
భారత్‌కు హాని చేస్తే.. బాధ పడక తప్పదు: పారికర్
న్యూఢిల్లీ: భారత్‌కు హాని చేసే వారు బాధ పడకతప్పదని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడి నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ఘాటుగా హెచ్చరించారు. సోమవారం 68వ సైనిక దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనకు హాని తలపెట్టిన వాళ్లు కూడా ఆ బాధను అనుభవిస్తారన్నారు.
శత్రువులను టార్గెట్ చేయడం ప్రభుత్వ ఆలోచనగా భావించరాదన్నారు. ‘ఎవరైనా మీకు హాని చేస్తే, వాడు ఆ బాధను అర్థం చేసుకోగలడు. అయితే సమయం, సందర్భం చూసి వాడిపై దాడి చేయాల్సి ఉంటుంది' అని రక్షణ మంత్రి పారికర్ ఆర్మీ అధికారులతో అన్నారు.
‘ఎవరైనా మన దేశాన్ని నష్టం చేయాలనుకుంటే. ఆ వ్యక్తి కానీ సంస్థ కానీ అటువంటి నొప్పినే అనుభవించాలి. ఆ దెబ్బ వాడికి తగలనంత వరకు వాడు మనల్ని ఇబ్బందిపెడుతూనే ఉంటాడు' అని పారికర్ అభిప్రాయపడ్డారు.

పఠాన్‌కోట్‌లో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా సైనికులు కనబరిచిన పోరాట స్పూర్తి గర్వంగా ఉందన్నారు. శుత్రవుల చేతుల్లో ప్రాణాలు కోల్పోవడం కంటే, వాళ్ల ప్రాణాలను తీయడమే టార్గెట్ కావాలన్నారు. అంతేగాక, చెన్నై వరదల సందర్భంగా సైనికులు చేపట్టిన సహాయక చర్యలను ఆయన ప్రశంసించారు.
కాగా, జనవరి 2న జరిగిన పఠాన్‌కోట్ దాడిలో మొత్తం ఏడుగురు భద్రతా దళ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది గాయపడ్డారు. సైన్యం కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.