• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఫ్గాన్ సైన్యానికి భారత్ శిక్షణ ఇవ్వాలని తాలిబాన్లు ఎందుకు కోరుకుంటున్నారు? ఆ దేశ రక్షణ మంత్రి మాటల్లోని అంతరార్థం ఏమిటి

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

భారత్‌తో రక్షణ సంబంధాలను పునరుద్ధరించుకోవడంలో తమకు ఎలాంటి సమస్య లేదని తాలిబాన్ రక్షణ మంత్రి ముల్లా యాకూబ్ అన్నారు. అయితే, ముందుగా రెండు ప్రభుత్వాల మధ్య దౌత్య సంబంధాలను పునరుద్ధరించాలని నొక్కి చెప్పారు.

''రెండు ప్రభుత్వాల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి వస్తే, అఫ్గాన్ భద్రతా దళాలను శిక్షణ కోసం భారతదేశానికి పంపడానికి తాలిబాన్ సిద్ధంగా ఉంది'' అని ఆయన భారత టీవీ చానెల్ సీఎన్ఎన్ న్యూస్-18తో అన్నారు.

కాబుల్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని తిరిగి తెరవాలని, దిల్లీలోని అఫ్గాన్ రాయబార కార్యాలయంలోకి తాలిబాన్ రాయబారిని అనుమతించాలని ఆయన భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

భారత్ తిరిగి తన దౌత్య సిబ్బందిని అఫ్గానిస్తాన్‌కు పంపితే ఎలాంటి భద్రతా హామీనైనా ఇవ్వడానికి తాలిబాన్ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. గతంలో తాలిబాన్ అధికార ప్రతినిధి సుహైల్ షాహీన్ కూడా దోహాలో ఇదే విషయాన్ని చెప్పారు.

భారత్‌తో సహా ప్రపంచంలోని అన్ని దేశాలతో సత్సంబంధాలను తాలిబాన్ ప్రభుత్వం కోరుకుంటుందని సీఎన్‌ఎన్ న్యూస్-18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముల్లా యాకూబ్ పునరుద్ఘాటించారు.

తాలిబాన్ వ్యవస్థాపకుడు, నాయకుడు ముల్లా ఒమర్ కుమారుడైన ముల్లా యాకూబ్ చేసిన ఈ ప్రకటన గురించి బీబీసీ మానిటరింగ్ అఫ్గాన్ వ్యవహారాల నిపుణుడు తారిక్ అతాతో మేం మాట్లాడాం. తాలిబాన్లు, అఫ్గానిస్తాన్‌లలో నిరాశ, నిస్పృహ ఉన్నాయని... అక్కడ ఆర్థిక కార్యకలాపాలు దాదాపుగా నిలిచిపోయాయని ఆయన చెప్పారు.

ప్రపంచం తమను గుర్తించాలని తాలిబాన్లు కోరుకుంటున్నారని, ఎందుకంటే ఇప్పటివరకు ఏ దేశం కూడా అఫ్గాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా అంగీకరించలేదని ఆయన అన్నారు.

ఇప్పటి వరకు ఐక్యరాజ్యసమితి కూడా తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించలేదు. దీంతో పాకిస్తాన్‌తో సహా ప్రపంచంలోని అన్ని ముస్లిం దేశాలను తాలిబాన్లు విజ్ఞప్తి చేస్తున్నారు.

అఫ్గాన్ భద్రతా బలగాలకు శిక్షణ ఇచ్చిన భారత్

తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తిస్తే.... అఫ్గానిస్తాన్‌లో ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. మానవతా సహాయం మీద ఆధారపడి ఒక దేశం ఎన్ని రోజులు ఇలా గడుపుతుందని పేర్కొంటూ తాలిబాన్ సమర్థకులు, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ (ఓఐసీ)కి తాలిబాన్ ప్రభుత్వాన్ని అంగీకరించాలని విజ్ఞప్తి చేశారు.

తారిక్ అతా మాట్లాడుతూ... ''భద్రతా బలగాలకు శిక్షణ ఇచ్చే విషయానికొస్తే, ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఇది పాకిస్తాన్‌కు అస్సలు ఆమోదయోగ్యం కాదు. తాలిబాన్ ప్రభుత్వం రాకముందు నుంచే సాంకేతిక శిక్షణను ఇస్తున్నారని ఆయన చెప్పారు. కానీ, అధికారికంగా భద్రతా బలగాలకు శిక్షణ ఇవ్వడం చాలా పెద్ద విషయం. ఈ మాటను తాలిబాన్లు చెప్పడం ఆశ్చర్యంగా ఉంది'' అని అన్నారు.

