వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిల్లల ఆహారం విషయంలో తల్లులు చేసే నాలుగు తప్పులేమిటి? పూరకాహారం అంటే అందులో ఏమేం ఉంటాయి

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
పూర్తిగా ఆరునెలల తర్వాత నుండి పిల్లలకు పూరకాహారం అందించాలి.

''రెండు రోజుల నుంచి జలుబు, ఇప్పుడు దగ్గు కూడా మొదలైంది. మంచి మందులు రాయండి మేడమ్". అడుగుతోంది తల్లి, చదువుకున్నమ్మాయిలానే ఉంది!

ఏడు కేజీలు కూడా తూగని తన ఏడాది వయసు కొడుకు గురించి నేను ఆలోచిస్తున్న సంగతి పూర్తిగా వేరే. చిట్టీలో ఒక్క సిరప్ రాసి చేతికిచ్చాను.

"మేడమ్, మేము చాలా దూరం నుండి వచ్చాం. బాబుకు బలానికి కూడా ఏమన్నా రాయండి.” తన ప్రయాసకి సరితూగని ఆ ఒక్క సిరప్ తో సంతృప్తి చెందని తల్లి మళ్ళీ అడిగింది.

రెండు రోజుల జలుబుకు మంచి మందులు?!

బలానికి మందులు!

అసలు వైద్యం కావలసింది బిడ్డకు కాదు, తల్లికి అని అర్థమైంది నాకు.

ఎందుకంటే ఇలాంటి తల్లిదండ్రుల్ని నేను రోజూ చాలా మందిని చూస్తుంటా.

మందులే అన్నిటికీ పరిష్కారం అనుకుంటారు. పిల్లల పోషణ గురించి అవగాహన శూన్యం. చదువు, సంపాదన, ప్రాంతాలకి అతీతం ఈ అవగాహనారాహిత్యం.

అప్పుడే పుట్టిన బిడ్డ నుండీ "అమ్మా అన్నం పెట్టు" అని పిల్లలే అడగగలిగే వయసు వరకూ వారి పోషణ ఎలా ఉండాలో చూద్దాం.

బిడ్డ పుట్టిన ఒక గంటలోపే తల్లిపాలు పట్టాలి. ఆ తర్వాత ప్రతి రెండు గంటలకొకసారి తల్లిపాలే పట్టాలి. మొదటి ఆరు నెలలూ అదే బిడ్డకు ఆహారం.

అయితే ఈ విషయంలో నన్ను తరచూ బిడ్డతల్లులు అడిగే ప్రశ్నలు -

"బాగా ఎండాకాలం కదా, కొన్ని నీళ్లు పట్టొచ్చా?!"

"పాలు అరగట్లేదేమో? గ్రైప్ వాటర్ పట్టొచ్చా?!"

"పిల్లాడికి విరేచనాలు అవుతున్నాయ్, మా బామ్మ పాలు ఇవ్వొద్దంది ఈ పూట".

"బాదం, జీడిపప్పు లాంటివి మిక్సీ పట్టి పాలలో కలిపి ఇవ్వొచ్చా?!"

ఎండా కాలమైనా, అసలే కాలమైనా పాలిచ్చే తల్లి బాగా నీరు (4- 5 లీ) తీసుకోవాలి. బిడ్డలకు ప్రత్యేకంగా నీరు అవసరం లేదు.

తల్లీబిడ్డ

తాగిన పాలల్లో కొన్ని వెనక్కి కక్కడం, కొన్నిసార్లు అన్నీ కక్కేయడం కూడా జరుగుతుంది. పాలు తాగే సమయంలో చంటి పిల్లలు గాలి మింగుతారు కూడా, దానివల్ల గాలి వదలటం తరచుగా చూస్తుంటాం. ఇదంతా అరుగుదల సరిగా లేక జరుగుతుందేమో అనుకోవటం తప్పు. దానికి అరగడానికి చుక్కల మందులు, గ్రైప్ వాటర్ వంటివి వాడకూడదు.

నీళ్ల విరేచనాలయ్యే సమయంలో పాలు పట్టకపోవడం అనేది కూడా మరొక పెద్ద తప్పు. వైరల్ కానీ, బ్యాక్టీరియల్ కానీ పొట్టలో ఇన్ఫెక్షన్ వస్తే ముందు ఒకటి రెండు రోజులు వాంతులవడం, తర్వాతి రెండు రోజులపాటు విరేచనాలవడం సహజమే. అలాంటప్పుడు బిడ్డ తన శరీరంలోని నీరు, శక్తి అదనంగా కోల్పోతుంది. కాబట్టి అటువంటి సమయంలో తల్లి మరింత ఎక్కువగా స్థన్యమివ్వాలి. మరీ అవసరమైతే ORS కూడా వైద్యుల సలహా మేరకు పట్టాలి. అంతేగానీ పాలు తాగించకపోవడం మరింత అపాయం.

