వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సైరస్ మిస్త్రీ మరణానికి బాధ్యులెవరు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
సైరస్ మిస్త్రీ

ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ చనిపోయిన విషయం తెలిసిందే.

మిస్త్రీ ప్రయాణిస్తున్న మెర్సిడెస్ బెంజ్ కారు, మహారాష్ట్రలోని సూర్య నది వంతెన మీద కాంక్రీట్ డివైడర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కేపీఎంజీ గ్లోబల్ స్ట్రాటజీ డైరెక్టర్ జహంగీర్ పండోల్ కూడా ఈ ప్రమాదంలో మరణించారు.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం, ప్రముఖ గైనకాలజిస్ట్ అనహిత పండోల్ కారు నడుపుతున్నారు. ఆమె భర్త డేరియస్ పండోల్ పక్కనే కూర్చొని ఉన్నారు. ఈ యాక్సిడెంట్‌లో వీరిద్దరు కూడా బాగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో వారు చికిత్స పొందుతున్నారు.

జేఎం ఫైనాన్సియల్ ఈక్విటీ ఎండీ, సీఈఓగా ఉన్నారు డేరియస్ పండోల్. పండోల్ కుటుంబానికి సైరస్ మిస్త్రీ స్నేహితుడు.

మహారాష్ట్రలోని కాసా ప్రాంతంలోగల పాల్‌ఘర్‌లో ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో కారు వెనుక సీటులో సైరస్ మిస్త్రీ, జహంగీర్ పండోల్ కూర్చొని ఉన్నారు. వారు సీటు బెల్టు పెట్టుకోలేదని కాసా పోలీసులు చెప్పినట్లుగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించింది.

కారు డివైడర్‌ను ఢీకొన్నప్పుడు ముందు సీటు, వెనుక సీటు మధ్య సైరస్ మిస్త్రీ పడిపోయారు.

మిస్త్రీ మరణంపై అనుమానాలు

సైరస్ మిస్త్రీ మరణానికి కచ్చితమైన కారణం పోస్ట్‌మార్టం నివేదిక వస్తే కానీ తెలియదు. కానీ ఆయన మరణం మీద సోషల్ మీడియాలో ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అంత సంపన్నుడు విమానంలో కాకుండా 10 గంటల పాటు రోడ్డు ప్రయాణం ఎందుకు చేస్తున్నారు అని కొందరు ప్రశ్నిస్తుండగా మరికొందరు మెర్సిడెస్ కారు భద్రతా ప్రమాణాలపై సందేహం వ్యక్తం చేస్తున్నారు. విచారణ తరువాత కానీ ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకవు.

కానీ ఈ ప్రమాదం తరువాత జాతీయరహదారుల్లో వాహనాల వేగం, ఎయిర్‌బ్యాగ్స్ నాణ్యత, సీట్ బెల్టుల వాడకం మీద చర్చ జరుగుతోంది.

సైరస్ మిస్త్రీ, ఆయన స్నేహితుడు జహంగీర్ పండోల్... మెర్సిడెస్ జీఎల్‌సీ ఎస్‌యూవీలో వెనుక సీట్లో కూర్చొని ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణతో తేలింది.

చారోటీ చెక్‌పోస్ట్ దాటిన తరువాత 20 కిలోమీటర్ల దూరాన్ని కారు 9 నిమిషాల్లో పూర్తి చేసింది. అంటే కారు చాలా వేగంగా ప్రయాణించినట్లు తెలుస్తోంది. చారోటీ చెక్ పోస్ట్ వద్ద ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజీ చూసిన పాల్‌ఘర్ పోలీసులు, కారు ఓవర్ స్పీడ్‌లో వెళ్తున్నట్లు గుర్తించారు. అందువల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.

ఓవర్ స్పీడ్ వల్ల పెరుగుతున్న మరణాలు

సైరస్ మిస్త్రీ మరణంతో వాహనాల వేగం మీద పరిమితి విధించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.

ఇటీవలే విడుదల చేసిన నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం రోడ్డు ప్రమాదంలో 1.56 లక్షల మంది చనిపోతే, వీరిలో 85వేల మంది ఓవర్ స్పీడ్ వల్ల మరణించారు.

ప్రతి ఏడాదీ జాతీయ రహదారుల దూరం పెరుగుతూ వస్తోంది.

ఈ రహదారుల్లో ప్రతి 100 కిలోమీటర్లకు చోటు చేసుకునే మరణాలను 2018 నుంచి నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో లెక్కిస్తోంది. నాడు ప్రతి 100 కిలోమీటర్లకు 44 మంది చనిపోయారు.

అలాగే అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 9గంటల మధ్య జరుగుతున్నాయి. చలికాలం పొగ మంచు ఎక్కువగా ఉండే డిసెంబరు-జనవరి నెలల్లో ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

మెర్సిడెస్ బెంజ్ కార్ల నాణ్యతను అనుమానించాలా?

