నిన్నెవరైనా రేప్ చేస్తే ఏం చేస్తాం:జర్నలిస్ట్‌తో బిజెపి నేత
బెంగళూరు: 'నువ్వూ ఓ మహిళవే కదా. నిన్ను ఎవడో ఒకడు లాగి అత్యాచారం చేస్తే ఎక్కడో ఉన్న మేం (ప్రతిపక్షం) ఏం చేస్తాం? ఏం చేయగలం? ఏం చేయాలో నువ్వే చెప్పు. అదే చేస్తాం. ఆరేళ్ల బాలిక పైన అత్యాచారం జరిగినప్పుడు సభలో ఎన్ని రకాలుగా మాట్లాడాలో అన్ని రకాలుగా గొంతెత్తినందుకు మీలాంటి వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ నన్నే తప్పుబట్టారు' అంటూ వ్యాఖ్యానించారు ఓ నేత.
కర్ణాటక విధాన మండలి ప్రతిపక్ష నాయకుడు, సీనియర్ బీజేపీ నేత ఈశ్వరప్ప నోరు జారారు. ఒకవేళ నిన్ను ఎవరైనా రేప్ చేస్తే మేమేం చేయగమని ఒక మహిళా జర్నలిస్టుతో అనడం వివాదాస్పదమైంది.
కర్ణాటకలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారిందని, మహిళలపై అత్యాచారాలు వంటి నేరాలు పెరిగిపోతున్నాయని, ఈ విషయంలో ప్రతిపక్షంగా బీజేపీ సరిగా వ్యవహరించడం లేదని, ప్రభుత్వాన్ని నిలదీయడంలో బీజేపీ విఫలమైందని శనివారం మీడియా సమావేశంలో పాల్గొన్న ఈశ్వరప్పతో స్థానిక టీవీ చానల్ మహిళా విలేకరి అన్నారు.

దాంతో ఈశ్వరప్పకు ఆగ్రహం ముంచుకొచ్చింది. వచ్చింది. నేనేమైనా అంటే మీరే అభ్యంతరం చెప్తున్నారన్నారు. దీంతో, నీవో ఆడదానివి.. నిన్ను ఎవరో రేప్ చేశారనుకుందాం... ప్రతిపక్ష నేతలైన మేం వేరే ఎక్కడో ఉన్నారనుకుందాం... అటువంటపుడు మేం ఏం చేయగలమని విలేకరిని ఎదురు ప్రశ్నించారు.
ఈశ్వరప్ప వ్యాఖ్యలను ఆయన సొంత పార్టీ సహా పలువురు ఖండించారు.ఆ వ్యాఖ్యలు అనుచితమైనవని బీజేపీఎల్పీ నేత జగదీశ్ షెట్టర్ అన్నారు. ఈశ్వరప్ప నోటి దురుసుతనంపై జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని సీఎం సిద్ధరామయ్యను కోరారు.
ఈశ్వరప్ప ఏనాడు సరిగా మాట్లాడలేదని సీఎం విమర్శించారు. తన వ్యాఖ్యలపై ఈ విధంగా మళ్లీ దుమారం రేగడంతో దిగొచ్చిన ఈశ్వరప్ప తన వ్యాఖ్యలను మీడియా తప్పుగా అర్థం చేసుకున్నదన్నారు.
గతంలో ఓసారి ఈశ్వరప్ప మాట్లాడుతూ.. కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హోమంత్రి జార్జి కూతుర్లు సిద్ధమ్మ, మేరియమ్మ అత్యాచారాలకు గురైతే తప్ప వారు కళ్లు తెరవరని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా, తాజా వ్యాఖ్యల పైన మహిళా విలేకరి పని చేస్తున్న మీడియా సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది.












Click it and Unblock the Notifications