భారత్‌, పాకిస్తాన్‌లకు సంబంధించి అఫ్గాన్ ప్రజల్లో రెండు వర్గాలు ఉన్నాయని తారిక్ చెప్పారు. ఇందులో ఒక వర్గం పాకిస్తాన్‌కు అనుకూలంగా, రెండో వర్గం భారత్‌కు మద్దతుగా ఉంటుందని చెప్పారు.

భారత్ నుంచి ఒక ప్రతినిధి బృందం తొలిసారిగా తాలిబాన్ల పాలనలో ఉన్న అఫ్గానిస్తాన్ పర్యటనకు వెళ్లింది. మానవతా ప్రాతిపదికన అందించిన సహాయాన్ని సమీక్షించేందుకు ఈ ప్రతినిధి బృందం అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయమనే కాకుండా అఫ్గాన్‌పై భారత్ ఆసక్తి కనబరుస్తోంది.

దీనికంటే ముందు దోహాలో తాలిబాన్ నాయకులను భారత్ కలుసుకుంది. ఇటీవల భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ తజికిస్తాన్ రాజధాని దుషాంబేలో మాట్లాడుతూ అఫ్గానిస్తాన్‌తో భారత్‌కు ప్రత్యేక సంబంధం ఉందని, అది అలాగే కొనసాగుతుందని అన్నారు.

ప్రాంతీయ భద్రతపై దుషాంబేలో సమావేశం జరిగింది. ఇందులో భారత్‌తో సహా చైనా, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా, ఉజ్బెకిస్తాన్, తజికిస్థాన్‌లకు చెందిన జాతీయ భద్రతా సలహాదారులు, రాష్ట్ర భద్రతా మండలి అధిపతులు హాజరయ్యారు.

హిందుస్థాన్ టైమ్స్‌లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం... ''అఫ్గానిస్తాన్ ప్రజలతో వందల ఏళ్లుగా ఉన్న ప్రత్యేక సంబంధాలే, భారతదేశానికి మార్గనిర్దేశనం చేస్తాయని, దీన్ని ఏదీ మార్చలేదని'' డోభాల్ అన్నారు.

దీనిపై తారిక్ అతా వ్యాఖ్యానించారు. ''చారిత్రాత్మకంగా అఫ్గానిస్తాన్‌తో భారత్‌కు మంచి, సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తాలిబాన్ మొదటి దశ పాలన తర్వాత భారతదేశం అక్కడ చాలా పెట్టుబడులు పెట్టింది. అనేక నిర్మాణ ప్రాజెక్టులను పూర్తి చేసింది. కానీ ఇంకా అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు అక్కడ చాలా ఉన్నాయి. భారతదేశం తన ప్రాజెక్టులను తిరిగి ప్రారంభిస్తే, వాటి నుంచి చాలా మంది అఫ్గాన్లకు ఆర్థిక సహాయం అందుతుంది'' అని తారిక్ అన్నారు.

సీఎన్ఎన్ న్యూస్-18 ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ముల్లా యాకూబ్, గత కొన్ని నెలలుగా అఫ్గాన్‌కు మానవతా సహాయం అందించినందుకు భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

భారత్ ఇప్పటివరకు 20,000 మెట్రిక్ టన్నుల గోధుమలు, 13 టన్నుల ఔషధాలు, 5 లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు, చలికాలంలో ధరించే దుస్తులను అఫ్గానిస్తాన్‌కు పంపించినట్లు జూన్ 2న విడుదల చేసిన ప్రెస్ నోట్‌లో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ వస్తువులను కాబుల్‌లోని ఇందిరా గాంధీ పిల్లల ఆసుపత్రి, డబ్ల్యూహెచ్‌వో, డబ్ల్యూఎఫ్‌పీలకు అప్పగించారు.

భారతదేశం 2022-23 బడ్జెట్‌లో అఫ్గానిస్తాన్ కోసం రూ. 200 కోట్లకు పైగా కేటాయించిందని హిందుస్థాన్ టైమ్స్‌ని ఉటంకిస్తూ బీబీసీ మానిటరింగ్ తెలిపింది.

అఫ్గానిస్తాన్‌ను తాలిబాన్లు ఆక్రమించిన తర్వాత ప్రపంచంలోని చాలా దేశాల్లాగే భారత్ కూడా కాబుల్‌లోని తమ రాయబార కార్యాలయాన్ని మూసేసింది. తాలిబాన్లతో దౌత్య సంబంధాలను కొనసాగించలేదు.

