హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోదీ తీసుకొస్తున్న ‘బలవర్ధక బియ్యం’ ఏంటి? హైదరాబాద్‌లో తయారైన ఈ అన్నం తింటే దేశ ప్రజల ఆరోగ్యం మెరుగవుతుందా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
భారతదేశంలో 65 శాతం మంది జనాభాకు వరిఅన్నం ప్రధాన ఆహారం

శ్యామలకు 45 సంవత్సరాలు. ఆమె చాలా చలాకీగా, ఉత్సాహంగా ఉండేవారు.

కానీ, ఈ మధ్య ఎప్పుడు చూసినా అలసటగా, నీరసంగా, అనారోగ్యం పాలైనట్లు ఉంటున్నారు.

ఆమె ఈ ఏడాది మార్చిలో కోవిడ్ బారిన పడ్డారు. కానీ, కోవిడ్ ఇన్ఫెక్షన్ తగ్గి 5 నెలలు కావస్తున్నా కూడా అలసట తగ్గటం లేదని చెప్పారు.

"పొద్దున్న లేచిన దగ్గర నుంచీ అలసట గానే ఉంటోంది. ఇంట్లో 10 మందికి వంట చేసే నేను ప్రస్తుతం ఒక్క పూట వంట చేయాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటోంది".

"చాలా వరకూ భోజనం కోసం స్విగ్గీ , జొమాటోల పైనే ఆధారపడిపోతున్నాను. మానసికంగా, శారీరకంగా చాలా అలసట ఉంటోంది. ఏ పనీ చేయలేకపోతున్నాను" అని చెప్పారు.

ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం చుట్టుముడుతోందని, రోగ నిరోధకత బాగా తగ్గినట్లు అనిపిస్తోందని అన్నారు.

"ఇంట్లో వాడే ఆహార పదార్ధాల కంటే కూడా ఔషధాలు పెరిగిపోయాయి" అని అన్నారు.

ఇదంతా, సాధారణంగా 40 సంవత్సరాల తర్వాత మహిళలకు జింక్, ఇనుము లోపం వల్ల రక్తహీనతతో ఎదురయ్యే సమస్య అని మార్కాపురంకి చెందిన డైటీషియన్ డాక్టర్ విజయలక్ష్మి చెబుతున్నారు.

జనాభాలో 50 శాతం మంది అవసరమైన దాని కంటే కూడా తక్కువ స్థాయిలోనే ఐరన్ జింక్, విటమిన్ ఏ, ఫోలేట్, ఇతర బి విటమిన్లు తీసుకుంటారని నేషనల్ న్యూట్రిషన్ మానిటరింగ్ రిపోర్ట్ చెబుతోంది.

రక్తహీనత కారణంగా ప్రతీ ఏటా స్థూల జాతీయ ఉత్పత్తిలో 1శాతం (రూ.1.35 లక్షల కోట్లు) కోల్పోతున్నట్లు అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ తెలిపింది.

బయో ఫోర్టిఫైడ్ రైస్, మోదీ

దీనికి పరిష్కారం ఏంటి?

భారతదేశంలో 65 శాతం మంది జనాభాకు వరిఅన్నం ప్రధాన ఆహారం. వరి అన్నం ఎక్కువగా తినే దేశాల్లో ఉన్న పోషకాహార లోపాన్ని నివారించడానికి రైస్ ఫోర్టిఫికేషన్ (బియ్యాన్ని బలవర్ధకంగా) చేయడమే సాంస్కృతికంగా అనువైన వ్యూహం అని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంటోంది.

ఈ దిశగా, భారతదేశంలో పోషకాహార లోపాన్ని నిర్మూలించడానికి 2024కల్లా ప్రజా పంపిణీ వ్యవస్థ, మధ్యాహ్న భోజన పథకాల ద్వారా ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సరఫరా చేస్తామని ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటించారు.

ఇప్పటికే దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఫోర్టిఫైడ్ రైస్ (బలవర్ధక బియ్యం) సరఫరా చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.

ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏంటి?

