పారికర్ దారిలో.. రాజ్ నాథ్ సింగ్! యూపీ సీఎంగా చాన్స్?
కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ దేశంలో అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ కు సీఎం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
లక్నో: మరో కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనోహర్ పారికర్ రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేసి గోవా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయగా.. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ దేశంలో అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ కు సీఎం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
యూపీ ముఖ్యమంత్రి పదవి రేసులో రాజ్ నాథ్ సింగ్ పేరు ముందు వరుసలో వినిపిస్తోంది. యూపీ ముఖ్యమంత్రిగా రాజ్ నాథ్ ను పంపాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ సా యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
40 సీట్లున్న గోవాలో బీజేపీ 13 సీట్లే గెలిచినా ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కూడా పారికర్ ముఖ్యమంత్రి కావాలని కోరడంతో బీజేపీ అధిష్ఠానం అంగీకరించింది.

గోవాతో పోలిస్తే.. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఘన విజయం సాధించింది. 403 సీట్లున్న యూపీలో కమలం పార్టీ ఏకంగా 312 సీట్లు గెలిచింది. యూపీకి ఎంతో ప్రాధాన్యమిస్తున్న బీజేపీ సరైన వ్యక్తిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని భావిస్తోంది.
ప్రధాని నరేంద్ర మోడీ హామీలను సమర్థవంతంగా అమలు చేయడంతోపాటు రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడి, అభివృద్ధి దిశగా నడిపించగల నాయకుడి కోసం అన్వేషణ జరుగుతోంది. రాజ్ నాథ్ గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయనైతే ప్రభుత్వాన్ని సమర్థంగా నడపడంతోపాటు పార్టీ నేతలను కూడా కలుపుకొని వెళ్లగలరనేది బీజేపీ పెద్దల ఆలోచన.
యూపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక విషయంపై అమిత్ షా ఆ రాష్ట్ర నాయకులతో చర్చిస్తున్నారు. ఇటు ఆర్ఎస్ఎస్ నాయకులనూ సంప్రదించారు. సీఎం అభ్యర్థి ఎంపిక విషయమై రాజ్ నాథ్ సింగ్ తోనూ షా చర్చించారు.
మరోవైపు సీఎం పదవికి యూపీ బీజేపీ చీఫ్ కేశవ్ ప్రసాద్ మౌర్య, కేంద్రమంత్రి మనోజ్ సిన్హా పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే అభ్యర్థుల వరుసలో అందరికంటే రాజ్ నాథ్ సింగ్ ముందువరుసలో ఉన్నారు. మొత్తానికి యూపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది బుధవారం తేలిపోతుంది.












Click it and Unblock the Notifications