అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ఎందుకంటే?
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో పలుమార్లు నోటీసులు, సమన్లు జారీ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) గురువారం రాత్రి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసింది. అంతకుముందు కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్న ఈడీ అధికారుల బృందం సోదాలు నిర్వహించి, సుమారు రెండు గంటలపాటు విచారించింది. ఇప్పటికే 9 సార్లు ఈడీ సమన్లు ఇచ్చినప్పటికీ.. వేటికి కూడా కేజ్రీవాల్ హాజరు కాలేదు.
కాగా, ఢిల్లీ లిక్కర్ కేసు (delhi liquor case)లో కేజ్రీవాల్ ను కుట్రదారుగా ఈడీ భావిస్తోంది. లిక్కర్ పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్, ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితతో కలిసి కుట్ర పన్నారని ఈడీ పేర్కొంది. ఈ కేసులో సౌత్ లాబీగా పిలువబడుతున్న వాళ్లకు ప్రయోజనం చేకూర్చే విధంగా పాలసీని రూపొందించినట్లు ఆరోపిస్తోంది. ఇందుకు బదులుగా 'సౌత్ లాబీ' ఆమ్ ఆద్మీ పార్టీకి రూ. 100 కోట్లు ఇచ్చినట్లు ఆరోపలున్నాయి.

అంతేగాక, కొంతమంది నిందితులు, సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల్లో అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఉండటం గమనార్హం. ఈడీ తన రిమాండ్ నోట్, ఛార్జీషీట్లలోనూ ఈ మేరకు పేర్కొంది. లిక్కర్ పాలసీ కేసు నిందితుల్లో ఒకరైన విజయ్ నాయర్ తరచూ కేజ్రీవాల్ కార్యాలయానికి వెళ్లేవారని, ఎక్కువ సమయం అక్కడే నడిపేవారని ఈడీ తెలిపింది.
సీఎం కేజ్రీవాల్‌తో చర్చించినట్లు మద్యం వ్యాపారులకు విజయ్ నాయర్ చెప్పినట్లు ఆరోపణలున్నాయి. ఇండో స్పిరిట్ యజమాని సమీర్ మహేంద్రు, సీఎం కేజ్రీవాల్‌ని కలవడానికి విజయ్ నాయర్ ని పంపినట్లు తెలిసింది. సౌత్ లాబీలో నిందితుడిగా, ఇప్పుడు సాక్షిగా ఉన్న రాఘవ్ మాగుంట.. తన తండ్రి లిక్కర్ పాలసీ గురించి తెలుసుకోవడానికి కేజ్రీవాల్‌ను కలిసినట్లు తెలిపారు.
కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. డిసెంబర్ 2022లో సిసోడియా నుంచి మంత్రుల బృందం నుంచి నివేదిక పొందినట్లు పేర్కొన్నారు. సిసోడియా ఫోన్ చేసి, సీఎం కేజ్రీవాల్ ఇంటికి వెళ్లానని.. ఆ సమయంలో సత్యేంద్రజైన్ అక్కడే ఉన్నారని, డాక్యుమెంట్ కూడా చూశానని తెలిపారు. మంత్రుల బృందం సమావేశంలో అటువంటి ప్రతిపాదన ఏదీ చర్చించబడనందున తాను ఆశ్చర్యపోయానని, అయితే, ఆ డాక్యుమెంట్ ఆధారంగా గ్రూప్ ఆఫ్ మినిష్టర్స్ నివేదికను తయారు చేయమని తనను కోరినట్లు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. సుమారు రెండు గంటలపాటు ఆయన నివాసంలోనే విచారించిన ఈడీ అధికారులు ఆ తర్వాత అరెస్ట్ చేసి ఈడీ కార్యాలయానికి తరలించారు. కాగా, లోక్‌సభ ఎన్నికల ముందు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications