హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ నిజాం భారత సైన్యానికి ఎందుకు లొంగిపోయారు? చరిత్ర ఏం చెబుతోంది

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

''ఈ దేశంలో జమీందారీలు, సామంత రాజ్యాలను ఇంత సులభంగా విలీనం చేయగలమని అనుకోలేదు. అంత పెద్ద సమస్యను సునాయాసంగా పరిష్కరించిన ఘనత నా మిత్రుడు, సహచరుడు సర్దార్‌ పటేల్‌‌దే. పాకిస్తాన్ విడిపోగా మిగిలిన దేశాన్ని సమైక్యంగా నిలిపి ఉంచటంలో ఆయన సామర్థ్యం ఈ దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.''

- జవహర్‌ లాల్‌ నెహ్రూ

nizam

సెప్టెంబర్ 17: ఒకరి దృష్టిలో విలీనం.. మరొకరి అభిప్రాయం విమోచనం.. ఇంకొకరి మాట విద్రోహం.. ఇంతకీ ఆ చరిత్రేంటి?

స్వాతంత్ర్యానంతరం సంస్థానాలను దేశంలో విలీనం చేయడంలో సర్దార్ వల్లభ్ భాయి పటేల్ పోషించిన పాత్ర అత్యంత కీలకం. అందుకే అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఆయనను అంతగా ప్రశంసించారు.

బ్రిటిష్ పాలకులు భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చినప్పటికీ సంస్థానాల విషయంలో మెలిక పెట్టి వెళ్లడం సమస్యగా మారింది. అప్పటికి దేశంలో ఉన్న 565 సంస్థానాలకు స్వయం నిర్ణయాధికారాన్ని కట్టబెట్టారు బ్రిటిష్ పాలకులు. అందులో 562 సంస్థానాలు స్వచ్ఛందంగా భారత్‌లో చేరిపోగా కశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్ సంస్థానాలు మాత్రం స్వతంత్ర రాజ్యాలుగా ఉంటామని భీష్మించాయి.

562 సంస్థానాలు భారత్‌లో విలీనమయ్యాక తెలంగాణ ప్రజలు నిజాం నిరంకుశ పాలనపై పోరాటం ప్రారంభించారు. దేశ్‌ముఖ్‌లు, దొరలు, భూస్వాములకు వ్యతిరేకంగా ఉద్యమాలు మొదలయ్యాయి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జోరందుకుంది.

పాకిస్తాన్‌తో పొత్తుకునిజాం యత్నాలు

అప్పటికి హైదరాబాద్ సంస్థానం ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనలో ఉంది. సొంత కరెన్సీ, సొంత రైల్వే, సొంత సైన్యం ఉన్న హైదరాబాద్‌ను స్వతంత్ర రాజ్యంగా ఉంచాలని నిజాం ప్రయత్నించారు. భారత్‌లో విలీనానికి గడువు కావాలని, అప్పటివరకు స్వతంత్రంగా ఉంటామని ప్రతిపాదించారు. అందుకు పటేల్ అంగీకరించలేదు.

కారణం, భారత్‌తో చర్చలకు గడువు కోరిన హైదరాబాద్ సంస్థానం మరోవైపు పాకిస్తాన్‌కు రూ. 20 కోట్లు ఇచ్చినట్లుగా ఆధారాలు దొరకడంతో పటేల్ నిజాంకు గడువు ఇచ్చేందుకు నిరాకరించారు. ఇదొక్కటే కాదు.. కరాచీలో హైదరాబాద్ సంస్థానం తరఫున ప్రజా సంబంధాల అధికారిని కూడా నియమించారు. దీంతో నిజాం వైఖరిపై పటేల్‌కు సందేహం కలిగింది.

మరోవైపు, నిజాం ప్రైవేటు సైన్యమైన రజాకార్లు కల్లోలం రేపి, మారణ హోమం సృష్టించారు. రజాకార్ల నాయకుడు ఖాసిం రిజ్వీ లక్షలాది మందితో భారీ కవాతు నిర్వహించి భారత ప్రభుత్వానికి హెచ్చరిక పంపించాడు. వీరి ఆగడాలు హైదరాబాద్‌ను దాటి ఇతర ప్రాంతాలకూ విస్తరించడంతో ఇక ఉపేక్షించి లాభం లేదని భావించిన పటేల్ హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయడానికి నిర్ణయించారు. ఆ ఫలితమే భారత సైన్యం చేపట్టిన పోలీసు చర్య. దీన్నే 'ఆపరేషన్ పోలో'గా పిలుస్తారు.

