విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆంధ్రప్రదేశ్: జయహో బీసీ సభను అధికార పార్టీ ఎందుకు నిర్వహించింది, బీసీ కార్పోరేషన్లతో జరిగిన మేలు ఎంత ?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

గత సాధారణ ఎన్నికలకు ముందు బీసీ గర్జన పేరుతో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ సభ జరిగింది.

ఏలూరులో ఎన్నికలకు రెండు నెలల ముందు 2019 ఫిబ్రవరి 17న నిర్వహించిన ఆ సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటించారు.

ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న వై.ఎస్. జగన్ తాము అధికారంలోకి వస్తే వెనుకబడిన కులాలకు ఏమేమి చేస్తామన్నది డిక్లరేషన్ లో ప్రస్తావించారు.

అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత 2020 డిసెంబర్ 17న బీసీలకు కులాల వారీగా కార్పోరేషన్లు ఏర్పాటు చేసి ఆయా సంస్థల చైర్మన్లు, డైరెక్టర్ల ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించారు. బీసీల సంక్రాంతి పేరుతో ఆ కార్యక్రమం జరిగింది.

ఇప్పుడు మళ్లీ ఎన్నికల సన్నాహాలు ప్రారంభించిన వైఎస్సార్సీపీ నేతలు, మరోసారి జయహో బీసీ పేరుతో భారీ సభ నిర్వహించింది.

విపక్షంలో ఉండగా ఏం చెప్పారు, అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, ఇప్పుడు ఏ లక్ష్యంతో జయహో బీసీ సభ జరుపుతున్నారనే అంశాలు చర్చనీయాంశమవుతున్నాయి.

బీసీ డిక్లరేషన్ లో ఏం చెప్పారు..

ప్రతిపక్షనేతగా సుదీర్ఘ పాదయాత్ర చేసిన వై.ఎస్. జగన్ తన యాత్రలో భాగంగా ఏలూరులో బీసీ గర్జన సభ నిర్వహించారు.

ఆ సందర్భంగా నాటి చంద్రబాబు ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. తాము అధికారం చేపడితే ఏమేమి చేస్తామన్నది ప్రకటించారు.

అప్పటికే ప్రకటించిన నవరత్నాలు హామీలకు అదనంగా బీసీలకు ప్రత్యేకంగా డిక్లరేషన్ ప్రకారం వివిధ ప్రయోజనాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

బీసీలకు ఏటా రూ.15వేల కోట్లు చొప్పున కేటాయిస్తామన్నారు. అయిదేళ్లలో రూ.75వేల కోట్లు బీసీల కోసం ఖర్చు చేస్తామన్నారు.

బీసీ కేటగిరీలోని అన్ని కులాలకు ప్రత్యేక కార్పోరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. 139 కార్పోరేషన్లు పెడతామని చెప్పారు.

వైయస్సార్ చేయూత పథకం ద్వారా 45 ఏళ్లు నిండిన ప్రతీ మహిళకు రూ.75వేలు అందిస్తామన్నారు.

శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

బడ్జెట్ లో మూడోవంతు నిధులు బీసీలకు కేటాయిస్తామన్నారు.

చిన్న చిన్న వ్యాపారాలు చేసే వారికి గుర్తింపు కార్డు ఇచ్చి, వారికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు సున్నా వడ్డీకే రూ.10వేలు చొప్పున ఇస్తామన్నారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్ కమిటీల్లో యాభై శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు.

ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు వచ్చేలా చట్టం తెస్తామన్నారు.

బీసీల కోసం సమగ్ర సబ్ ప్లాన్ చట్టాన్ని చట్టబద్దంగా తీసుకు వస్తామన్నారు.

షాప్ నడుపుతున్న నాయీ బ్రాహ్మణుడికి రూ.10వేలు, మత్స్యకారులకు ఏడాదికి రూ.10వేలు, మగ్గం ఉంటే నెలకు రూ.2వేలు చొప్పున ఇస్తామన్నారు.

సహకార సంఘాల్లో పాలు పోస్తే ప్రతి లీటర్‌కు రూ.4 అదనంగా ఇస్తామని చెప్పారు.

గొర్రెలు, మేకలు చనిపోతే యాదవులకు రూ.6వేలు చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.

తెరపైకి కులాల వారీగా కార్పోరేషన్లు

ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ జయహో బీసీ సభ

సాధారణ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన తర్వాత బీసీ డిక్లరేషన్ ప్రకారం పలు హామీల అమలుకి పూనుకున్నారు. అందులో భాగంగా కులాల వారీగా కార్పోరేషన్లు స్థాపించారు.