బాదంపప్పు వంటివి బలవర్థకమైన ఆహారమే అయినప్పటికీ, పసిపిల్లల పేగు వాటిని జీర్ణం చేసుకునే స్థితిలో అప్పుడే ఉండదు. అంతేకాక లేనిపోని ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. ఇంకా చెప్పాలంటే అవన్నీ తల్లి తినడం వల్ల తల్లిబిడ్డలిద్దరికీ మేలు.

తల్లీబిడ్డ

ఆరునెలల తర్వాత కథ

పూర్తిగా ఆరు నెలల తర్వాత నుండి పూరకాహారం అందించాలి.

ఇక్కడ మళ్లీ రెండు రకాల సందేహాలొస్తాయి.

1. అంటే ఇక తల్లి పాలు పూర్తిగా మానేయొచ్చా?

కచ్చితంగా కాదు. తల్లిపాలు ఇస్తూనే పైన ఆహారం అందివ్వాలి. దాన్నే పూరకాహారం(complementary diet) అంటాం. తల్లిపాలు రెండు సంవత్సరాల వరకూ ఇవ్వాలి.

2. ఆరునెలల తర్వాత తల్లి పాలకు బదులు వేరే పాలు ఇవ్వొచ్చా?

మానేయకూడదు. ఏదైనా పరిస్థితుల వల్ల పాలు మాన్పించాలన్నా, కనీసం ఒక సంవత్సరం పాటు తల్లిపాలు ఇచ్చి, ఆపై వాడుక అనుసారంగా ఆవు లేదా గేదె పాలు మోతాదుగా ఇవ్వాలి.

బిడ్డకు పూరకాహారం పెట్టే 6 -12 నెలల వయసు ఎంతో కీలకమైనది. తల్లిపాల నుండి మెల్లగా విడివడి సంపూర్ణాహారం తినే స్థితికి చేరుకోవడానికి వారథి ఈ దశ.

ఈ దశలో తల్లులు ప్రధానంగా నాలుగు రకాల పొరపాట్లు చేస్తుంటారు.

మొదటిది :- గ్రామీణ ప్రాంతాల్లో,అందునా ఇంటిపట్టున ఉండే బిడ్డ తల్లుల ఎక్కువగా చేసే పొరపాటు ఇది. ఆరు నెలలూ...ఏడూ...ఎనిమిదీ దాటినా పూరకాహారం మొదలుపెట్టరు. నా పాలే దండిగా ఉన్నాయి, బిడ్డకు సరిపోతున్నాయి అని ఒకింత గొప్పగా చెప్పుకుంటారు కూడా.

రెండవది:- పట్టణ ప్రాంతాల్లో, నగర ప్రాంతాల్లో నివసించే ఉద్యోగిణులైన తల్లుల తీరిలా ఉంటుంది. ఆరు నెలల సెలవు అయిపోగానే పనికి వెళ్లి పోవాలి కాబట్టి సీసాతో పోతపాలు అలవాటు చేయడం.

మూడో తప్పు:- జాబ్ కి వెళ్ళిపోవాలి కాబట్టి, చాలా ముందునుండే ( ఒక్కోసారి నాలుగు నెలలు నిండగానే) అంగళ్లలో దొరికే (రెడీ టు యూస్) ఘనాహారం తెచ్చి పెట్టేయడం. కాస్త స్తోమత - అవకాశం ఉన్న వారయితే విదేశాల్నుండి దిగుమతి చేసుకున్న రకరకాల డబ్బాల్లో పేస్టుల్లాంటి పదార్థాలు వాడేయడం.

నాల్గవ పొరపాటు: ఏది పడితే అది, ఎంత పడితే అది పెట్టి పిల్లాడికి అరగడం లేదనో తినడం లేదనో తేల్చేసి, చివరికి పాల సీసాని ఆశ్రయించడం.

ఎందుకు మొదటి ఆరు నెలలే తల్లిపాలు?

మొదటి ఆరునెలల వరకూ బిడ్డ ఎదుగుదలకు కావలసిన కేలరీలు మరియు పోషక పదార్థాలన్నీ తల్లిపాలతో సమకూరుతాయి. అంతేకాదు, సహజ రోగనిరోధక శక్తి అంతంత మాత్రమే ఉండే ఈ వయసులో తల్లిపాలనుండి ఎన్నో రకాల రోగనిరోధక శక్తి సంక్రమిస్తుంది.

