వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశ విభజన సమయంలో సిక్కు కుటుంబాన్ని కాపాడేందుకు లాహోర్ ముస్లిం యువకుడు ఏం చేశారంటే..

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
మహ్మద్ బషీర్ వర్క్(ఎడమ)తో తరుంజిత్ సింగ్ బొతాలియా

అది భారతదేశ విభజనకు కొద్దిగా ముందు కాలం. లాహోర్‌లోని స్థానిక మసీదు ఇమామ్ ఒకరు, ఓ గవర్నమెంట్ ఆఫీసర్ కొడుకును పిలిచి ఒక మాట అడిగారు.

''చాలా రోజులుగా మీరు మీ ఇంట్లో ఎవరికో ఆశ్రయం ఇచ్చారని ఆ ప్రాంతంలో అంతా అనుకుంటున్నారు. ఎవరు వాళ్లు'' అని ప్రశ్నించారు.

ఆ యువకుడు వెంటనే ''వాళ్లు మా సోదరులు. మా కుటుంబ సభ్యులు'' అని సమాధానం చెప్పాడు.

మసీదు ఇమామ్‌కు అనుమానం వచ్చి, ఖురాన్‌ తీసుకువచ్చి ''మీ ఇంట్లో ఉంటున్నది మీ సోదరులేనని ప్రమాణం చెయ్యి’’ అని ఆ అధికారి కొడుకుతో అన్నారు.

''నా ఇంట్లో ఉంటున్న వారు నా సోదరులు'' అని ఆ అబ్బాయి ఖురాన్‌‌పై ప్రమాణం చేసి చెప్పాడు.

దేశ విభజన సమయంలో, అది పాకిస్తాన్ కావచ్చు, భారత్ కావచ్చు..హిందువులు, సిక్కులు, ముస్లింలు తాము మైనారిటీలుగా ఉన్నచోట అభద్రతలో ఉండేవారు. వారిపై స్థానికులు దాడులు చేసేవారు.

ఆగ్రహంలో ఉన్న మెజారిటీ ప్రజలు మైనారిటీలపై దాడులు చేసేవారు. అల్లర్లు జరిగినప్పుడు కొందరు అదృష్టం కొద్దీ తప్పించుకుని వెళ్లగలిగితే, కొందరు ప్రాణాలు, ఆస్తులు కోల్పోయేవారు. అయితే, ఇలా మైనారిటీల మీద దాడులు జరిగినప్పుడు మెజారిటీ వర్గంలోని కొందరు మైనారిటీ ప్రజలను కాపాడిన సందర్భాలు కూడా ఉన్నాయి.

కథలాంటి నిజం

ఓ సిక్కు కుటుంబాన్ని ముస్లిం కుటుంబం రక్షించిన ఘటన లాహోర్‌లో జరిగిన విషయం చాలా సంవత్సరాల తర్వాత ఇండియా, అమెరికాలలో కొందరికి తెలిసింది. ఈ కథలో ఒక ముస్లిం అధికారి కుమారుడు, తమ ఇంట్లో ఉన్నవారు తమ సోదరులేనని ఖురాన్ మీద ప్రమాణం చేసి చెప్పాడు.

ఈ విషయాన్ని అమెరికాలో ఉంటున్న డాక్టర్ తరుంజిత్ సింగ్ బొతాలియాకు ఆయన నాన్నమ్మ చెప్పారు. డాక్టర్ తరుంజిత్ సింగ్ బొతాలియా ఈ సంఘటన గురించి తన చిన్నతనంలో చాలాసార్లు విన్నారు. ఆ సంఘటనకు సంబంధించిన వ్యక్తులు, వారి హోదాలు, ప్రాంతాలు ఆయనకు గుర్తుండిపోయాయి.

ఇది జరిగిన అనేక ఏళ్ల తర్వాత ఈ సంఘటనల నేపథ్యాన్ని తెలుసుకోవడానికి డాక్టర్ తరుంజిత్ సింగ్ అనేకసార్లు పాకిస్తాన్‌లోని పంజాబ్, లాహోర్, గుజ్రాన్‌వాలా నగరాలకు వెళ్లారు.

ఖురాన్ మీద ప్రమాణం చేసిన కుర్రాడు తప్పుడు ప్రమాణం చేయలేదని, మనుషుల ప్రాణాలను కాపాడటానికే అలా చేశాడని, అది ఎంత మాత్రం తప్పుకాదని తరుంజిత్ సింగ్ బొతాలియా అన్నారు.

ఆ కుర్రాడు తన ప్రాణాలను పణంగా పెట్టి తమ తాతగారి కుటుంబాన్ని రక్షించారని బొతాలియా అన్నారు. అసలు ఈ కథలోకి వెళ్లే ముందు డాక్టర్ తరుంజిత్ సింగ్ బొతాలియా, ఆయన కుటుంబ నేపథ్యం ఏంటో తెలుసుకోవాలి.