అంతకుముందు సుదీర్ఘకాలం పాటు బీసీలందరికీ కలిపి ఒకటే కార్పోరేషన్ గా ఉండేది. ఆ తర్వాత కొన్ని ప్రధాన కులాల పేరుతో కార్పోరేషన్ల ఏర్పాటుకి ప్రయత్నాలు జరిగాయి.

వివిధ ప్రభుత్వాలు కొన్ని ఉపకులాలకు కూడా ఫెడరేషన్లు ఏర్పాటు చేశాయి. 2019 నాటికి 13 కార్పోరేషన్లు, 9 ఫెడరేషన్లు ఉండేవి.

వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏపీలో ఉన్న 56 కులాలకు వాటిని విస్తరించింది. కార్పోరేషన్లు ఏర్పాటు చేసి పాలకవర్గాలను ప్రకటించింది.

ఆయా కార్పోరేషన్లకు 56 మంది చైర్ పర్సన్లు, 672 మంది డైరక్టర్లను నామినేట్ చేశారు. వారి ప్రమాణస్వీకారం కూడా ఘనంగా నిర్వహించారు.

అగ్నికుల క్షత్రియ, ఆరే కటిక/కటిక, అతిరస, అయ్యారక, బెస్త భట్టరాజ, బొందిలి, చాత్తాద శ్రీవైష్ణవ, దాసరి, దేవాంగ, ఈడిగ గాండ్ల/తేలికుల, గవర, గౌడ,జంగమ,కాళింగ, కాళింగ కోమటి/కాళింగ వైశ్య, కొప్పుల వెలమ, కృష్ణ బలిజ/పూసల, కుమ్మరి శాలివాహన, కుంచోటి వక్కళింగ కూరాకుల/పొందర, కుర్ని/కరికాళభక్తులు, కురుబ/కురుమ, మత్స్యకార, మేదర, ఎంబీసీ, ముదలియార్, ముదిరాజ్/ముతరాసి, ముస్లిం సంచార జాతులు, నగరాలు, నాగవంశం, నాయూ బ్రాహ్మణ, నూర్ బాషా, పద్మశాలీ, పాల-ఏకారి, పెరిక, పోలినాటి వెలమ, రజక, రెడ్డిక, సగర/ఉప్పర, శెట్టిబలిజ, షేక్/షయిక్, శిష్టి కరణం, శ్రీశయన, సూర్యబలిజ, తొగట/తొగట వీరక్షత్రియ, తూర్పు కాపు/గాజుల కాపు, వడ్డెలు, వడ్డెర,వాల్మీకి/బోయ, వన్యకుల క్షత్రియ, వీరశైవ లింగాయత్, విశ్వబ్రాహ్మణ, యాదవ, యాత వంటి కులాలతో పాటుగా కాపు సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థను కూడా బీసీ సంక్షేమ శాఖలో భాగంగా నిర్వహిస్తున్నారు.

కార్పోరేషన్లు ఏం చేశాయి..

బీసీ కులాల కార్పోరేషన్లకు 2021 జూన్ నెలాఖరులో కార్యాలయాలు ప్రారంభించారు. కానీ అందుకు అవసరమైన ఏర్పాట్లు జరగలేదు.

కులాల వారీగా కార్పోరేషన్లు ఏర్పాటు చేసినప్పటికీ బడ్జెట్ కేటాయింపులు జరగలేదు.

చైర్ పర్సన్ హోదాలో ఉన్న వారికి నెలకు రూ. 56వేలు, డైరెక్టర్ కి రూ. 12వేలు చొప్పున గౌరవవేతనం ప్రభుత్వం తరపున అందించారు. దానికోసం సుమారుగా రూ. 36 కోట్లు వెచ్చించారు.

ఆయా కులాల వారీగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేసే క్రమంలో కార్పోరేషన్ల భాగస్వామ్యం కూడా కనిపించలేదు.

రెండేళ్ల పదవీ కాలానికి నామినేట్ అయిన నాయకుల పదవీకాలం 2022 డిసెంబర్ 7తో ముగిసింది.

దాంతో కొత్త నేతలతో మరోసారి ఈ కార్పోరేషన్లకు పాలకవర్గాలను నామినేట్ చేసే అవకాశం కనిపిస్తోంది.

