వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశద్రోహం: బ్రిటిష్ కాలం నాటి చట్టం ఏం చెప్తోంది? సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏమిటి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
మహాత్మా గాంధీ అరెస్ట్

దేశంలో 'దేశద్రోహం’ చట్టం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

దేశద్రోహం చట్టాన్ని మరొకసారి పూర్తి స్థాయిలో పరిశీలించాలని, ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు దీని కింద కొత్త కేసులు పెట్టవద్దని సుప్రీం కోర్టు ఆదేశించింది.

ఇంతకుముందు పుల్వామాలో ఉగ్రవాద దాడి నేపథ్యంలో సోషల్ మీడియాలోనూ వెలుపలా పలువురు చేస్తున్న వ్యాఖ్యలు, ప్రతిస్పందనల మీద దేశద్రోహం సెక్షన్ కింద కేసులు నమోదు చేసి అరెస్టులు చేశారు.

2016లో జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు కన్హయ్యకుమార్, ఆ తర్వాత పలువురు హక్కుల ఉద్యమకారుల అరెస్టుల నేపథ్యంలోనూ దేశద్రోహం సెక్షన్ మీద విస్తృత చర్చ జరిగింది. ఇంకా జరుగుతూనే ఉంది.

దేశద్రోహ నేరానికి సంబంధించిన నిబంధన.. భారత శిక్ష్మా స్మృతిలోని సెక్షన్ 124-ఏ. ఈ సెక్షన్‌ను ప్రస్తుతం భారత న్యాయ కమిషన్ సమీక్షిస్తోంది కూడా. ఈ సెక్షన్ గురించి చర్చించిన అంశాలపై ప్రజాభిప్రాయం తెలియజేయాల్సిందిగా 'కన్సల్టింగ్ పేపర్’ను న్యాయ కమిషన్ 2018 ఆగస్టు చివరిలో విడుదల చేసింది.

ఈ నేపథ్యంలో అసలు దేశద్రోహ చట్టం భారతదేశంలో ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది? ఇన్నేళ్లలో ఈ సెక్షన్ ఎలా మారుతూ వచ్చింది? సుప్రీంకోర్టు వివిధ కేసుల సందర్భంలో ఏం చెప్పింది? అనే అంశాలు సంక్షిప్తంగా...

దేశద్రోహ చట్టం

ఐపీసీ సెక్షన్ 124-ఏ చెప్తున్నది ఇదీ...

''మాటలతో కానీ, చేతలతో కానీ, సంకేతాలతో కానీ, ప్రదర్శనలతో కానీ, మరే విధంగానైనా కానీ.. భారతదేశంలో చట్టబద్ధంగా నియమితమైన ప్రభుత్వం పట్ల అవిధేయతను, విద్వేషాన్ని, శత్రుభావనలను ప్రేరేపించిన లేదా ప్రేరేపించటానికి ప్రయత్నించిన వారు ఎవరినైనా జీవితఖైదు ద్వారా కానీ, దీనికి అదనంగా జరిమానాతో కానీ, మూడు సంవత్సరాల వరకూ కారాగారవాసం ద్వారా కానీ, జరిమానా ద్వారా కానీ శిక్షించవచ్చు'' అని ఐపీసీ సెక్షన్ 124-ఏ చెప్తోంది.

మెకాలే

దాదాపు 150 ఏళ్ల కిందట మెకాలే రూపొందించిన సెక్షన్...

భారత శిక్షా స్మృతిని బ్రిటిష్ ఇండియాలో మొదటి లా కమిషన్ చైర్మన్‌గా పనిచేసిన థామస్ మెకాలే రూపొందించారు. ఆయన 1837లో భారత శిక్షా స్మృతి ముసాయిదాను తయారు చేశారు. అందులో సెక్షన్ 133 కింద ఈ దేశద్రోహం అనే నిబంధనను చేర్చారు.

అయితే.. ఐపీసీని అమలులోకి తెచ్చినప్పుడు ఈ సెక్షన్ 133ని మినహాయించారు. అందుకు విస్పష్టమైన కారణం చెప్పలేదు.

కానీ.. 1863 - 1870 మధ్య సవాలుగా మారిన వహాబీ కార్యకలాపాలను అణచివేయటానికి.. ముసాయిదాలో సెక్షన్ 133గా ఉన్న దేశద్రోహం నిబంధనను 1870లో ఐపీసీలో సెక్షన్ 124-ఏ గా చేర్చారు.

బాలగంగాధర తిలక్ మీద దేశద్రోహం కేసు...

భారతదేశానికి బ్రిటిష్ వలస పాలన నుంచి స్వాతంత్ర్యం డిమాండ్ చేస్తూ 19వ శతాబద్దం, 20వ శతాబ్దం ఆరంభంలో ఉద్యమించిన భారత రాజకీయ నాయకుల మీద ప్రధానంగా ఈ చట్టాన్ని ప్రయోగించారు.