  1. బంగ్లాదేశ్ యుద్ధంలో 'రా' చీఫ్ రామేశ్వర్‌నాథ్‌దే కీలక పాత్ర!
  2. సర్దార్ వల్లభాయ్ పటేల్: ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం.. నిర్మాణం ఎలా జరుగుతోందంటే..

లొంగిపోయిన నిజాం

''పటేల్ ఆదేశాలతో మేజర్‌ జనరల్‌ జేఎన్ చౌధురి నేతృత్వంలో ఆపరేషన్ పోలో 1948 సెప్టెంబర్ 13న మొదలై అదే నెల 18వ తేదీ సాయంత్రానికి పూర్తయింది.

హైదరాబాద్‌ సంస్థానాన్ని రెండు వైపుల నుంచి ముట్టడించి స్వాధీనం చేసుకున్నారు. షోలాపూర్-హైదరాబాద్‌ మార్గంలో ప్రధాన బలగాలు రాగా.. విజయవాడ-హైదరాబాద్ మార్గంలో మరికొన్ని బలగాలు హైదరాబాద్‌పై పోలీసు చర్య చేపట్టాయి.

మొదటి రెండు రోజులు నిజాం సైన్యం నుంచి ప్రతిఘటన ఎదురైనా ఆ తరువాత ఏమీ చేయలేకపోయారు. సైన్యానికి పెద్దగా నష్టమేమీ కలగలేదు. రజాకార్లు మాత్రం 800 మందికిపైగా చనిపోయారు. రజాకార్లు చేసిన హత్యలు, లూటీలు, మానభంగాలతో పోల్చితే ఈ ప్రాణనష్టం చెప్పుకోదగ్గదేమీ కాదు'' అని వీపీ మెనన్ తన పుస్తకంలో రాశారు.

కొన్ని వారాలపాటు సాగుతుందని భారత ప్రభుత్వం భావించిన పోరాటం అనూహ్యంగా కొద్దిరోజులకే ముగిసింది. సెప్టెంబరు 17 సాయంత్రం నిజాం సైన్యం భారత్‌ సైన్యానికి లొంగిపోయింది.

'లొంగిపోతున్నాం’

నిజాం సేనాని జనరల్‌ ఎల్‌. ఎడ్రూస్‌ భారత ప్రభుత్వానికి లొంగిపోతున్నట్లు భారత సైనిక చర్యకు నేతృత్వం వహించిన మేజర్‌ జనరల్‌ చౌధురికి పత్రాన్ని అందించారు.

భారత ప్రభుత్వ ప్రతినిధి జనరల్‌ కె.ఎం. మున్షీ సమక్షంలో ఇదంతా జరిగింది. అనంతరం నిజాం ప్రధానమంత్రి లాయిక్‌ అలీ రాజీనామా చేశారు.

దక్కన్‌ రేడియాలో ఆ రోజు రాత్రి హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత దేశంలో విలీనం చేస్తున్నట్లు నిజాం ప్రకటించారు. వేలాది మంది వీధుల్లోకి వచ్చి జాతీయ పతాకాలు ఎగురవేశారు.

ఆ మరునాడు హైదరాబాద్‌ నగరంలోకి ప్రవేశించిన భారత సైన్యానికి జనం నీరాజనాలు పట్టారు. మొత్తం 108 గంటల్లో హైదరాబాద్ సంస్థానాన్ని పటేల్ భారత్‌లో అంతర్భాగం చేయగలిగారు. దాంతో నిజాం పాలన ముగిసింది.

(ఆధారం: వీపీ మెనన్ చన 'ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్‌లీ స్టేట్స్'. మెనన్ 1948లోహోం శాఖ కార్యదర్శిగా పనిచేస్తూ హైదరాబాద్ సంస్థానం విలీనంలో కీలక పాత్ర పోషించారు)

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Why did the Nizam of Hyderabad surrender to the Indian Army? What history is saying
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X