సాధారణ ప్రక్రియలో బియ్యాన్ని పాలిష్ చేసినప్పుడు అందులో సహజంగా ఉండే ఖనిజాలు, పోషకాలు పోతాయి. బియ్యంలో పోషక విలువను పెంచేందుకు అవసరమైన , ఖనిజాలు, లవణాలను జత చేయడాన్ని ఫోర్టిఫికేషన్ అంటారు.

ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పోషకాహార లోపాన్ని నివారించడానికి బియ్యంతో పాటు ఇతర పప్పు ధాన్యాలకు ఖనిజాలు, లవణాలను జత చేయడాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) ఒక వ్యూహంగా గుర్తించాయి.

"బియ్యాన్ని పిండి చేసి అందులో ఫుడ్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్ ఎస్ ఎస్ ఏ ఐ) ఆమోదించిన మోతాదులో విటమిన్లు, ఖనిజాలను ఆ పిండికి కలిపి తిరిగి బియ్యపు గింజలుగా తయారు చేస్తారు. వీటినే బలవర్ధకపు బియ్యపు గింజలు అని అంటారు" అని న్యూ యార్క్ కి చెందిన బయోమెడికల్ శాస్త్రవేత్త శ్రీనివాసరావు కలశపూడి అన్నారు. ఆయన గ్రనోవా నేచురల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు.

హైదరాబాద్‌లోనే పరిశోధన..

అయితే, భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి మాత్రం సాధారణ బియ్యాన్ని పండించినట్లే పోషకాలను వృద్ధి చేసిన బియ్యం (బయోఫోర్టిఫైడ్ రైస్) పండించేందుకు గాను పరిశోధనలు చేసి వరిలో పలు రకాలను విడుదల చేసింది.

ఇందులో డీడీఆర్ ధన్ 45 అనే రకం వరిని హైదరాబాద్‌లోని ఐసీఏఆర్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చిలో తయారు చేసింది.

ఇది 135 రోజుల్లో పండుతుంది. ఖరీఫ్ కాలానికి అనుకూలం. హెక్టారుకు 50 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. బియ్యాన్ని పాలిష్ చేసినా కూడా ఇందులో జింక్ అధికంగా ఉంటుందని ఐసీఏఆర్ పేర్కొంది.

డీడీఆర్ ధన్ 45 వరి రకాన్ని కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పండించొచ్చునని పేర్కొంది.

భారతదేశంలో రక్తహీనతతో బాధపడుతున్న 60 శాతం మంది స్కూలు పిల్లలు ఉన్నారని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ పేర్కొంది.

పోషకాహార లోపం వల్ల మహిళల్లో వచ్చే సమస్యలేంటి?

భారతదేశంలో రక్తహీనతతో బాధపడుతున్న 60 శాతం మంది స్కూలు పిల్లలు, 50 శాతం మంది గర్భిణులు ఉన్నారని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రపంచంలో సగం రక్త హీనత కేసులు ఐరన్ లోపం వల్ల జరిగేవని, దీని వల్ల పిల్లల్లో 8 పాయింట్లు ఇంటెలిజెన్స్ కోషియెంట్ (ఐక్యూ) స్థాయిలు తగ్గుతాయని పేర్కొంది.

"పోషకాహార లోపం వల్ల మహిళల్లో రక్తహీనత, అలసట, క్రామ్ప్స్ వస్తాయి. కాళ్ళు వంకర పోవడం, పొద్దున్న లేచే సరికి విపరీతమైన కాళ్ళ నొప్పులు రావడం లాంటివి కనిపిస్తూ ఉంటాయి" అని డాక్టర్ విజయలక్ష్మి చెప్పారు.

ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లతో పాటు, జింక్, మెగ్నీషియం కూడా అవసరం అని, తరచుగా తినే ఆహారానికి ఖనిజాలు, విటమిన్లు, లవణాలను జత చేయడం వల్ల ఆరోగ్యానికి మేలే జరుగుతుందని ఆమె అన్నారు.

"బలవర్ధక ఆహారం తినడం వల్ల కంటి చూపు మెరుగవ్వడంతో పాటు ఊపిరితిత్తుల సామర్ధ్యం కూడా మెరుగవుతుంది" అని చెప్పారు.

