వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పస్మాంద ముస్లింలు ఎవరు, ప్రధాని మోది వారి గురించి ఎందుకు ప్రస్తావించారు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

పస్మాంద ముస్లింలు అనేది కొత్త పదం కాదు. కానీ ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ ఒక సమావేశంలో వీరి గురించి ప్రస్తావించేసరికి, పస్మాంద ముస్లింలు ఎవరు, వారి సంస్కృతిక, సామాజిక నేపథ్యం ఏమిటన్న ఆసక్తి బయలుదేరింది.

గత వారం బీజేపీ కార్యవర్గ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ముగింపు రోజు మోదీ మాట్లాడుతూ, "ఓట్ల గురించి చింతించకుండా" సహానుభూతితో సమాజంలోని అన్ని వర్గాలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా బోహ్రాలు, పస్మాంద ముస్లింలు సహా మరికొన్ని వర్గాల పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించారు.

దాంతో, పస్మాంద ముస్లింలు ఎవరన్న ఆసక్తి నెలకొంది.

పస్మాంద అనేది పర్షియన్ పదం. దీనికి అర్థం 'వెనుకబడిన వారు' అని.

సమాజంలోని ఇతర వర్గాలతో పోలిస్తే, పురోగతిలో వీరు వెనుకబడి ఉన్నారని అర్థం. వీరి వెనుకబాటుతనానికి ఒక పెద్ద కారణం కుల వ్యవస్థ అని చెబుతారు.

మొదట్లో పస్మాంద అని ఒక వర్గాన్ని మాత్రమే పిలిచేవారు. కానీ, సంవత్సరాలు గడిచేకొద్దీ ముస్లింలలో వెనుకబడిన కులాలు, షెడ్యూల్డ్ కులాలు, తెగల వారందరినీ ఈ పేరుతోనే పిలవడం ప్రారంభించారు.

రాజ్యసభ మాజీ ఎంపీ, పాత్రికేయుడు అలీ అన్వర్ అన్సారీ బీబీసీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, "బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత మతం చుట్టూ తిరుగుతున్న రాజకీయాలతో తాను విసిగిపోయానని, ముస్లింలలో వర్గ ఆధారిత గుర్తింపును తీసుకొచ్చి మత రాజకీయాలను సవాలు చేయాలని" అన్నారు.

అలీ ఈ అంశంపై క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసి 1990లలో 'ముసావత్ కీ జంగ్' (సరిసమానుల మధ్య యుద్ధం) అనే పుస్తకం రాశారు.

పస్మాంద ముస్లింలు

భారతీయ ముస్లింలలో ప్రబలంగా కుల వ్యవస్థ

ముస్లింలలో ఒక వర్గం కుల వివక్షను, అసమానతలను ఖండిస్తోంది.

"ఇస్లాం సమానత్వాన్ని చాటి చెబుతుంది. కానీ, ముస్లింలలో కూడా కుల వ్యవస్థ చాలా బలంగా ఉందన్నది నిజం" అని వారు అంగీకరిస్తారు.

అయితే, ఇందులో రెండు విషయాలు ఉన్నాయి. ముస్లిం సమాజంలోని కుల వ్యవస్థను హిందూ సమాజంతో పోల్చి చూడకూడదని సిల్వియా వటుక్ వంటి సామాజికవేత్తలు అంటారు.

హిందువులలో కుల వ్యవస్థ పనిచేస్తున్నట్టు ముస్లింలలో ఉండదని వారంటారు.

రెండవది, ముస్లింలలో ఈ కుల వ్యవస్థ దక్షిణాసియాలోని ముస్లింలకు మాత్రమే పరిమితం.

దీనికి ప్రధాన కారణం ఇతర మతాల వారు ముస్లింలుగా మారినప్పుడు (అధికంగా హిందువులు) తమ పాత మతంలోని ఆచారాలు, సంప్రదాయలను తమతో పాటు ఇస్లాంలోకి తీసుకొచ్చారని, వాటిలో కులతత్వం ఒకటి అని విశ్లేషకులు అంటున్నారు.

పస్మాంద పదం వాడుకలోకి రాకముందు...

బ్రిటిష్ పాలన వల్లే ముస్లింలలో కులం సమస్య తలెత్తిందని మరికొందరు వాదిస్తారు. బ్రిటిషర్లు ప్రభుత్వంలో పనిచేస్తున్న ముస్లింల సహకారంతో కులం అంతరాలను రెచ్చగొట్టారని, తద్వారా సమాజాన్ని విభజించే ప్రణాళిక రచించారన్నది వారి వాదన.

హిందువులలో కూడా కుల వ్యవస్థ పెచ్చుమీరడానికి ఇదే కారణమని కొందరు వాదిస్తారు.

పూర్వం భారతీయ ముస్లింలలో కులాన్ని సూచించడానికి అష్రాఫ్, అజ్లాఫ్, అర్జాల్ వంటి పదాలు వాడేవారు.