బిడ్డ పేగు, కాలేయం, కిడ్నీలు మరీ సంక్లిష్టమైన ఆహారాన్ని జీర్ణించి శుద్ధి చేయగల సామర్థ్యం కలిగి ఉండవు కూడా. తల్లిపాలలోనే తగినంత నీటి శాతం బిడ్డకు దక్కుతుంది. పాలిచ్చేటప్పుడు ముందు స్రవించే పాలు(fore milk) దాహార్తిని, ఆఖరున వచ్చే పాలు (hind milk) తృప్తిని (satiety) ఇస్తాయి. కాబట్టి మొదటి ఆరు నెలలు కచ్చితంగా తల్లిపాలు మాత్రమే…

పూరకాహారం - ప్రాముఖ్యం

ఆరు నెలల తర్వాత బిడ్డ ఎదుగుదల చాలా వేగమందుకుంటుంది. అంతే కాదు బిడ్డ బోర్లా పడటం, ముందుకు పాకడం, దోగాడటం, నడవడం... ఇలా అన్ని రకాల శరీర కదలికలతో వడివడిగా ఎదిగే దశ. కాబట్టి ఎక్కువ శక్తి ఖర్చవుతుంది. నాలుక పైన రుచి మొగ్గలు కూడా అభివృద్ధి చెందుతాయి కాబట్టి అన్ని రకాల రుచులనూ పరిచయం చేయాలిప్పుడు.

తల్లి పాలు సమృద్ధిగా ఉన్నాయనుకొని మరో రెండు మూడు నెలలు సరిపెడితే, ఆ తర్వాత పిల్లలు, పై ఆహారం తినటానికి ఇష్టం చూపరు. అందువల్ల మళ్లీ తల్లి బిడ్డను రొమ్ముకు తగిలించుకోవడం, ఆహారానికి దూరం చేయటం... ఇలా ఒక ప్రమాదమైన వలయం మొదలవుతుంది.

అప్పటిదాకా బొద్దుగా ఉన్న బిడ్డ, బుగ్గలూ-పాలబొజ్జా కరిగిపోయి బక్కగా తయారవుతాడు. అప్పట్నుండి మరో ఒకటి-రెండు కేజీలకు మించి బరువు పెరగడు. ఎదుగుదల మందగించి, తదనుగుణంగా ఆకలి కూడా తగ్గిపోతుంది. ఆ తర్వాత బిడ్డ అది తినడం లేదు, ఇది తినడం లేదు, అసలేమి తినడం లేదు అనే స్థితికి వస్తుంది.

అందుకే పూరకాహారం మరీ ముందుగా కాకుండా మరీ ఆలస్యమూ కాకుండా సరైన వయసులో సరైన విధంగా బిడ్డకు అందజేయాలి.

పిల్లలకు ఆహారం పెడుతున్న తల్లి

సరైన పూరకాహారం ఎలా ఉండాలి?

బిడ్డ తినడానికి రుచిగా, శుచిగా, తేలికగా జీర్ణమయ్యేలా ఉండాలి. అన్ని కాలాల్లోనూ అందుబాటులో ఉండేదై, కొనుగోలు శక్తికి మించనిదై ఉండాలి. వండక ముందు నిల్వ ఉంచుకోవడానికి వీలుండి, వండటానికి ఎక్కువ ప్రయాస లేనిదై ఉండాలి. ఎప్పుడూ ఒకే రకమైన రుచి కూడా ఉండకూడదు. ఖరీదైనవి, అరుదుగా దొరికేవి, ఆకర్షణీయమైన ప్యాకేజీల్లో దొరికేవి, టీవీ ప్రకటనల్లో చూపించేవి మంచివనుకోవడం భ్రమ.

ఉదాహరణకి, మన దక్షిణ భారతీయులు మెత్తగా పట్టిన బియ్యంరవ్వతో వండిన ఆహారాన్ని బిడ్డ తొలి ఆహారంగా అందించవచ్చు. అధిక శక్తి కోసం, రుచి కోసం అందులో పాలు, పెరుగు,బెల్లం, తేనె, నెయ్యి, నూనె లాంటివి కలపవచ్చు.

ఎలా, ఎప్పుడు, ఎంత పూరకాహారం పెట్టాలి ?

మొదటిసారి పెట్టే ఆహారాన్ని పాల కంటే కొంచెం చిక్కగానూ, కాస్త వెచ్చగా - తియ్యగా, పగటిపూట పెట్టి చూడాలి. బాగా ఆకలిమీద ఉన్న బిడ్డయియితే చక్కగా తింటాడు కూడా. మధ్య మధ్యన చెంచాతో నీరు అందించవచ్చు. వెరసి 50 నుండి 70 గ్రాములంత ఆహారాన్ని ఒకసారి తినిపించవచ్చు.