తగిన సూక్ష్మ పోషకాలు తీసుకోవడం వల్ల స్త్రీలలో మెనోపాజ్ లో ఎదురయ్యే యోని పొడిబారడం లాంటి సమస్యలు తగ్గడంతో పాటు చర్మ ఆరోగ్యం మెరుగవుతుందని అన్నారు.

"బియ్యం పదే పదే కడగడం మాని, అందులో పోషకాలు బయటకి పోకుండా వండుకోవడం లేదా గంజి తాగాలి. ఇంట్లో పండించే కూరగాయలు తినడం మంచిదని సూచించారు.

భారతదేశంలో 65 శాతం మంది జనాభాకు వరిఅన్నం ప్రధాన ఆహారం

"బలవర్ధక బియ్యానికి ప్రాధాన్యత"

కంటి చూపు లోపాలు, రక్త హీనత, అలసట, కిడ్నీ సమస్యలతో తమ దగ్గరకు రోగులు వస్తూ ఉంటారని, వీటికి ముఖ్యంగా ఇనుము, జింక్, విటమిన్ల లోపమే కారణమని గజపతినగరానికి చెందిన డాక్టర్ బిఎస్ ఆర్ మూర్తి చెప్పారు. ఆయన విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఫోర్టిఫైడ్ రైస్, కినోవా ఉత్పత్తికి సంబంధించి రైతులకు, ఉత్పత్తి సంస్థలకు సలహాదారుగా ఉన్నారు.

"బలవర్ధక బియ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి" అని జాతీయ పౌష్టిక ఆహార సంస్థ డైరెక్టర్ డాక్టర్ లోన్గవా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

"తమ దగ్గరకు వచ్చే రోగులందరూ ఐరన్, జింక్, కాల్షియం, బి కాంప్లెక్స్ మందులు కొనుక్కునే స్తోమత కలిగి ఉండరని, అలాంటి వారికి ఫోర్టిఫైడ్ బియ్యం తినమని సూచిస్తున్నట్లు వివరించారు. రోజూ వండే అన్నంలో సూచించిన మోతాదులో పోషకాలు కలిపిన బియ్యాన్ని జత చేసి తినడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లు ఫలితాలు కనిపిస్తున్నాయని చెప్పారు.

ఆహారంలో విటమిన్లు, ఖనిజాలు, లవణాలతో కూడిన పోషకాలను చేర్చిడం ద్వారా రక్తహీనత తగ్గి, అలసట, మానసిక శారీరక ఒత్తిడి తగ్గుతాయని చెప్పారు.

ప్రతీ కేజీ ఫోర్టిఫైడ్ బియ్యానికి 28 మిల్లీగ్రాముల ఇనుము, 75-125 మిల్లీగ్రాముల ఫోలిక్ యాసిడ్, 0.75 - 1.25 మిల్లీగ్రాముల విటమిన్ బి 12 ఉండాలని ఎఫ్ ఎస్ ఏ ప్రమాణాలు సూచిస్తున్నాయి.

వ్యవసాయం

''లాభాలన్నీ కార్పొరేట్లకే..’’

అయితే, మొత్తం ఆహారంలో తగినన్ని సూక్ష్మ పోషకాలు ఉన్నాయా లేదో చూడాలి కానీ, కేవలం బియ్యాన్ని బలవర్థకం చేయడం వల్ల పోషకాలు అందించడం మీద మాత్రమే దృష్టి పెట్టకూడదని, సహజ ఆహార ఉత్పత్తిదారుల సంఘ వ్యవస్థాపకులు రామాంజనేయులు అన్నారు.

"పొద్దున్న తినే అల్పాహారం నుంచీ, రాత్రి భోజనం వరకూ తినే ఆహారంలో ఉన్న పోషకాలను చూడాలి" అని ఆయన అన్నారు. ఉదాహరణకు పప్పులో ఆకుకూరలు లాంటి వాటిని జత చేయడం లాంటివి.

