వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేవత విగ్రహానికి రాంగోపాల్ వర్మ విస్కీ ఎందుకు తాగించారు? - ప్రెస్ రివ్యూ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
రాంగోపాల్ వర్మ

కొండా సురేఖ-మురళి జీవిత కథపై దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమా తీస్తున్నట్లు ఆంధ్రజ్యోతి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

సురేఖ వెంట మురళీధర్‌రావు పడినట్లుగా.. కొండా బయోపిక్‌ తీయడానికి తాను ఆయన వెంట చాలా తిరగాల్సి వచ్చిందని వర్మ పేర్కొన్నారు.

కొండా మురళి-సురేఖ జీవిత ఘటనల ఆధారంగా రాంగోపాల్‌ వర్మ రూపొందిస్తున్న 'కొండా' సినిమా షూటింగ్‌ మంగళవారం వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలంలోని వంచనగిరిలో ప్రారంభమైందని పత్రిక చెప్పింది.

ఈ సందర్భంగా మాట్లాడిన వర్మ.. సినిమా కొండా మురళికి పాజిటివ్‌గా ఉంటుందా లేక నెగెటివ్‌గా ఉంటుందా అని చాలా మంది పెద్దలు తనను అడిగారని, 'సినిమాలో నిజాన్ని మీ ముందు ఉంచుతా మీరే పాజిటివో నెగెటివో చెప్పాలి' అని తాను వారికి బదులిచ్చానని వెల్లడించారు.

ఈ సినిమా తన 'శివ' చిత్రాన్ని దాటిపోతుందని, తన సినిమా జీవితంలో ఒక చరిత్ర సృష్టిస్తుందని అన్నారు.

ఇక, ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించిన కొండా సురేఖ.. తమ జీవిత కథ ఎంతో భిన్నమైనదని, అందుకే రాంగోపాల్‌వర్మ సినిమా తీయడానికి ముందుకువచ్చారని అన్నారు.

ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభానికి ముందు ర్యాలీ నిర్వహించారు.

కాగా, తనకు దేవుడంటే నమ్మకం లేదని పదేపదే చెప్పే రాంగోపాల్‌ వర్మ.. గీసుకొండ మండలంలోని కోటమైసమ్మ తల్లికి విస్కీ నైవేద్యంగా సమర్పించారని పత్రిక చెప్పింది.

'కొండా' బయోపిక్‌ షూటింగ్‌ ప్రారంభోత్సవం సందర్భంగా వర్మ ఆ ఆలయానికి వెళ్లారని ఆంధ్రజ్యోతి వివరించింది.

'అమ్మవారికి విస్కీ పట్టించా’

ఇక్కడి అమ్మవారికి భక్తులు మద్యాన్ని తీర్థంగా పోయడం సంప్రదాయంగా వస్తోందని సాక్షి పత్రిక రాసింది.

https://twitter.com/RGVzoomin/status/1447870819078524928

అమ్మవారికి మద్యంపోయడంపై ఆర్జీవీ స్పందిస్తూ..తానెప్పుడూ వోడ్కా తాగుతానని, అమ్మవారికి విస్కీ పట్టించానని తన ట్విట్టర్‌లో ట్వీట్‌ చేసినట్లు తెలిపింది.

ఆర్జీవీ ట్వీట్‌ సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్‌ అయింది. దీంతో నెటిజన్లు ఆర్జీవీని ట్రోల్‌ చేస్తున్నారని సాక్షి రాసింది.

డిజిటల్ పేమెంట్స్

నెట్ లేకున్నా డిజిటల్ చెల్లింపుల అమలు కోసం ఆర్‌బీఐ ప్రయత్నం

ఇంటర్నెట్ లేకున్నా ఆఫ్‌లైన్లో డిజిటల్ చెల్లింపులు జరిపే పద్ధతిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమలు చేయనుందని ఈనాడు దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా మొబైల్‌తో చెల్లించాలన్నా.. డెబిట్‌/కార్డు స్వైప్‌ చేయాలన్నా, ఇంటర్నెట్‌కు అనుసంధానం కావాల్సిందే.

నెట్‌వర్క్‌ సరిగ్గా లేకపోతే, ఈ డిజిటల్‌ చెల్లింపులు ఆలస్యం కావడమే కాదు.. ఒక్కోసారి బ్యాంకు ఖాతాలో నగదు కట్‌ అయినా, వ్యాపారికి చేరడం లేదు. ఈ విషయంలో వివాదాలు తప్పడం లేదు.

దీనికి పరిష్కారంగా అసలు ఇంటర్నెట్‌ లేకున్నా, ఆఫ్‌లైన్‌ ద్వారానే డిజిటల్‌ చెల్లింపులు జరిపే పద్ధతిని రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆవిష్కరించి, కొన్ని ప్రాంతాల్లో 2020 సెప్టెంబరు నుంచి ఈ ఏడాది జూన్‌ వరకు ప్రయోగాత్మకంగా పరిశీలించింది కూడా.

సంతృప్తికర ఫలితాలు రావడంతో, ఈ విధానాన్ని దేశ వ్యాప్తంగా ప్రవేశపెట్టేందుకు ఆర్‌బీఐ ప్రయత్నిస్తోందని కథనంలో చెప్పారు.

ప్రయోగ దశలో ఈ చెల్లింపుల గరిష్ఠ పరిమితిని రూ.200గా చేశారు. అన్ని లావాదేవీల సగటు రూ.48గా ఉంది.

మొత్తం 2.41 లక్షల లావాదేవీల ద్వారా రూ.1.16 కోట్ల నగదు బదిలీ ఈ కొత్త పద్ధతిలో జరిగిందని సమాచారం.

ఆఫ్‌లైన్‌ లావాదేవీలను వినియోగించుకోవాలనుకునే వారికి బ్యాంకులు లేదా ఫిన్‌టెక్‌ సంస్థలు ప్రత్యేక కార్డు లేదా టోకెన్‌ ఇస్తాయి.

ఇది డెబిట్‌ కార్డులాంటిదేనని చెప్పొచ్చు. నిర్ణీత మొత్తంలో చెల్లించాలని అనుకున్నప్పుడు.. ఈ కార్డును వాడుకోవచ్చని ఈనాడు రాసింది.

పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) తరహాలో ఉండే ప్రత్యేక యంత్రం ద్వారా ఆ చెల్లింపును నమోదు చేస్తారు. సాధారణంగా పీఓఎస్‌ యంత్రానికీ నెట్‌ అనుసంధానం ఉండాలి.

కానీ, ఈ ప్రత్యేక పీఓఎస్‌ మెషిన్‌కు ఇంటర్నెట్‌ అవసరం ఉండదు. ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చినప్పుడు వ్యాపారి ఈ యంత్రాన్ని అనుసంధానిస్తే, ఆయా చెల్లింపులన్నీ ఒకేసారి ప్రాసెస్‌ అవుతాయి.

అంతేకాదు.. వాయిస్‌ బేస్డ్‌ చెల్లింపులనూ ఈ పద్ధతిలో చేసే వీలుంటుంది. ఐవీఆర్‌ ద్వారా సూచనలు ఇచ్చి, చెల్లింపులను పూర్తి చేయొచ్చని ఈనాడు వివరించింది.

శ్రీశైలం ప్రాజెక్ట్

కృష్ణా బోర్డు చేతికి సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు

శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు గురువారం నుంచి కృష్ణా బోర్డు చేతుల్లోకి వెళ్లనున్నట్లు సాక్షి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

కృష్ణా జలాల వినియోగంపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలకు చరమగీతం పాడే దిశగా కృష్ణా బోర్డు చర్యలను వేగవంతం చేసింది.

కేంద్రం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను గురువారం నుంచి అమలు చేయడానికి సిద్ధమైందని పత్రిక చెప్పింది.

కృష్ణా పరీవాహక ప్రాంతంలో 2 రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లపై రేపటి నుంచి (గురువారం) ఇక కృష్ణా బోర్డుదే పెత్తనం.

ఈ ప్రాజెక్టులతో పాటు వాటిపై ఉన్న 16 అవుట్‌లెట్లను కూడా పరిధిలోకి తీసుకోవాలని కృష్ణా బోర్డు ఛైర్మన్‌ ఎంపీ సింగ్‌ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రెండు రాష్ట్రాల అధికారులు ఆమోదించారు.

ఏపీ భూభాగంలోని ఆరు అవుట్‌లెట్లను కృష్ణా బోర్డుకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు చెప్పారని సాక్షి రాసింది.

తెలంగాణ భూభాగంలోని పది అవుట్‌లెట్లను స్వాధీనం చేయడంపై ప్రభుత్వంతో సంప్రదించి తెలియచేస్తామని ఆ రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ పేర్కొన్నారు.

16 అవుట్‌లెట్లను స్వాధీనం చేస్తూ ఉత్తర్వులు ఇస్తే బోర్డు పరిధిలోకి తీసుకుని గురువారం నుంచే నిర్వహించడం ద్వారా గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుకు శ్రీకారం చుడతామని ఛైర్మన్‌ ఎంపీ సింగ్‌ స్పష్టం చేశారు.

