వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డబ్ల్యూహెచ్ఓ: కోవిడ్, మంకీపాక్స్, యుద్ధాలతో ప్రపంచానికి సవాళ్లు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
మంకీపాక్స్

కోవిడ్ 19, యుక్రెయిన్‌ యుద్ధం, మంకీపాక్స్‌తో ప్రపంచం 'కఠినమైన’ సవాళ్లను ఎదుర్కొంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి హెచ్చరించారు.

టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ జెనీవాలో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి ఆరోగ్య సంస్థ నిపుణులు సదస్సులో ప్రసంగించారు.

ఆఫ్రికా వెలుపల 15 దేశాలలో మంకీపాక్స్ వ్యాప్తి, పరిణామాలు, చర్యల విషయం ఈ సదస్సులో చర్చిస్తున్నారు.

ఇప్పటికే యూరప్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్‌లలో 80కి పైగా మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి.

అయితే, ఇది ఇతర దేశాలకు వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువ అని కూడా చెబుతున్నారు.

మధ్య, పశ్చిమ ఆఫ్రికాలోని మారుమూల ప్రాంతాలలో సర్వసాధారణంగా కనిపించే వైరస్ ఇది. కానీ, మనుషుల మధ్య అంత త్వరగా వ్యాపించదు. అలాగే, వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుంది.

ఈ వైరస్ సోకినా, కొద్ది వారాల్లోనే కోలుకుంటారని బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ తెలిపింది.

ఇప్పుడు అకస్మాత్తుగా మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి చెందడం సైంటిస్టులను ఆశ్చర్యపరుస్తోంది. వైరస్‌తో కాంటాక్ట్ అయే రిస్క్ ఉన్నవాళ్లు మూడు వారాల పాటు ఐసొలేషన్ పాటించాలని బ్రిటన్ ఆరోగ్య అధికారులు సూచించారు.

బెల్జియం తొలిగా శుక్రవారం మంకీపాక్స్ సోకిన వారికి మూడు వారాల క్వారంటీన్ ప్రకటించింది.

సోమవారానికి బ్రిటన్‌లో మరిన్ని కేసులు బయటపడే అవకాశం ఉందని గార్డియన్ పత్రిక తెలిపింది.

మంకీ పాక్స్ వైరస్

'కోవిడ్, ఎబోలా, మంకీపాక్స్, యుద్ధాలు... ఇవన్నీ సంక్షోభాలే'

ఆదివారం వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో డాక్టర్ టెడ్రోస్ మాట్లాడుతూ, "ప్రపంచానికి కోవిడ్ ఒక్కటే సంక్షోభం కాదు. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వ్యాప్తి, మంకీపాక్స్, కారణాలు తెలీకుండా వ్యాప్తిస్తున్న హెపటైటిస్, అఫ్గానిస్తాన్, ఇథియోపియా, సోమాలియా, దక్షిణ సూడాన్, సిరియన్ అరబ్ రిపబ్లిక్, యుక్రెయిన్, యెమెన్‌లలో మానవతా సంక్షోభం.. ఇవన్నీ సవాళ్లు. వ్యాధులు, కరువు, యుద్ధాలు, వాతావరణ మార్పులు, అసమానత, భౌగోళిక రాజకీయ శత్రుత్వాలు కఠినమైన సవాళ్లుగా మారుతున్నాయి" అని అన్నారు.

అంతకు ముందు డబ్ల్యూహెచ్ఓ కొన్ని అనుమానిత మంకీపాక్స్ కేసులను పరిశీలించింది. అయితే, దేశాల పేర్లు బయటపెట్టలేదు. కానీ, మరిన్ని కొత్త కేసులు బయటపడవచ్చని హెచ్చరించింది.

తొలిసారిగా బ్రిటన్‌లో మంకీపాక్స్ వ్యాప్తి బయటపడిన తరువాత యూరప్‌లోని పలు దేశాల్లో కేసులు బయటపడ్డాయి. స్పెయిన్, పోర్చుగల్, జర్మనీ, బెల్జియం, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, ఇటలీ, స్వీడన్‌లలో కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం ఆస్ట్రేలియా, స్వీడన్‌లలో కూడా కేసులు బయటపడ్డాయి.

ఆఫ్రికాతో ఏ సంబంధం లేని ప్రాంతాల్లో కూడా మంకీపాక్స్ కేసులు బయటపడుతున్నాయని, రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతోందని బ్రిటన్ అధికారులు తెలిపారు.

అయితే, సాధారణ జనాభాకు వ్యాప్తి చెందే అవకాశం "చాలా తక్కువగా ఉందని", పట్టణ ప్రాంతాల్లో గే, బైసెక్సువల్ పురుషుల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోందని బ్రిటన్ వైద్య అధికారులు తెలిపారు.

మంకీపాక్స్‌కు ప్రత్యేకంగా వ్యాక్సీన్ లేదు. కానీ, వివిధ దేశాల్లో స్మాల్‌పాక్స్ (మశూచి) వ్యాక్సీన్లను నిల్వ చేస్తున్నారు. మంకీపాక్స్ ఇంఫెక్షన్‌ను నిరోధించడంలో ఈ వ్యాక్సీన్లు 85 శాతం ప్రయోజనకరంగా ఉన్నాయని తేలింది. మంకీపాక్స్, స్మాల్‌పాక్స్ వైరస్‌లకు చాలా పోలికలున్నాయి.

మంకీపాక్స్

మంకీపాక్స్ అంటే ఏంటి?

ఇది మశూచికి దగ్గరగా ఉండే వైరస్. కానీ మశూచి అంత తీవ్రమైనది కాదు, అంత త్వరగా వ్యాపించదు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ అందించిన వివరాలు ఇవీ..

లక్షణాలు

  • జ్వరం, తలనొప్పి, వాపు, కండరాల నొప్పి, అలసట
  • దురద, దద్దుర్లు, ముఖ్యంగా ముఖం, చేతులు, పాదాల మీద గుల్లలు

ఇది ఎలా వ్యాపిస్తుంది?

  • వైరస్ సోకిన వ్యక్తులు లేదా జంతువులు సన్నిహితంగా వచ్చినప్పుడు
  • ఈ దద్దుర్లు ఉన్న వ్యక్తులు వాడిన బట్టలు, దుప్పట్లు వాడినప్పుడు

చికిత్స

  • మశూచి వ్యాక్సీన్, యాంటి-వైరల్ మందులు మంకీపాక్స్ లక్షణాలను తగ్గిస్తాయి.

అయితే, ప్రస్తుతం మంకీపాక్స్ ఎందుకు వ్యాపిస్తోందో కారణాలు స్పష్టంగా తెలీవు. వైరస్‌లో కొత్త వేరియంట్ పుట్టి ఉండవచ్చనే అనుమానాలు ఉన్నాయి. కానీ, అందుకు తగ్గ ఆధారాలు లేవు.

వైరస్ అభివృద్ధికి అనుకూలత ఏర్పడి ఉండవచ్చన్నది మరొక ఊహ.

గతంలో మశూచికి వ్యాక్సీన్ విరివిగా వాడడం వలన మంకీపాక్స్ వ్యాప్తి తక్కువగా ఉన్నది. కానీ, ఇప్పుడు గతం కన్నా వేగంగా వ్యాపించే అవకాశం ఉండవచ్చని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
WHO: Challenges to the World with covid, Monkeypox, Wars
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X