దేశవిభజన:తరుంజిత్ సింగ్ తాత కెప్టెన్ అజిత్ సింగ్, నాన్నమ్మ నరేంద్ర కౌర్

భూస్వామ్య కుటుంబం

విభజన సమయంలో డాక్టర్ తరుంజిత్ సింగ్ బొతాలియా కుటుంబం గుజ్రాన్‌వాలా నుండి భారతదేశానికి వచ్చింది. ఆ తర్వాత తరుంజిత్ సింగ్ అమెరికాలో స్థిరపడ్డారు.

డాక్టర్ తరుంజిత్ సింగ్ పూర్వీకులకు పంజాబ్ పాలకుడు మహారాజా రంజిత్ సింగ్ ఆస్థానంతో సంబంధాలు ఉన్నాయి. విభజనకు ముందు, వారు ఈ ప్రాంతంలోని అతి పెద్ద సామంతులుగా గుర్తింపు పొందారు. ఆయనకు గుజ్రాన్‌వాలాలోని బొతాల గ్రామంలో భూమి ఉంది. అందుకే డాక్టర్ తరుంజిత్ సింగ్ తన పేరుకు బొతాలియా అని చేర్చారు.

భారతదేశ విభజన తర్వాత కూడా పాకిస్తాన్‌లోని చాలామంది సైనికులు, సాధారణ అధికారుల కుటుంబాలతో ఆయన వ్యక్తిగత సంబంధాలు కొనసాగించారు.

డాక్టర్ తరుంజిత్ సింగ్ తాత కెప్టెన్ అజిత్ సింగ్, లాహోర్‌లోని ఐచిసన్ కళాశాల విద్యార్థి. బహవల్పూర్ మాజీ నవాబ్ సాదిక్ ఖాన్, జనరల్ మూసా ఖాన్, ఇంకా మరికొందరు ముఖ్యమైన వ్యక్తులకు ఆయన స్నేహితుడు, సహధ్యాయి. అయితే, ఆయన నాన్నమ్మ నరేంద్ర కౌర్ ఈ ప్రాంతంలో ప్రసిద్ధ సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త.

భారతదేశ విభజన సమయం గురించి మా నాన్నమ్మ తనకు కథలు కథలుగా చెబుతుండేవారని డాక్టర్ తరుంజిత్ సింగ్ చెప్పారు. విభజన సమయంలో అల్లర్లు చెలరేగినప్పుడు, లాహోర్‌లో నివసిస్తున్న ముస్లిం ప్రభుత్వ అధికారి, ఆయన భార్య తమకు రెండు నెలలపాటు ఆశ్రయం ఇచ్చారని ఆమె చెప్పారని ఆయన తెలిపారు.

ఆ సమయంలో ఆశ్రయం ఇచ్చినందుకు ఆ కుటుంబం కష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది. అయినా, సాహసోపేతంగా వ్యవహరించి మానవత్వానికి ఉదాహరణగా నిలిచింది. ఈ సంఘటనలపై పుస్తకం రాయడమే కాకుండా ఆ కుటుంబం ఎక్కడుందో తెలుసుకోవడానికి చాలా సంవత్సరాలు ప్రయత్నించానని బొతాలియా చెప్పారు.

ఆప్తులకు చేరిన పుస్తకం

పుస్తకం రాయడంలో భాగంగా లాహోర్, గుజ్రాన్‌వాలా బొతాలాలోని తన పూర్వీకుల ఇళ్లను సందర్శించానని, ఆ ప్రదేశంలో ఇప్పుడు గర్ల్స్ స్కూల్ ఉండటం చూసి చాలా సంతోషించానని బొతాలియా చెప్పారు.

''మా పూర్వీకుల నుంచి విన్న ఘటనలను పుస్తకంగా రాశాను. ఈ పుస్తకాన్ని లాహోర్‌లో ఉన్న ప్రొఫెసర్ కైలాష్ చదివారు. ప్రొఫెసర్ కైలాష్ స్వయంగా చరిత్రకారుడు, పరిశోధకుడు కూడా. నేను ఆయన్ను కలిసినప్పుడు, పుస్తకంలో రాసిన సంఘటనల ఆధారంగా, ఈ కుటుంబం ముస్లిం లీగ్ ఎంపీ మహమూద్ బషీర్ వర్క్ కుటుంబమని ఆయన నాతో చెప్పారు'' బొతాలియా వివరించారు.

దీని తర్వాత తాను మహమూద్ బషీర్ అహ్మద్ వర్క్‌‌ని సంప్రదించానని డాక్టర్ తరుంజిత్ సింగ్ తెలిపారు. భారతదేశ విభజన సమయంలో ఆయన పూర్వీకులు చాలామంది హిందువులు, సిక్కులకు సాయం చేసి వారి ప్రాణాలను కాపాడారని తెలుసు తప్ప, ఈ కుటుంబం కథ గురించి ఆయనకు కూడా పెద్దగా తెలియదు.

