US-Iran Talks: ఇరాన్ కు 5 షరతులు పెట్టిన అమెరికా..! అక్కడే అసలు ట్విస్ట్..!
అమెరికా-ఇరాన్ చర్చల్లో (US-Iran talks) మరో తాజా పరిణామం. ఇరాన్ ను ఎట్టి పరిస్ధితుల్లోనూ అణ్వాయుధం తయారు చేయకుండా అడ్డుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న అమెరికా.. తాజాగా ఐదు షరతుల్ని విధించింది. ఈ షరతులకు అంగీకరిస్తేనే చర్చలు ముందుకెళ్తాయని స్పష్టం చేసింది. ఇరాన్ ఫార్స్ న్యూస్ ఏజెన్సీ నివేదిక ప్రకారం గతంలో విధించిన ఆంక్షల, విధాన నిర్ణయాల వల్ల కలిగిన నష్టాలకు ఇరాన్‌కు ఎలాంటి పరిహారం చెల్లించబోమని తేల్చిచెప్పేసింది.
దీంతో పాటు చర్చలలో భాగంగా 400 కిలోగ్రాముల శుద్ధిచేసిన యురేనియాన్ని తమకు అప్పగించాలని కూడా అమెరికా ఇరాన్‌ను డిమాండ్ చేసింది. ఇరాన్ అణు కర్మాగారాలలో కేవలం ఒక సముదాయం మాత్రమే పనిచేస్తూ ఉండాలనేది మరో షరతు. ఇరాన్ స్తంభింపజేసిన విదేశీ ఆస్తులలో 25 శాతాన్ని కూడా విడుదల చేయడానికి అమెరికా నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు చర్చలు కొనసాగి, పూర్తయితేనే వివిధ రంగాలలో ఘర్షణలు ముగుస్తాయని అమెరికా పేర్కొంది. అలాగే ఇరాన్ ఈ షరతులను నెరవేర్చినప్పటికీ అమెరికా-ఇజ్రాయెల్ దురాక్రమణ ముప్పు కొనసాగుతుందని తెలుస్తోంది.

యుద్ధాన్ని ముగించడానికి చర్చలు జరపాలన్న ఇరాన్ ప్రతిపాదనకు ప్రతిస్పందనగా అమెరికా ఎలాంటి నిర్దిష్ట రాయితీలు ఇవ్వలేకపోయిందని ఇరాన్ మీడియా తెలిపింది. ఎలాంటి స్పష్టమైన రాయితీలు ఇవ్వకుండా, యుద్ధ సమయంలో తాను పొందలేకపోయిన రాయితీలను అమెరికా పొందాలని చూస్తోందని తెలిపింది. ఇది చర్చలలో ప్రతిష్టంభనకు దారి తీస్తుందని వెల్లడించింది. అటు ఇరాన్ కూడా చర్చల కోసం ఐదు విశ్వాస నిర్మాణ ముందస్తు షరతులను పెట్టింది. వీటిలో అన్ని రంగాలలో, ముఖ్యంగా లెబనాన్‌లో ఘర్షణలకు ముగింపు పలకడం, ఇరాన్‌పై ఆంక్షలను ఎత్తివేయడం, స్తంభింపజేసిన ఇరాన్ నిధులను విడుదల చేయడం వంటివి ఉన్నాయి. యుద్ధ సంబంధిత నష్టాలకు పరిహారం, ప్రపంచంలోని కీలక చమురు రవాణా మార్గమైన హార్ముజ్ జలసంధిపై తమ సార్వభౌమాధికారాన్ని గుర్తించాలని ఇరాన్ డిమాండ్ చేసింది.














Click it and Unblock the Notifications