ప్రస్తుతం ప్రభుత్వం కృత్రిమంగా బియ్యానికి పోషకాలను జత చేయాలని చేస్తోంది. అందరికీ పోషకాహారం అందుబాటులోకి వచ్చేటట్లు చూడాలి కానీ, కేవలం కొన్ని ఆహార పదార్ధాల్లో పోషకాలు కలపడం వల్ల ఎంత వరకు ప్రయోజనం ఉంటుందనే సందేహాన్ని రామాంజనేయులు వ్యక్తం చేశారు.

పోషకాల లోపంతో బాధపడుతున్నవారు తప్పనిసరిగా ఇలాంటి ఫోర్టిఫైడ్ ఆహారం తీసుకోవచ్చు కానీ, దీనిని తప్పని సరి చేయడం ఎందుకని ప్రశ్నించారు.

"రైతు పండించే బియ్యాన్ని తప్పనిసరిగా ఖనిజ, లవణాలతో జత చేయాలని నిబంధన విధిస్తే మాత్రం మార్కెట్లో ఉన్న చిన్న స్థాయి రైతులు, వ్యాపారులు దెబ్బ తింటారని ఆయన అన్నారు. ఆహార పదార్ధాలకు ఖనిజ లవణాలను జత చేసే సాంకేతికత పేటెంట్ తో కూడిన టెక్నాలజీ అని దానిని భరించే స్థోమత అందరికీ ఉండకపోవచ్చు. దాంతో, చిన్న రైతులు, స్థానిక మార్కెట్ల మీద ప్రతికూల ప్రభావం ఏర్పడే అవకాశం ఉండవచ్చు" అని అన్నారు.

"ఈ మొత్తం వ్యవహారంలో రైతు దగ్గర తగిన సాంకేతిక లేక, చిన్న సంస్థలు వీటిని ప్రాసెస్ చేయలేక, చివరకు కార్పొరేట్ సంస్థలే మార్కెట్ ను ఆక్రమిస్తాయి. పోషకాలను జత చేసే సాంకేతికత చాలా తక్కువ సంస్థల దగ్గరే ఉంటుంది " అని అన్నారు.

ఇందుకు ఉదాహరణగా 1998లో దిల్లీలో సంభవించిన డ్రాప్సీ మహమ్మారికి లోనయి 3000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఘటనను చెప్పారు. "ఈ మహమ్మారికి విడిగా అమ్మే వంట నూనె కారణమని చెప్పడంతో, ప్రభుత్వం ప్రాసెస్ చేయని వంట నూనెను అమ్మడాన్ని నిషేధించింది. దాంతో, చిన్న చిన్న నూనె వ్యాపారులు తమ వ్యాపారాన్ని కోల్పోయారు" అని చెప్పారు.

ఉప్పులో ఐయోడిన్ జత చేయడాన్ని తప్పనిసరిగా చేసిన తర్వాత చిన్న చిన్న ఉప్పు తయారీ సంస్థలన్నీ కనిపించకుండా పోయాయి అని గుర్తు చేశారు.

రక్తహీనత, ఇనుము, విటమిన్ల లోపానికి ఉన్న మూల కారణానికి పరిష్కారం ఆలోచించకుండా , కృత్రిమవిధానాలను తప్పని సరి చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.

"సంపూర్ణ ఆహారం (డైటరీ ఎంజైముల) ద్వారా పోషకాలు అందించడానికి చూడాలని సూచించారు. బియ్యాన్ని పాలిష్ చేసి తినడం వల్ల వచ్చే సమస్యను అధిగమించడానికి మరొక దారుణమైన విధానాన్ని అవలంబించడం సరైనది కాదు" అని అన్నారు.

పోషకాహార లోపానికి ఆర్ధిక పరిస్థితులు కారణం కానీ, బలవర్ధకమైన బియ్యం కాదని అన్నారు. ప్రజల ఆర్ధిక పరిస్థితులను మెరుగుపర్చేందుకు దృష్టి పెట్టాలి కానీ, కేవలం ఫోర్టిఫైడ్ ఆహార పదార్ధాల ద్వారా పోషకాహార లోపాన్ని జయించడం వీలయ్యే పని కాదని అన్నారు.