కార్పోరేషన్లకు నిధుల కేటాయింపు, వాటి వినియోగం వంటి విషయాల్లో సమూల మార్పులు జరిగితేనే వాటి వల్ల ఉపయోగం ఉంటుందనే అభిప్రాయం బీసీ నాయకుల్లో వినిపిస్తోంది.

ఉపాధి కల్పించే యత్నం జరగలేదు..

గతంలో వివిధ సంక్షేమ కార్పోరేషన్ల ద్వారా ప్రభుత్వ పథకాలు అమలు చేసేవారు. రాయితీపై వృత్తిదారులకు ఆయా పథకాల ద్వారా సామాగ్రి అందించేవారు. సబ్సిడీల ద్వారా రుణసదుపాయం అందించేవారు.

అయితే గడిచిన రెండేళ్లుగా అలాంటి ప్రయత్నం జరగలేదు. బీసీ డిక్లరేషన్ లో ప్రకటించిన పథకాల ద్వారా రజక, చేనేత, నాయి బ్రాహ్మణ, మత్స్యకార కులాలకు మాత్రం డీబీటీ పద్ధతిలో ఏటా ప్రభుత్వ సహాయం అందిస్తున్నారు. మహిళలకు కూడా ఆర్థిక సహాయం అందిస్తున్నారు.

కులాల పేరుతో కార్పోరేషన్లు ఏర్పాటు చేసినప్పటికీ వాటి ద్వారా ఆశించిన ప్రయోజనం కనిపించడం లేదని ఏపీ బీసీ కులాల ఐక్యవేదిక ప్రతినిధి ఎం.నరసన్న గౌడ్ అన్నారు.

"లక్ష జనాభా ఉన్న కులాలకు కూడా ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేశారు. తద్వారా వారికి కూడా గుర్తింపు వచ్చింది. బీసీలలో ప్రత్యేక కార్పోరేషన్ లేని కులాల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ ఆయా కులస్తుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. తద్వారా గుర్తించదగ్గ సంఖ్యలో ఉన్నవారందరికీ కార్పోరేషన్లు వచ్చాయి. ఆయా కులస్తులు కొందరికి పదవులు కట్టబెట్టారు. కానీ ఒక్కరంటే ఒక్కరికి కూడా కార్పోరేషన్ ద్వారా ప్రత్యేక సహాయం అందించిన దాఖలాలు లేవు. కార్పోరేషన్లు పేరుకే అన్నట్టుగా ఉన్నాయి. వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అందించే లబ్దినే బీసీలకు కలిగించిన మేలు అంటూ చెబుతున్నారు. కానీ కార్పోరేషన్ల లక్ష్యం విస్మరించారు" అంటూ ఆయన అభిప్రాయపడ్డారు.

బీసీ కార్పోరేషన్లకు నిధులు కేటాయించి, వాటి ద్వారా ఆయా కులాల్లో ఉన్న యువతకు ఉపాధి కల్పించే ప్రయత్నాలు నిలిపివేయడం సరికాదని ఆయన బీబీసీతో అన్నారు.

పేరుకే పదవులు..

బీసీల అభ్యున్నతి కోసం ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విద్యాపరంగా అవకాశాలు మెరుగుపరిచే యత్నం జరగాలని ప్రముఖ బీసీ నాయకుడు డాక్టర్ అల వెంకటేశ్వర్లు అభిప్రాయపడ్డారు.

బీసీలకు పదవులు కట్టబెట్టామనే పేరుతో వివిధ కులాలను రాజకీయంగా సమీకరించుకునే ప్రయత్నమే ఎక్కువగా జరుగుతోందని ఆయన అన్నారు.

"బీసీలకు పదవుల్లో వాటా గతంతో పోలిస్తే పెరిగింది. కానీ పెత్తనం మాత్రం దక్కలేదు. పేరుకే పదవులు అన్నట్టుగా మారిపోయాయి. బీసీలకు కార్పోరేషన్ల సంఖ్య పెరిగింది తప్ప అదనంగా నిధులు ఇచ్చిన దాఖలాలు లేవు. అదే సమయంలో విదేశీ విద్యా సహాయం అందడం లేదు. కొన్ని కోర్సుల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా గతంలో మాదిరిగా దక్కడం లేదు. మెడికల్ పీజీ విద్యార్థులకు రీయింబర్స్‌మెంట్ తీసేశారు. దానివల్ల బీసీ విద్యార్థులు ఉన్నత విద్య వైపు వెళ్లేందుకు అవకాశాలు తగ్గిపోతున్నాయి. అధికార పక్షం రాజకీయ లక్ష్యాల సాధన కోసం ప్రయత్నమే తప్ప బీసీల ఉద్దరణ ఆచరణలో కనిపించడం లేదు" అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

బీసీలకు విద్యా, ఉపాధి మెరుగుపరిచే దిశలో కార్పోరేషన్ల పాత్ర ఉండాలని ఆయన అన్నారు.