మెర్సిడెస్ బెంజ్ కార్ల నాణ్యత, భద్రతా ప్రమాణాలు చాలా ఎక్కువని చెబుతుంటారు. సైరస్ మిస్త్రీ ప్రయాణించిన మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌సీ, భారత్‌లో బాగా అమ్ముడు పోయే లగ్జరీ కార్లలో ఒకటి.

ప్రస్తుతం మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌సీ ఎక్స్-షోరూం ధర సుమారు రూ. 68.68 లక్షలు. యూరో ఎన్‌డీఏపీ(యురోపియన్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రాం) దీనికి భద్రతో ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చింది.

'ప్రయాణికుల భద్రత విషయంలో మెర్సిడెస్ బెంజ్ కార్లు చాలా మెరుగ్గా ఉంటాయి. వాటి భద్రత ప్రమాణాల విషయంలో సందేహం అక్కర్లేదు. సైరస్ మిస్త్రీ విషయంలో డ్రైవింగ్‌ పొరపాటు వల్లే ప్రమాదం జరిగింది' అని వాహన రంగ నిపుణుడు టుటు ధవన్ తెలిపారు.

'ప్రమాదం జరిగిన సమయంలో కారు గంటకు 100-125 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. అంత వేగంతో డివైడర్‌ను కారు ఢీకొట్టినా దాని ముందు భాగం మాత్రమే దెబ్బతినింది తప్ప మిగతా బాడీకి ఏం కాలేదు. అందువల్ల మెర్సిడెస్ బెంజ్‌లో భద్రతా లోపాలు ఉన్నాయని చెప్పడం సరికాదు. వెనుక కూర్చొని సీటు బెల్టు పెట్టుకోకపోవడం ఆయన మరణానికి దారి తీసింది' అని ధవన్ వివరించారు.

భారత్‌లో కారు వెనుక సీట్లో కూర్చున్న వారు బెల్ట్ పెట్టుకోవడం చాలా అరుదు

సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్‌లోని 138(8) నిబంధన ప్రకారం ముందు సీట్లు, వాటి వెనుక ఉండే సీట్లలో కూర్చొన్న వారు తప్పనిసరిగా సీటు బెల్టు పెట్టుకోవాలి. లేకుంటే రూ.1,000 జరిమానా విధిస్తారు.

2019లో సేవ్ లైఫ్ ఫౌండేషన్ జరిపిన ఒక సర్వేలో సీటు బెల్టు గురించి 11 నగరాల్లోని 6,306 మందిని ప్రశ్నించగా వారిలో 7శాతం మాత్రమే వెనుక సీటులో కుర్చున్నప్పుడు బెల్టు పెట్టుకుంటున్నట్లు తెలిపారు. వెనుక సీటు బెల్టు పెట్టుకోవడం తప్పనిసరి అనే విషయం 27.7శాతం మందికి మాత్రమే తెలుసు.

బ్యాక్ సీటులో కూర్చొన్నప్పుడు సీటు బెల్టు పెట్టుకోవడం ద్వారా రోడ్డు ప్రమాదాల్లో 25శాతం మరణాలను తగ్గించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపినట్లు ది హిందూ రిపోర్ట్ చేసింది.

రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు సీటు బెల్టు పెట్టుకోకపోయినా నిబంధనలకు విరుద్ధంగా డ్రైవింగ్ చేస్తున్నా పరిహారం చెల్లించేందుకు బీమా కంపెనీలు నిరాకరిస్తాయి.

మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్ నిబంధనల ప్రకారం ఓవర్ స్పీడ్‌తో ప్రయాణిస్తున్నా, రాంగ్ రూట్‌లో ప్రయాణించడం వల్ల ప్రమాదం జరిగినా, మందు తాగి డ్రైవ్ చేసినా బీమా కంపెనీలు పరిహారం చెల్లించవు.

కారు ప్రమాదం జరిగిన సమయంలో సీటు బెల్టు పెట్టుకోకుంటే క్లెయిమ్ రిజెక్ట్ చేస్తారని హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో వెబ్‌సైట్ చెబుతోంది. 2019 సెప్టెంబరు 6న విడుదల చేసిన ఐఆర్‌డీఏఐ నిబంధనల ప్రకారం వాహన బీమా ప్రీమియం కట్టేటప్పుడు ట్రాఫిక్ చలానా చరిత్రను కూడా చూస్తారు.

అంటే సీటు బెల్టు ధరించనందుకు చలానా కట్టి ఉంటే క్లెయిమ్‌ను బీమా సంస్థలు తిరస్కరిస్తాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Who is responsible for the death of Cyrus Mistry?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X