"అష్రాఫ్ అంటే ఉన్నత తరగతి. అంటే అరబ్, ఇరాన్, అఫ్గానిస్తాన్ వారసత్వం ఉన్నవారు. ఉన్నత కులానికి చెందిన హిందువులు ఇస్లాంను స్వీకరించిన తరువాత అష్రాఫ్ వర్గానికి చెందుతారు" అని సుప్రసిద్ధ సామాజిక శాస్త్రవేత్త ఇంతియాజ్ అహ్మద్ వివరించారు.

అంటే అష్రాఫ్ వర్గం హిందువులలో సవర్ణుల లాగ ముస్లింలలో ఉన్నతవర్గం అన్నమాట. వీరిలో సయ్యద్, షేక్, మొఘల్, పఠాన్, ముస్లిం రాజ్‌పుత్, తాగా లేదా త్యాగి ముస్లిం, చౌదరి ముస్లిం, గ్రాహే లేదా గౌర్ ముస్లింలు ఉంటారు.

హిందువుల్లో దిగువ కులాలవారు ఇస్లాంలోకి మారితే వారిని అజ్లాఫ్ వర్గం అంటారు. ఇందులో చాకలివారు, టైలర్లు, క్షురకులు, నేత కార్మికులు లేదా జులాహే, తేలీ, భిస్తీలు, రంగులు వేసేవారు ఉంటారు.

అజ్లాఫ్ ముస్లింలలో అన్సారీ, మన్సూరి, కసాగర్, రైనే, గుజర్, బంకర్, గుర్జర్, ఘోసీ, ఖురేషి, ఇద్రిసీ, నాయక్, ఫకీర్, సైఫీ, అల్వీ, సల్మానీ వంటి ఇంటిపేర్లు ఉంటాయి.

అర్జాల్ వర్గం అంటే ఇస్లాం స్వీకరించిన దళితులు.

పస్మాంద

పస్మాంద ముస్లింల జనాభా

మొత్తం ముస్లిం జనాభాలో పస్మాంద ముస్లింలు ఎంతమంది అన్నదానిపై డేటా లేదు. కానీ, 1931 జనాభా లెక్కల ఆధారంగా, అంటే చివరిసారిగా కులాల ఆధారంగా జనాభా లెక్కలు సేకరించినప్పుడు, పస్మాందా ముస్లిలు 80-85 శాతం వరకు ఉంటారని ఆ వర్గం వారు చెబుతున్నారు.

విభజన సమయంలో దేశం నుంచి పారిపోయినవారిలో అష్రాఫ్ ముస్లింలు ఎక్కువని, అలా చూస్తే ముస్లింలలో వెనుకబడిన వర్గాల వారి సంఖ్య అధికంగా ఉండే అవకాశం ఉందని అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్శిటీలో సోషియాలజీ ప్రొఫెసర్ ఖలీద్ అనిస్ అన్సారీ అన్నారు.

బ్రిటిష్ పాలనకు ముందు, ముస్లిం రాజుల హయాంలో అష్రాఫ్ వర్గానికే ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఉండేదని, వారికే భూములు కూడా ఎక్కువగా ఉండేవని తెలిపారు.

మండల్ కమిషన్ కనీసం 82 సామాజిక వర్గాలను గుర్తించింది. వీరిని వెనుకబడిన ముస్లింలుగా వర్గీకరించింది.

నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ (ఎన్ఎస్ఎస్‌ఓ) లెక్కల ప్రకారం, ముస్లింలలో 40.7 శాతం ఓబీసీలు ఉన్నారు. ఇది దేశంలోని వెనుకబడిన వర్గాల మొత్తం సంఖ్యలో 15.7 శాతం.

అయితే, ఈ వర్గాలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్రయోజనాలు అందడం లేదని, హిందువుల్లో దళితులకు రిజర్వేషన్లు ఉన్నాయి కానీ, ముస్లింలకు అలాంటిదేమీ లేదని సచార్ కమిషన్ పేర్కొంది.

పస్మాంద ముస్లిం సమాజంలో మహాజ్ అనే సంస్థ ఉంది. ఎస్సీ-ఎస్టీ తరహాలో దళిత ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని ఈ సంస్థ డిమాండ్ చేస్తోంది.

ఆల్ ఇండియా బ్యాక్‌వర్డ్ ముస్లిం మోర్చా, పస్మాంద ఫ్రంట్, పస్మాంద సమాజ్ మొదలైన సంస్థలు పస్మాంద సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తూ వారికోసం పనిచేస్తున్నాయి.

పస్మాంద ఉద్యమం కొత్తది కాదు. స్వతంత్రం రాక ముందు నుంచీ వారి గొంతులు వినిపిస్తున్నాయి. కానీ, వారి పరిస్థితులలో ఏ మార్పు రాలేదని విశ్లేషకులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

English summary
Who are Pasmanda Muslims and why did PM Modi mention them?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X