మహమూద్ బషీర్ వర్క్‌తో సమావేశాన్ని వివరిస్తూ, ఒక ఎంపీ అయి ఉండి కూడా ఆయన ప్రదర్శించిన వినయం చూసి తాను ఆశ్చర్యపోయానని డాక్టర్ తరుణ్‌జిత్ సింగ్ అన్నారు.

"మీ కుటుంబీకుల్లో ఎవరైన ప్రభుత్వ అధికారి ఉన్నారా అని నేను అడిగాను. భారతదేశ విభజన తర్వాత ఆయన తాత సుబేఖాన్ లాహోర్‌లో తహసీల్దార్‌గా పని చేసేవారని చెప్పారు" అన్నారు తరుంజిత్

మాకు ఆశ్రయం కల్పించిన కుటుంబ పెద్ద పన్నుల వసూలు శాఖలో పని చేస్తారని మా నాన్నమ్మ కూడా చెప్పేవారని తరుంజిత్ సింగ్ చెప్పారు.

''ఆమ్నా బేగం ఎవరు అని నేను ఆయన్ను అడిగాను. ఇది విని బషీర్ వర్క్‌‌కి కన్నీళ్లు వచ్చాయి. మా తాతను రక్షించి, వారికి సహాయం చేసిన వారి పిల్లలను కలుసుకున్నప్పుడు, నాకు కూడా తెలియకుండానే కన్నీళ్లు వచ్చాయి. మహమూద్ బషీర్ వర్క్ విషయంలో కూడా అదే జరిగింది'' అని తరుంజిత్ సింగ్ వెల్లడించారు.

లాహోర్‌లోని సుబేఖాన్ ప్రభుత్వ నివాసంలో తన తాత రెండు నెలలుగా ఆశ్రయం పొందినట్లు తరుంజిత్ సింగ్ చెప్పారు.

''సుబేఖాన్‌ ఇంటిలో సిక్కులో, హిందువులో ఆశ్రయం పొందుతున్నారని వార్తలు వ్యాపించాయి. స్థానిక మసీదు ఇమామ్ సుబేఖాన్‌‌ను విచారించారు. సుబేఖాన్ తప్పుడు ప్రమాణం చేయలేదు. అతను మా తాతను సోదరుడిగా భావించారు. రెండు నెలలపాటు తన సోదరులకంటే మిన్నగా మా తాతను రక్షించారు. మా సిక్కు మత సంప్రదాయలను కూడా గౌరవించారు'' అన్నారు తరుంజిత్ సింగ్.

మహ్మద్ బషీర్ వర్క్‌ తో తరుంజిత్ సింగ్

ఇంట్లో రెండు రకాల వంటలు

భారతదేశ విభజన సమయంలో ఇల్లు వదిలి రావాల్సి వచ్చిన సమయంలో తన తల్లిదండ్రులు చాలా చిన్న వయసు వారని తరుంజిత్ తెలిపారు. మండే ఎండలో, వారంతా ఎలాగో లాహోర్ చేరుకున్నారు. లాహోర్‌కు చేరుకోగానే సురక్షితమైన వ్యక్తుల చేతుల్లోకి చేరినట్లు అనిపించిందని తన నాన్నమ్మ చెబుతుండేదని ఆయన చెప్పారు.

సుబేఖాన్ భార్య, మహమూద్ బషీర్ అహ్మద్ వర్క్ అమ్మమ్మ మా అమ్మానాన్నలిద్దరినీ తమ సొంత పిల్లల్లా చూసుకునేవారని తరుంజిత్ వెల్లడించారు. ఆ కుటుంబంలో మత సహనం ఎక్కువగా ఉండేదని, వారికి హలాల్ చేసే సంప్రదాయం ఉన్నా, సిక్కుల కోసం వారి మత ఆచారాల ప్రకారం ప్రత్యేకంగా వంట చేసే పెట్టేవారని ఆయన తెలిపారు.

''మా మేలు కోరిన వారి సమాధులను సందర్శించినప్పుడు నేను కేవలం తలవంచి నమస్కరించ లేదు. వారి సమాధులను భక్తితో ముద్దాడాను'' అన్నారు తరుంజిత్

సిక్కులు, హిందువులు సురక్షితంగా ఉన్న గ్రామం

''డాక్టర్ తరుంజిత్ సింగ్ బొతాలియాను కలవడానికి ముందు ఆయన కుటుంబం, మా కుటుంబం మధ్య జరిగిన విషయాలేమీ నాకు తెలియదు'' అని ముస్లింలీగ్ (నవాజ్) ఎంపీ బషీర్ వర్క్ అన్నారు. అయితే, తమ పూర్వీకులు భారతదేశ విభజన సమయంలో హిందువులు, సిక్కులను చేరదీశారన్న విషయం కొంత వరకు తెలుసని ఆయన తెలిపారు.

