మోడీని అడగరా: డిగ్గీ అసహనం, రేప్‌లపై వింత వాదన
న్యూఢిల్లీ: అత్యాచారాల విషయమై ప్రధాని నరేంద్ర మోడీని మీడియా ఎందుకు ప్రశ్నించడం లేదని కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మీడియా పైన మండిపడ్డారు. యూపిలోని అత్యాచారాలకు సంబంధించి మోడీని ఎందుకు అడగటం లేదన్నారు.

డిగ్గీ ట్విట్టర్‌లో దీనిపై ట్వీట్ చేశారు. యూపిఏ హయాంలో నిర్భయ అత్యాచార ఘటన విషయంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌నే లక్ష్యంగా చేసుకున్న మీడియా.. ఇప్పుడు యూపిలో మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలపైన ప్రస్తుత ప్రధాని మోడీని ఎందుకు లక్ష్యంగా చేసుకోవడం లేదని ప్రశ్నించారు. మీడియా మోడీని ప్రశ్నించలేకపోతోందని అభిప్రాయపడ్డారు. మీడియా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందన్నారు.
కాగా, అత్యాచారాల పైన సమాజ్ వాది పార్టీ నేత రాంగోపాల్ యాదవ్ వింత వాదన చేసిన విషయం తెలిసిందే. అమ్మాయిలు, అబ్బాయిల మధ్య సంబంధం బయటపడినప్పుడు దానిని అత్యాచారంగా చిత్రీకరిస్తున్నారని, చాలాచోట్ల పెళ్లిళ్లకు సిద్ధపడుతున్నా పరువు హత్యలు జరుగుతున్నాయని, ఇతర ప్రాంతాల్లోను ఇటువంటి సంఘటనలు జరుగుతున్నా వాటి గురించి ప్రముఖంగా చెప్పడం లేదని అన్నారు. మరో ఎస్పీ నేత మోహిసిన్ ఖాన్ మాట్లాడుతూ.. యూపి పెద్ద రాష్ట్రమని, ఇలాంటి రాష్ట్రాల్లో అత్యాచారాలు సహజమని వ్యాఖ్యానించాడు.












Click it and Unblock the Notifications