కృష్ణా బోర్డు పరిధి ఖరారు, కేంద్ర జల్‌ శక్తి శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు అజెండాగా మంగళవారం హైదరాబాద్‌లో కృష్ణా బోర్డు ప్రత్యేకంగా సమావేశమైందని సాక్షి వివరించింది.

జైల్లో నేర్చుకున్నాడు

ఎఫ్‌డీలు కొట్టేయడం జైల్లో నేర్చుకున్నాడు

తెలుగు అకాడమీ నిధుల కుంభకోణం కేసులో ప్రధాన సూత్రధారి సాయికుమార్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను మాయం చేసే విద్యను జైల్లోనే నేర్చుకున్నాడని నమస్తే తెలంగాణ పత్రిక వార్తా కథనంలో చెప్పింది.

సాయికుమార్ 11 ఏండ్లుగా ఎఫ్‌డీల స్కాంలు చేసి రూ.200 కోట్లు కొల్లగొట్టినట్లు సీసీఎస్‌ పోలీసుల విచారణలో తేలింది.

అకాడమీకి చెందిన రూ.64.5 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను కాజేసిన ముఠా.. అదే సమయంలో ఏపీలోనూ రెండు బ్యాంకుల నుంచి రూ.15 కోట్లు కొట్టేసినట్టు తాజాగా వెలుగుచూసింది.

ఏపీ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ నుంచి రూ.10 కోట్లు, ఏపీ ఆయిల్‌ అండ్‌ సీడ్స్‌ కార్పొరేషన్‌కు చెందిన రూ.5 కోట్లను కొట్టేసి, ఆ డబ్బు ఏపీ మర్కంటైల్‌ బ్యాంకులోకి మళ్లించినట్టు విచారణలో బయటపడిందని పత్రిక రాసింది.

అంబర్‌పేట్‌ ప్రాంతంలో ఉండే చందూరి వెంకట కోటి సాయికుమార్‌ 18 ఏండ్ల కిందట ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఏర్పాటుచేశాడు.

హైటెక్‌సిటీ, చెన్నైలో కార్యాలయాలు తెరిచాడు. 2002లో సాఫ్ట్‌వేర్‌ బూమ్‌ పడిపోయి అప్పుల్లో కూరుకుపోయాడు.

చెన్నైలోని ఎన్‌సీఎల్‌కు చెందిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు కాజేసేందుకు యత్నిస్తున్న ముఠా సభ్యులతో చేతులు కలిపాడు.

విదేశాల నుంచి నిధులు వస్తున్నాయని చెప్పిన ముఠా సభ్యులు.. చెన్నైలో సాయికుమార్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి చెందిన బ్యాంకు ఖాతాలో రూ.6 కోట్లు డిపాజిట్‌ చేయించారు.

ఇందుకు సాయికుమార్‌కు రూ.కోటి కమీషన్‌ ఇచ్చారు. ఈ స్కామ్‌ వెలుగులోకి రావడంతో ముఠాతోపాటు సాయికుమార్‌ను సీబీఐ అరెస్టు చేసింది.

జైల్లో ఉండగానే సాయికుమార్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను కొల్లగొట్టే విధానాన్ని నేర్చుకున్నాడు. బయటకు వచ్చాక రియల్‌ ఎస్టేట్‌లోకి దిగాడని పత్రిక చెప్పింది.

అప్పుడే పశ్చిమ గోదావరి జిల్లా తణుకువాసి వెంకటరమణతో పరిచయం ఏర్పడింది. అతని ప్రింటింగ్‌ ప్రెస్‌కు కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి ఆర్డర్లు వచ్చేవి.

ఆయా సంస్థల్లో అకౌంట్స్‌ విభాగం అధికారులతో వీరికి పరిచయాలు ఏర్పడ్డాయి. ఇద్దరు కలిసి హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ చేస్తుండగా పద్మనాబన్‌ వీళ్లతో చేయి కలిపాడు.

నకిలీ డిపాజిట్‌ బాండ్లు తయారు చేయడంలో పద్మనాబన్‌ దిట్ట. 2012లో ఏపీ మైనార్టీ వెల్ఫేర్‌ సొసైటీకి చెందిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, 2015లో ఏపీ హౌసింగ్‌ బోర్డు ఎఫ్‌డీలు కాజేశారు.

సాయికుమార్‌ 11 ఏండ్ల నుంచి ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కుంభకోణం చేస్తుండగా.. అతనిపై 8 కేసులు ఉన్నట్టు సీసీఎస్‌ అధికారులు తెలిపారని నమస్తే తెలంగాణ వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
Why did Rangopal Varma put whiskey at the idol of Goddess
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X