రాహుల్ గాంధీ అడిగిన ఒకే ఒక ప్రశ్నకు ఫసక్
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ప్రధాని మోదీ ప్రసంగం మధ్యలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్ సభలో అడుగు పెట్టారు. ఆ సమయంలో విలేకరులకు ఆయన సూటి ప్రశ్న సంధించారు.
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదాని సారథ్యంలోని అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఆర్థిక మోసాలకు పాల్పడ్డాయంటూ హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదిక.. పార్లమెంట్ ను కుదిపేస్తోంది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలంటూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు పార్లమెంట్ ను స్తంభింపజేస్తోన్నారు. గౌతమ్ అదాని- వేల కోట్ల రూపాయల మేర ఆర్థిక మోసాలకు పాల్పడినట్లు హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేస్తోన్నారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలను తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, వాయనాడ్ లోక్ సభ సభ్యుడు రాహుల్ గాంధీ మాట్లాడారు. అదాని వ్యవహారంపై నిప్పులు చెరిగారు. అదాని విషయంలో కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండటాన్ని ప్రస్తావించారు. కేంద్రం తీరును ఏకిపడేశారు. అతితక్కువ కాలంలో ప్రపంచంలోనే అపర కుబేరుడిగా ఆయన ఎలా ఎదిగారన విషయాన్ని దేశ ప్రజలందరూ తెలుసుకోవాలనుకుంటోన్నారంటూ చురకలు అంటించారు.

దీనిపై తాజాగా పార్లమెంట్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలను తెలిపే తీర్మానంపై మాట్లాడారు. రాహుల్ గాంధీ చేసిన ప్రసంగాన్ని తప్పుపట్టారు. 1004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయికి చేరుకుందని ఎదురుదాడికి దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వ తప్పులను తాము సరిదిద్దుతున్నామని, ఇది ప్రతిపక్షాలకు ఆందోళన, బాధకు గురి చేస్తోందని ఎద్దేవా చేశారు. 2004-2014 కాలం మొత్తం కుంభకోణాలు, ఉగ్రదాడులు జరిగాయని అన్నారు.
మోదీ మాట్లాడుతున్న సమయంలో రాహుల్ గాంధీ సభలో అడుగు పెట్టారు. మధ్యాహ్నం సభ పునఃప్రారంభమైన తరువాత ఆయన సభలో కనిపించలేదు. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో- ఆయా రాష్ట్రాలకు చెందిన పార్టీ నాయకులతో సమావేశం అయ్యారు. ప్రధాని మోదీ ప్రసంగం ఆరంభమైన కొద్దిసేపటికే పార్లమెంట్ భవనానికి చేరుకున్నారు.
పార్లమెంట్ ఆవరణలో కారు దిగి లోనికి వెళ్తోన్న సమయంలో రాహుల్ గాంధీని- పలువురు విలేకరుల పలకరించారు. ఆయనను మాట్లాడటానికి ప్రయత్నించారు. రాహుల్ సర్ అంటూ వెంటపడ్డారు. తొలుత వారిని పట్టించుకోకుండా నేరుగా ప్రధాన ద్వారం వద్దకు వెళ్లిన ఆయన- వెనక్కి తిరిగొచ్చారు. వస్తూ వస్తూనే విలేకరులకు ఒకే ఒక్క ప్రశ సంధించారు. నా మాటలను ఎందుకు తొలగించారు?.. అంటూ అడిగారు.
#WATCH | "Why my words were expunged?," says Congress MP Rahul Gandhi as he arrives in Parliament in the middle of PM's speech during motion of thanks to President's address, in Lok Sabha pic.twitter.com/rIcLV1REHk
— ANI (@ANI) February 8, 2023
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలను తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా సభలో రాహుల్ గాంధీ మాట్లాడిన ప్రసంగంలోని పలు ప్రధాన అంశాలు మీడియాలో కవర్ కాలేదనే విషయంపై ఆయన నిలదీశారు. తన మాటలను ఎందుకు తొలగించారంటూ మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. దీనికి వారి వద్ద నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఈ ప్రశ్న వేసిన వెంటనే రాహుల్ గాంధీ వెనక్కి తిరిగి వెళ్లారు.












Click it and Unblock the Notifications