తెలంగాణా ఆరోగ్య శాఖ పనితీరు భేష్ .. కేంద్రం అదనపు 200 కోట్లు మంజూరు!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగానికి పెద్దపీట వేస్తోంది. ముఖ్యంగా మాతా శిశు ఆరోగ్య సంరక్షణ పైన కూడా ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల కంటే అసాధారణ పనితీరు చూపించి జాతీయ స్థాయిలో మెరుగైన గుర్తింపు సాధించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ క్రమంలో ఈ విజయానికి ఉత్సాహంగా కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
200 కోట్ల రూపాయల అదనపు నిధులను మంజూరు చేసిన కేంద్రం
తెలంగాణ రాష్ట్రానికి 200 కోట్ల రూపాయల అదనపు నిధులను మంజూరు చేసినట్టు పేర్కొంది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. కేంద్రం ప్రకటించిన ఈ అదనపు నిధులతో మాతా శిశు సంరక్షణ సేవలు మరింత బలపరచనున్నారు. అంతేకాదు మాతా శిశు సంరక్షణకు ఆధునిక వైద్య మౌలిక సదుపాయాలను విస్తరించడానికి వినియోగించనున్నట్లు పేర్కొన్నారు.

కేంద్ర నిధులతో చేసే పనులు ఇవే
ఎంపిక చేసిన ఆసుపత్రులలో నవజాత శిశు సంరక్షణ కోసం తీసుకునే చర్యలలో భాగంగా లేబర్ రూమ్స్ , ఆపరేషన్ థియేటర్స్ ఆత్యాధునికంగా తీర్చిదిద్దుతారు. నవజాత శిశువుల సంరక్షణా విభాగాలను విస్తృతం చేయటం, మదర్ కేర్ వార్డులు, మిడ్ వైఫారీ లేద కేర్ యూనిట్ లు, లాక్టేషన్ మేనేజ్మెంట్ యూనిట్లు వంటి ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ ప్రకారం అభివృద్ధి
ముఖ్యంగా ఎక్కువ సంఖ్యలో ప్రసవాలు జరిగే ఆసుపత్రులలో గర్భిణీలు గర్భస్థ శిశువుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం కోసం అత్యాధునిక పరికరాలతో కూడిన వసతులను అందుబాటులోకి తెస్తారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ ప్రకారం అభివృద్ధి చేసి నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్టిఫికేషన్ పొందేలా చర్యలు తీసుకోనున్నారు.
మాతా శిశు మరణాలను తగ్గించే ప్రయత్నం
కేంద్రం అందిస్తున్న ఈ అదనపు నిధులను పూర్తిగా మాతా శిశు సంరక్షణకు కేటాయిస్తామని, మాతృ మరణాలను నవజాత శిశు మరణాలను తగ్గించేందుకు ప్రయత్నం చేస్తామని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చేరే ప్రతి గర్భిణీ స్త్రీకి మరియు పుట్టిన బిడ్డకు ఉత్తమ నాణ్యత గల వైద్య సేవలు ఉచితంగా అందించడం లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. జాతీయ స్థాయిలో వచ్చిన ఈ గుర్తింపు వెనుక వైద్య సిబ్బంది పనితీరు, వ్యూహాత్మక కార్యక్రమాల నిర్వహణ ఉందన్నారు. ఆరోగ్య రంగంలో ఇటువంటి గుర్తింపు సాధించడం వైద్యులకు మరింత ఉత్సాహం ఇస్తుందని అన్నారు.












Click it and Unblock the Notifications