భారత్, పాక్ జాతీయ జెండాలు

'భారత్, పాకిస్తాన్‌ విషయాల్లో మేం జోక్యం చేసుకోం'

ముల్లా యాకూబ్ తన ఇంటర్వ్యూలో అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, భారత్ దేశాల మధ్య త్రైపాక్షిక సంబంధాలు... ఈ ప్రాంతంలోని భద్రత గురించి క్లుప్తంగా మాట్లాడారు.

భారత్, పాకిస్తాన్ దేశాలు పరస్పర వ్యతిరేక కార్యక్రమాల కోసం అఫ్గానిస్తాన్ భూభాగాన్ని ఉపయోగించుకునేందుకు తాలిబాన్ ప్రభుత్వం అనుమతించబోదని అయన నొక్కి చెప్పారు. ఇరు దేశాలు చర్చల ద్వారా తమ మధ్య విభేదాలను పరిష్కరించుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

తమకు అల్-ఖైదాతో ఎలాంటి సంబంధం లేదని... తీవ్రవాద సంస్థలు, ఇస్లామిక్ స్టేట్ సంస్థలుగా పిలవడే వాటిని అఫ్గానిస్తాన్‌లో అణిచివేశామని ఆయన చెప్పారు.

పాకిస్తాన్, డ్యూరాండ్ లైన్ గురించి అడిగినప్పుడు... పాకిస్తాన్‌తో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని అన్నారు. డ్యూరాండ్ లైన్ వద్ద ఏవైనా ఘటనలు జరిగితే వాటిని తీవ్రంగా పరిణించకూడదని చెప్పారు.

అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ ప్రభుత్వానికి సమస్యలు సృష్టించవద్దని, తమతో దౌత్య సంబంధాలు నెరపాలని ఆయన అమెరికాను కోరారు.

పాకిస్తాన్ ఇంటెలిజెన్స్, తీవ్రవాద గ్రూపుల ప్రభావం దృష్ట్యా తాలిబాన్ల గురించి భారత్ ఆందోళన చెందుతోంది. భారత్‌కు వ్యతిరేకంగా అఫ్గాన్ భూభాగం ఉపయోగపడకూడదని భారత్ కోరుకుంటోంది.

అయితే, ప్రపంచంలోని ఏదైనా దేశం లేదా సమూహం... ఇతర దేశానికి వ్యతిరేకంగా అఫ్గాన్ భూభాగాన్ని ఉపయోగించడాన్ని తాము అనుమతించబోమని తాలిబాన్లు నొక్కి చెబుతున్నారు.

కాబుల్‌కు వెళ్లిన ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన భారత అత్యున్నత అధికారి జేపీ సింగ్, తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీని కలిసేందుకు కాబుల్‌కు చేరుకున్న సమయంలో తాలిబాన్ రక్షణ మంత్రి ముల్లా యాకూబ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

''అఫ్గానిస్తాన్‌తో మునుపటిలా సత్సంబంధాలు కోరుకుంటున్నామని, అఫ్గాన్‌కు తమ సహాయాన్ని కొనసాగిస్తామని'' భారత అధికారులు తమతో చెప్పినట్లు తాలిబాన్ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ మాట్లాడుతూ... '' అఫ్గానిస్తాన్‌లో ఆగిపోయిన తమ ప్రాజెక్టులను భారత్ పున:ప్రారంభించాలి. దౌత్యపరమైన వ్యవహారాలను పునరుద్ధరించాలి. అఫ్గాన్ ప్రజలకు ముఖ్యంగా విద్యార్థులకు, రోగులకు దౌత్యపరమైన సేవలను అందించాలి'' అని అన్నారు.

భారత్ ఎట్టకేలకు అఫ్గానిస్తాన్‌లోని మిలీషియా ప్రభుత్వంతో నేరుగా సమావేశం కావడానికి సంకోచాన్ని విడిచిపెట్టిందని 'డెక్కన్ హెరాల్డ్' పత్రిక రాసింది.

''తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాకిస్తాన్ గూఢాచార సంస్థ... అఫ్గాన్‌లో భారత జోక్యాన్ని అంతం చేయాలని యోచిస్తోంది. అయితే, భారత ప్రతినిధి బృందం అఫ్గాన్ పర్యటన ద్వారా వారి ప్రణాళికలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది'' అని ప్రముఖ మలయాళ పత్రిక కేరళ కోమోడీ రాసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Why do the Taliban want India to train the Afghan army? What is the meaning of the words of the Minister of Defense
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X