1897లో బాలగంగాధర తిలక్‌ మీద ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ కేసు విచారణ సందర్భంగా ఈ దేశద్రోహం సెక్షన్‌ను నాటి బ్రిటిష్ న్యాయస్థానం నిర్వచించింది. తిలక్ ఆ తర్వాత మరో రెండు సార్లు ఇదే సెక్షన్ కింద అరెస్టయ్యారు. మొత్తంగా ఏడేళ్లు జైలు జీవితం గడిపారు.

మహాత్మా గాంధీ మీద కేసు పెట్టినపుడు...

1922లో మహాత్మాగాంధీని కూడా ఈ దేశద్రోహం చట్టం కింద అరెస్ట్ చేశారు. యంగ్ ఇండియా పత్రికలో ఆయన రాసిన వ్యాసాలకు గాను ఈ కేసు నమోదు చేశారు.

ఆ సందర్భంగా ''పౌరుడి స్వేచ్ఛను అణచివేయటానికి రూపొందించిన చట్టం ఇది'' అని మహాత్మాగాంధీ అన్న మాట చాలా ప్రసిద్ధి చెందింది.

''మాటలు హింసను ప్రేరేపించేవిగా ఉంటేనే...’’

1941లో నాటి ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా ఒక కేసు విచారణ సందర్భంగా దేశద్రోహం సెక్షన్‌ను నిర్వచించింది. నాటి బెంగాల్ శాసనసభ సభ్యుడైన నిహారేందు దత్ మజుందార్ బెంగాల్ గవర్నర్, మంత్రిత్వ విభాగాన్ని విమర్శిస్తూ హింసాత్మక ప్రసంగం చేశారన్న ఆరోపణ మీద కోర్టు విచారించింది.

అయితే.. ఆ మాటలు దేశద్రోహం కిందకు రావాలంటే.. ''ఆ చర్యలు లేదా మాటలు.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలంటూ ప్రేరేపించి ఉండాలి లేదంటే అలా హింసను ప్రేరేపించటం వారి ఉద్దేశమని తార్కిక బుద్ధిగల వారికి అవగతమైనా కావాలి'' అని పేర్కొంది.

భారత రాజ్యాంగ సభలో చర్చ

'దేశద్రోహం’ మీద రాజ్యాంగ సభలో చర్చ

1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం.. వాక్‌స్వాతంత్ర్యం - భావప్రకటనా స్వేచ్ఛ హక్కుకు 'దేశద్రోహం' అనే పదం అవరోధం కారాదనే అంశం మీద విస్తృతంగానే చర్చించింది. చివరికి రాజ్యాంగంలో దేశద్రోహం అనే పదాన్ని తొలగించారు. అయితే.. ఐపీసీలో 124-ఏ సెక్షన్ అలాగే కొనసాగింది.

స్వాతంత్ర్యానంతరం కొన్ని దశాబ్దాల పాటు.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు చేసిన వారి మీద, ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆరోపించిన వారి మీద కూడా ఈ చట్టాన్ని ప్రయోగించారు.

జవహర్‌లాల్ నెహ్రూ

ఆనాడు నెహ్రూ ఏమన్నారంటే...

అయితే.. ఐపీసీ సెక్షన్ 124-ఏ రాజ్యాంగ విరుద్ధమని పంజాబ్ హైకోర్టు 1950 నవంబర్‌లో తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో 1951లో రాజ్యాంగానికి తొలి సవరణ చేస్తూ.. వాక్ స్వాతంత్ర్య హక్కుకు మినహాయింపుగా 'శాంతి భద్రతలు' అనే అంశాన్ని చేర్చారు.

ఈ సెక్షన్ ''అత్యంత అనుచితమైనది, గర్హనీయమైనది.. ఎటువంటి చట్టంలోనూ దీనికి తావుండరాదు. దీనిని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది'' అని 1951లో నాటి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌నెహ్రూ పార్లమెంటులో ప్రసంగిస్తూ అభివర్ణించారు.

దేశద్రోహ చట్టం

కేదార్‌నాథ్ కేసులో రాజ్యాంగ ధర్మాసనం ఏం చెప్పింది?

వాక్ స్వాతంత్ర్య హక్కుకు పరిమితిని విధించే ఈ సెక్షన్‌ సరైనదేనని 1962లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కేదార్‌నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో సమర్థించింది. అయితే.. అదే సమయంలో ఈ సెక్షన్‌ను వర్తింప చేయటానికి 1941లో నాటి ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా అభిప్రాయాన్ని ఆమోదించింది. ఈ సెక్షన్‌ను వర్తింపచేయాలంటే.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించటం లేదా హింసకు ప్రేరేపించే ఉద్దేశం ఉండటం ఒక ఆవశ్యకతగా చేర్చింది.