వరి పొలంలో మహిళ

''రైతుకు లాభమే..’’

దేశ జనాభాలో సుమారు 65శాతం మంది ప్రధానంగా వరి అన్నాన్ని తింటారు. కానీ, వీటిని పాలిష్ చేసే క్రమంలో బియ్యంలో సహజంగా ఉండే విటమిన్ బి 1, బి 6, విటమిన్ ఇ, నియాసిస్ తొలగిపోతాయి. ఈ ప్రక్రియలో కోల్పోయిన పోషకాలతో పాటు మరి కొన్ని పోషకాలను కలపడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుందని శ్రీనివాసరావు చెప్పారు.

ఈ విధానం అవలంబించడం ద్వారా ఆరోగ్యానికి జరిగేది మేలే కానీ, రైతుకు ఎటువంటి నష్టమూ ఉండదని, తాము ఇప్పటికే భారతదేశంలోని స్థానిక రైతులతో కినోవా లాంటి పంటలను పండించి తక్కువ ధరకే అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు డాక్టర్ శ్రీనివాసరావు చెప్పారు.

డాక్టర్ రైస్ పేరుతో 100 శాతం ఫోర్టిఫైడ్ రైస్ ఉత్పత్తి చేస్తున్నామని, ఒక్కొక్క భోజనం ఖరీదు 25 - 35 పైసలు మాత్రమే అవుతుందని చెప్పారు. భారతదేశంలోప్రజల ఆహార వినియోగానికి ఒక మిలియన్ టన్నుల ఫోర్టిఫైడ్ బియ్యం సరిపోతాయని చెప్పారు. రైతులు ఈ బియ్యాన్ని ప్రత్యేకంగా పండించాల్సిన పని లేదని, 99 శాతం రైతు పండించిన బియ్యాన్నే ప్రజలు తింటారని చెప్పారు.

భారతదేశంలో పైలట్ ప్రాజెక్టు ద్వారా ప్రత్యేకంగా గుర్తించిన 112 జిల్లాలకు 130 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారాన్ని సరఫరా చేస్తారు. ఇందుకు, 174.6 కోట్ల బడ్జెట్ కేటాయించారు. వీటిని ప్రజా పంపిణీ వ్యవస్థ, ఐసిడిఎస్ (ఇంటెగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీం) ద్వారా సరఫరా చేస్తారు.

అయితే, వీటిని కేవలం ప్రజా పంపిణీ వ్యవస్థ, మధ్యాహ్న భోజన పథకం ద్వారా మాత్రమే కాకుండా ప్రతీ ఒక్కరికీ అందేలా చేయాలని శ్రీనివాసరావు సూచించారు.

కానీ, వీటిని దేశవ్యాప్తంగా సరఫరా చేయాలంటే, వీటి ఉత్పత్తిని 350 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాల్సి ఉంటుంది.

ఇప్పటికే దేశంలో పాలు, గోధుమ, ఉప్పు లాంటి వాటిని అదనపు పోషక విలువలను జత చేయడం మొదలయింది.

వరి, గోధుమ, జొన్న లాంటి ధాన్యాలను ఫోర్టిఫై చేయడం ఇప్పటికే 86 దేశాల్లో మొదలయింది.

కోస్టారికా, నికరాగ్వా, పనామా, పాపువా న్యూ గినియా, ఫిలిప్పీన్స్ దేశాల్లో ఫోర్టిఫైడ్ రైస్ వాడకాన్ని చట్టబద్ధంగా తప్పనిసరి. బ్రెజిల్, డొమినికన్ రిపబ్లిక్, కొలంబియా, దక్షిణ ఆఫ్రికా, అమెరికాలో స్వచ్చందంగా ఫోర్టిఫైడ్ రైస్ తయారీని చేపడుతున్నట్లు డాక్టర్ శ్రీనివాసరావు కలశపూడి తెలిపారు.

భారతదేశం కూడా ఈ దిశగా ముందడుగు వేయడం పోషకాహార లోపాన్ని అధిగమించడంలో సహాయపడుతుందని అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
What is the 'fortifying rice' that Modi is bringing
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X