అలా రోజుకు 5 - 6 సార్లు ఈ పూరకాహారాన్ని బిడ్డకు అందిస్తూ, తల్లిపాలు కూడా ఇస్తూ పోవాలి. ఒక తృణ ధాన్యంతో మొదలుపెట్టి మెల్లగా ఇతర తృణ ధాన్యాలు (రాగి, గోధుమ) కూడా ఇవ్వొచ్చు. ఓ రెండు వారాల తర్వాత పప్పు ధాన్యాలు కూడా కలుపుతూ పోవచ్చు.

బిడ్డ ఎదిగేకొద్దీ ఆహారాన్ని మరింత చిక్కగా,గుజ్జుగా, కొంచెం బరకగా ఇవ్వొచ్చు. మోతాదు కూడా 100 నుండి 150 గ్రాముల వరకూ ఇవ్వొచ్చు. ఇతర కూరగాయలు, ఆకుకూరలు, పెరుగు వంటివి ఆ వండే అన్నంలో చేరుస్తూ పోవాలి. 9వ నెల నుండీ మాంసాహారం కూడా నిస్సందేహంగా తినిపించవచ్చు.

ఆహారం మోతాదు పెంచే క్రమంలో(ఏడాది వయసు దాటాక) మనతో పాటు రోజుకి మూడుసార్లు తాజాగా వండిన ఆహారాన్ని ఇస్తూ, రెండు లేదా మూడుసార్లు ఏదైనా చిరుతిండి పెట్టాలి. అవి సీజన్లో దొరికే పండ్లు, చిన్న కేకు ముక్క, ఇంట్లో చేసిన పిండి వంటలు, పాయసం లాంటివై ఉండాలి.

పాలు తాగుతున్న పసిపాప

6 - 9 నెలల వయసులో పూరకాహారాన్ని ముందు ఇచ్చి, ఆ తర్వాత తల్లి పాలివ్వడం, ఆపైన నెలల్లో కేవలం నిద్రబుచ్చే సమయంలోనే తల్లి పాలివ్వడం చేయాలి. అలా తల్లిపాలు బిడ్డ రెండేళ్లు నిండే వరకూ ఇవ్వాలి. విడిగా గ్లాసుతోగానీ, సీసాతోగానీ పాలు ఇవ్వనవసరం లేదు.

మొదటి సంవత్సరం వరకూ ఏ పూటకాపూట తాజాగా బిడ్డ కోసం విడిగా వండి పెట్టాలి. రెండవ సంవత్సరం నుండీ మనం వండుకున్న ఆహారంలోనే కాస్త కారం తక్కువగా (అంటే తక్కువ కూర పెట్టడం కాదు) నెయ్యి వేసి పెడుతూ పోవాలి. అలా రెండో సంవత్సరం పూర్తయ్యేనాటికి సొంతగా తినేలా అలవాటు చెయ్యాలి.

రోజూ ఒకే సమయంలో, ఒక స్థలంలో కూర్చోబెట్టి బిడ్డతో మాట్లాడుతూ తినిపించడం ఉత్తమమైన పద్ధతి. వీలైనంత వరకూ మిగిలిన కుటుంబ సభ్యులతో కలిసి భుజించేలా అలవాటు చెయ్యాలి. దీనివల్ల పిల్లలకు క్రమశిక్షణ, భోజనం పట్ల శ్రద్ధ, సమయపాలన అబ్బుతాయి. స్వంతగా తినడం, త్వరగా తినడం కూడా తొందరగా నేర్చుకుంటారు.

ఫోన్లు, టీవీలు చూపుతూ లేదా ఇల్లంతా తిరుగుతుంటే వెంటబడి తినిపించడం అలవాటు చేయకూడదు. దీనికి కావలసిందల్లా తినిపించే వారికి ఓపిక మాత్రమే.

ఇవండీ పిల్లల పోషణ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు. చిన్న చిన్న జాగ్రత్తలతో చిట్టి బొజ్జలు నింపితే పిల్లలు సమిష్టి ఆరోగ్యవంతులుగా ఉంటారు.

ఈరోజు పిల్లల ఆహారం విషయంలో ఓపిక, అవగాహన లేకపోతే, రేపు బలానికి, బరువుకి, తెలివికి అంటూ టానిక్కులతో పిల్లల పొట్టలు నింపాల్సి వస్తుంది.

అందుకే అంటాను - సమీకృత పూరకాఆహారమే బిడ్డకు సర్వోన్నత ఔషధం. అలాంటి ఆహారం దక్కే బిడ్డకు డాక్టర్ల అవసరం కూడా పెద్దగా రాదు.

మీ బిడ్డల ఆరోగ్యం వారికి మీరిచ్చే ఆహారంలోనే దాగి ఉంది.

(పాత్రలు కల్పితం, అభిప్రాయాలు వ్యక్తిగతం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
What are the four mistakes that mothers make when it comes to baby food
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X