కేదార్‌నాథ్ తన ప్రసంగంలో ''విప్లవాగ్నిలో పెట్టుబడిదారులు, జమీందార్లు, దేశాన్ని లూటీ చేయటమే పనిగా పెట్టుకున్న భారత కాంగ్రెస్ నాయకులు బూడిదవుతారు'' అనే మాటల ద్వారా ప్రభుత్వాన్ని హింసాయుత మార్గంలో కూలదోసే ఆలోచనను ప్రేరేపించారు కనుక ఆయనను దేశద్రోహం ఆరోపణలో దోషిగా నిర్ధారించింది.

దేశద్రోహ చట్టం

బల్వంత్‌సింగ్ కేసులో సుప్రీంకోర్టు చెప్పిందిదీ...

అనంతర కాలంలో.. నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్యకు గురైన రోజున 'ఖలిస్తాన్ జిందాబాద్' అంటూ జనసమ్మర్థంలో నినాదాలు చేశారంటూ బల్వంత్‌సింగ్ తదితరుల మీద దేశద్రోహం కేసు నమోదైంది. ఈ కేసులో నిందితులను దోషులగా కింది కోర్టు నిర్ధారించింది.

అయితే.. 1995లో సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ.. ప్రజల నుంచి ఎటువంటి స్పందన లేదా ప్రతిస్పందనను ప్రేరేపించని కొన్ని నినాదాలను ఇద్దరు వ్యక్తులు పలుమార్లు చేయటం దేశద్రోహం కిందకు రాదని, అలా రావాలంటే మరింత తీవ్రమైన చర్యలు అవసరమని, ఈ నినాదాల వల్ల నిజంగా శాంతిభద్రతల సమస్య తలెత్తలేదని పేర్కొంటూ వారిని నిర్దోషులుగా విడుదల చేసింది.

సుప్రీంకోర్టు

కామన్‌కాజ్ పిల్ మీద సుప్రీంకోర్టు స్పందన...

కామన్ కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ.. సెక్షన్ 124-ఏ కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు లేదా ఎవరినైనా అరెస్టు చేసే ముందు.. కేదార్‌నాథ్ కేసులో సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని రూఢిచేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ లేదా డీజీపీ నిర్ధారించేలా మార్గదర్శకాలు జారీచేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో 2016లో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది.

ఆ పిల్‌ను పరిష్కరిస్తూ సుప్రీంకోర్టు.. కేదార్‌నాథ్ కేసులో నిర్దేశించిన విధివిధానాలు అధికారులకు మార్గదర్శకత్వంగా ఉండాలని ఉద్ఘాటించింది.

బ్రిటన్

బ్రిటన్‌లో దేశద్రోహం చట్టం రద్దు...

భారతదేశంలో దేశద్రోహం చట్టాన్ని ప్రవేశపెట్టింది బ్రిటిష్ వలస ప్రభుత్వం. అయితే.. బ్రిటన్‌లో దేశద్రోహం చట్టాన్ని 2009లో రద్దు చేశారు. నిజానికి బ్రిటన్‌లో ఆ చట్టాన్ని రద్దు చేయాలంటూ 1977లోనే ఆ దేశ న్యాయ కమిషన్ సిఫారసు చేసింది.

ఆ చట్టాన్ని రద్దు చేసినపుడు నాటి బ్రిటన్ న్యాయశాఖ సహాయమంత్రి మాట్లాడుతూ ''వాక్ స్వాతంత్ర్య హక్కును నేటి తరహాలో ప్రాధమిక హక్కుగా పరిగణించని కాలంలో.. గతించిన శకానికి చెందిన చట్టం దేశద్రోహ చట్టం’’ అని వ్యాఖ్యానించారు.

''నేడు ప్రజాస్వామ్యానికి ఒక గీటురాయిలా వాక్‌స్వాతంత్ర్యాన్ని పరిగణిస్తున్నాం. రాజ్యాన్ని విమర్శించటానికి వ్యక్తులకు అవకాశం ఉండటం స్వాతంత్ర్యానికి చాలా కీలకం’’ అని పేర్కొన్నారు.

''ఈ కాలం చెల్లిన చట్టాలు ఈ దేశంలో (బ్రిటన్‌లో) ఇంకా కొనసాగుతుండటాన్ని.. ఇతర దేశాలు రాజకీయ అసమ్మతిని, పత్రికా స్వేచ్ఛను క్రియాశీలంగా అణచివేయటానికి ఉపయోగిస్తున్న ఇదే తరహా చట్టాలను కొనసాగించటాన్ని సమర్ధించుకోవటానికి వాడుకుంటున్నాయి’’ అని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
What does British law say? What are the Supreme Court guidelines
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X