"భారతదేశం విడిపోయినప్పుడు నేను చిన్నవాడిని. కానీ, ఆనాటి కొన్ని జ్ఞాపకాలు ఇప్పటికీ తాజాగా ఉన్నాయి. మా గ్రామంతోపాటు, చుట్టుపక్కల గ్రామాలలో పెద్ద సంఖ్యలో సిక్కులు, హిందువులు ఉన్నారు. సిక్కులకు పెద్ద ఎత్తున భూములుండేవి. హిందువులు వ్యాపారాలను నిర్వహించేవారు'' అని బషీర్ వర్క్ తెలిపారు.

భారతదేశ విభజన సమయంలో తమ గ్రామంలో కూడా ఉద్రిక్త పరిస్థితులు ఉండేవని బషీర్ వెల్లడించారు.

''రక్షణ కోసం మా నాన్న అప్పట్లో ఒక బోర్ తుపాకీ, రివాల్వర్ తీసుకుని తిరిగేవారు. అప్పట్లో రివాల్వర్ ఉండటమంటే ఇప్పుడు అణుబాంబు ఉండటంతో సమానం'' అని బషీర్ గుర్తు చేసుకున్నారు.

''విభజన సమయంలో హిందువులు, ముస్లింలు, సిక్కుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయని తెలిసింది. అయితే, మన గ్రామంలో అలాంటి గొడవలు జరగవని మా నాన్న చెప్పేవారు. హిందువులు, సిక్కులకు ఎవరూ హాని చేయరని మా నాన్న గ్రామంలో ప్రకటించారు. వారి ప్రాణాలను, ఆస్తులను, గౌరవాన్ని కాపాడటం మన బాధ్యతని చెప్పేవారు. దాడులు జరగకుండా కాపలా ఏర్పాటు చేశారు. హిందువులు, సిక్కులు కూడా ముస్లింలపై దాడి చేయరాదని తీర్మానించారు'' అని బషీర్ వెల్లడించారు.

బషీర్ వర్క్ పూర్వీకుల సమాధులకు నివాళి ఘటిస్తున్న తరుంజిత్ సింగ్ బొతాలియా

ఊరికి అండగా సిక్కులు

''ఒకసారి మా గ్రామంపై సమీప గ్రామాలకు చెందిన సిక్కులు దాడి చేస్తారనే పుకారు వ్యాపించింది. వారిని ఎదుర్కోవడానికి గ్రామ ప్రజలు సిద్ధమయ్యారు. అందరూ తుపాకులు, గొడ్డళ్లు, కర్రలు సేకరించడం ప్రారంభించారు. ఆ సమయంలో మా ఊరి సిక్కులు కూడా మాతో కలిసి వచ్చారు.

''తర్వాత ఏం జరిగిందో గుర్తు లేదు కానీ, సిక్కులు తలపాగలు ధరించి, కృపాణాలు, ఆయుధాలు ధరించి వచ్చారు. అప్పటి నుంచి బయటి గ్రామాలకు చెందిన హిందువులు, సిక్కులు ఆశ్రయం పొందడం ప్రారంభించారు'' అని బషీర్ గుర్తు చేసుకున్నారు.

''మహిళలు, పిల్లలకు మా అమ్మ ఆమ్నాబేగం ఆశ్రయం ఇచ్చారు. ఒక కత్తి పట్టుకుని రాత్రంతా ఇంటి గడప దగ్గరే కాపలా కాశారు'' అన్నారు బషీర్. హిందువులు, సిక్కులు భారతదేశానికి వెళ్లాలని కోరుకున్నారు. మా నాన్న వారిని సురక్షితంగా శరణార్థి శిబిరానికి తీసుకువచ్చారు. చాలామందిని రైలులో ఎక్కించి పంపారు.

''నాన్న, మా ఇంట్లో ఉన్నవారు ఆలింగనం చేసుకుని వీడ్కోలు చెప్పుకోవడం నాకు బాగా గుర్తు. వారి ఆస్తులకు రక్షణ కల్పిస్తామని, పరిస్థితి చక్కబడిన తర్వాత తిరిగి వస్తే అవన్నీ మీకు అప్పజెబుతామని మా నాన్న వారికి చెప్పారు'' అని బషీర్ గుర్తు చేసుకున్నారు.

విభజన సమయంలో చాలా కుటుంబాలు ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయానని, వారిలో చాలామంది తిరిగి రాలేదని బషీర్ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
What did a Lahore Muslim youth do to save a Sikh family during partition
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X