికి నిరాకరించాడు. దీంతో ఆమె ఆ గర్భం వద్దనుకున్నారు. ఆ గర్భాన్ని తొలగించుకోవడానికి అనుమతి కోరుతూ దిల్లీ హైకోర్టుకు వెళ్లారు.

కానీ దిల్లీ హైకోర్టు ఆమెకు అనుమతి ఇవ్వలేదు. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టంలో ఎక్కడా పెళ్లి కాని మహిళలు గర్భస్రావం చేయించుకోవచ్చు అని లేదు. కాబట్టి వారు అనుమతి ఇవ్వలేదు.

దీంతో, ఆమె ఈ జూలై 21న సుప్రీంకోర్టుకు వెళ్లారు. తక్షణ ఉపశమనం కింద, ఆమె తన గర్భాన్ని తీయించేసుకోవచ్చని సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కాకపోతే ఆ అబార్షన్ వల్ల తల్లి ఆరోగ్యానికి హాని ఉండదని ఎయిమ్స్ వైద్యుల హామీ ఇవ్వాలని షరతు విధించింది. ఆ ఉత్తర్వుల తరువాత తిరిగి తాజాగా ఈ కేసును లోతుగా విచారించింది సుప్రీంకోర్టు.

తాజా తీర్పుతో ఏం మారుతుంది?

ఇప్పటి వరకూ భారతదేశంలో అబార్షన్ల చుట్టూ ఉన్న ఎన్నో అంశాలను తలకిందులు చేస్తుంది ఈ తీర్పు. భర్త సహా ఎవరి అనుమతీ లేకుండా ఒక మహిళ ఆసుపత్రిలో చట్టప్రకారం అబార్షన్ చేయించుకునే హక్కు కల్పిస్తుంది. భర్త బలవంతంగా కలవడం వల్ల వచ్చే గర్భాన్ని తీసుకునే హక్కు కూడా భార్యకు ఇచ్చింది.

రేప్ వల్ల కలిగిన గర్భాన్ని తొలగించుకునే హక్కు మహిళలకు ఇప్పటికే ఉంది. తాజాగా మారిటల్ రేప్ కూడా అందులోకి వస్తుందని చంద్రచూడ్ అన్నారు. అంతేకాదు, పెళ్లయిన స్త్రీ ఈ గర్భం తీయించుకోవడం కోసం కోర్టుల్లో అనుమతులు, నిరూపణలు అవసరం కూడా లేదని వివరించింది. అసలు మారిటల్ రేప్ నేరమా కాదా అన్న కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న విషయం తెలిసిందే.

అంతేకాదు, గర్భస్రావం చేయించుకోవాలనుకున్న మహిళకు కుటంబ అనుమతి అక్కర్లేదు. కేవలం ఆ మహిళ అనుమతి సరిపోతుందని కోర్టు చెప్పింది. ఒకవేళ మహిళ మైనర్ అయినా లేదా మానసిక స్థితి సరిగా లేని మహిళ అయితే మాత్రం గార్డియన్ అనుమతి కావాలి. ఇక అబార్షన్ చేయించుకునే మైనర్ల వివరాలు పోలీసులకు ఇవ్వాలని పోక్సో చట్టం చెబుతుంది. కానీ పేరు, వ్యక్తిగత వివరాలు ఇవ్వక్కర్లేదన్నది తాజా తీర్పు.

తాజా తీర్పు ప్రగతిశీలంగా, వ్యక్తి స్వేచ్ఛను గౌరవించేలా ఉందంటూనే ప్రాక్టికల్ సమస్యలపై కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు న్యాయవాదులు.

''ఈ తీర్పు రాజ్యాంగ పరంగా గొప్పగా ఉంది. ఏం సందేహం లేదు. పైగా జీవితంలో భాగస్వామితో ఇబ్బందులు పడుతున్న కొందరు మహిళలకు ఈ తీర్పు మేలు చేస్తుంది కూడా. కానీ కొన్ని సందర్భాల్లో ఆచరణపరంగా ఇబ్బందులు రావచ్చు. మైనర్ పేరు ఇవ్వకుండా గర్భస్రావం చేయించగలగడం నేరపరమైన విచారణలో ఇబ్బందులు తేవచ్చు. అలాగే, భర్త అనుమతి లేకుండా గర్భస్రావం కుటుంబంపరమైన వివాదాలు పెంచవచ్చు. అయితే ఇప్పుడే ఏదో జరిగిపోతుందని చెప్పడం కూడా సరికాదు. అమల్లో ఇది ఎలా జరుగుతుందో చూస్తే మనకు ఇంకాస్త స్పష్టత వస్తుంది'' అని బీబీసీతో అన్నారు సీనియర్ సివిల్ న్యాయవాది శ్రీనివాస్.

''చాలా మంది డాక్టర్లు అబార్షన్ చేయడం కోసం అనవసరమైన పద్ధతులు.. అంటే కుటుంబ సభ్యుల అనుమతి, రకరకాల పత్రాలు, చట్టపరమైన పత్రాలు అడుగుతుంటారు. వీటికేమీ చట్టబద్ధత లేదు. కేవలం ఆ మహిళ అనుమతి చాలు. గర్భస్రావ చట్టంలోని మిగతా అంశాలను డాక్టర్లు పాటిస్తే చాలు'' అని తీర్పులో రాశారు.

''ఒక మహిళ పెళ్లితో సంబంధం లేకుండా గర్భం ధరించవచ్చు. ఒకవేళ ఆ గర్బం కావాలనుకుంటే అప్పడు అది ఇద్దరు భాగస్వాముల బాధ్యత. కానీ ఒకవేళ ఆ గర్భం అనుకోకుండా వచ్చినా లేక అది వద్దనుకునే గర్భమైనా అప్పుడు అది ఆ మహిళ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి తన ఆరోగ్యానికి హాని అనుకుంటే ఆ మహిళ తన గర్భాన్ని తీయించేసుకోవచ్చు. స్త్రీ శరీరంపై పూర్తి హక్కు స్త్రీది మాత్రమే. గర్భంతో సహా అబార్షన్ వంటి నిర్ణయాలు జీవితంలో ఇబ్బందికర పరిస్థితుల్లోనే తలెత్తుతాయి. దానిపై పూర్తి నిర్ణయం ఆ గర్భం మోసే మహిళదే'' అని తీర్పులో పేర్కొన్నారు.

ఈ కేసు సందర్భంగా సుప్రీం కోర్టు మేరిటల్ రేప్‌ను ప్రస్తావించడాన్ని కూడా మహిళా హక్కుల కార్యకర్తలు స్వాగతించారు.

''మేం ఎప్పటి నుంచో మాట్లాడుతున్న మేరిటల్ రేప్‌ను ఈ కేసులో సుప్రీం కోర్టు గుర్తించింది. ఇది చాలా ఆసక్తికర అంశం'' అన్నారు కొండవీటి సత్యవతి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
What are the changes in women's rights regarding abortions and marital rape with the Supreme Court's historic verdict?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X