బీసీల అభివృద్ధే లక్ష్యం...

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలకు అనుగుణంగా బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు అన్నారు.

"అన్ని పదవుల్లోనూ బీసీల ప్రాతినిధ్యం పెరిగింది. పదవులతో పాటుగా నిధులు కూడా బీసీలకే పెద్ద మొత్తం కేటాయించిన ప్రభుత్వం ఇది. గతంలో కార్పోరేషన్లు అంటే కొందరు నాయకుల ఇష్టారాజ్యంగా ఉండేది. వారి అనుచరుల పేరుతో భారీ అవినీతికి పాల్పడిన అనుభవం ఉంది. కానీ గడిచిన మూడున్నరేళ్లలో బీసీలకు నేరుగా రూ.86 కోట్ల మేర లబ్ది జరిగింది. ఒక్క పైసా అవినీతి జరగలేదు. ఊరిలో ఒకరిద్దరికి కార్పోరేషన్ ద్వారా లోన్లు ఇచ్చి మిగిలిన అందరినీ వంచించే రీతిలో కాకుండా ప్రతీ ఒక్కరికీ మేలు చేసినా పాలన ఇది. అందుకే బీసీలకు జగన్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందనే నమ్మకం అందరిలో కనిపిస్తోంది. రాజకీయ విమర్శలకు బీసీలు స్థానిక ఎన్నికల్లోనే సమాధానం చెప్పారు" అంటూ మంత్రి వేణు బీబీసీతో అన్నారు.

బీసీ కులాల్లో కొత్త చైతన్యం తీసుకొచ్చి,అందరినీ సమానంగా అభివృద్ధి చేస్తున్నామని ఆ విషయాన్నే జయహో బీసీ సభ ద్వారా చాటుతున్నామని మంత్రి అన్నారు.

విద్యా, వైద్య రంగాల్లో తీసుకొస్తున్న మార్పులతో ఎక్కువ ప్రయోజనం బీసీలకే దక్కుతోందని ఆయన స్పష్టం చేశారు.

రాజకీయ లక్ష్యాలే ప్రధానం...

బీసీ కార్పోరేషన్ల ఏర్పాటు, జయహో బీసీ వంటి నినాదాలు అన్నీ రాజకీయ లక్ష్యాల సాధనలో భాగంగా చూడాలని సీనియర్ జర్నలిస్టు, బీసీ నాయకుడు కె.పార్ధ సారధి అన్నారు.

"తెలుగుదేశం హయంలో కూడా జయహో బీసీ అని నినదించారు. అప్పట్లో బీసీ కులాలు ఎక్కువగా టీడీపీని ఆదరించాయి. సుదీర్ఘకాలం పాటు టీడీపీ వెంట నడిచిన బీసీలకు తగిన న్యాయం జరగలేదనే అభిప్రాయం బలపడింది. ప్రస్తుతం బీసీలలో అత్యధికులు వైఎస్సార్సీపీని బలపరచడానికి అదే కారణం. 2019 ఎన్నికల్లోనూ, ఆ తర్వాత స్థానిక ఎన్నికల్లోనూ బీసీలు మెజార్టీగా ఉన్న చోట్ల వైఎస్సార్సీపీ గెలిచింది.

దానిని నిలబెట్టుకునే దిశలో మరోసారి బీసీలను సమీకరించే ప్రయత్నం జరుగుతోంది. ఆ లక్ష్యాలు విజయవంతమవుతాయా లేదా అన్న దానిని బట్టే ఫలితాలుంటాయి. టీడీపీ వెనుక నడిచిన బీసీలను తనవైపు తిప్పుకోవాలనే యత్నంలో జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తేనే అధికారం నిలబడుతుంది" అంటూ సారధి అంచనా వేశారు.

అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జయహో బీసీ సభ ద్వారా వచ్చే ఎన్నికల్లో బీసీలకు ఏ హామీలు ఇవ్వబోతున్నారనే అంశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని బీబీసీతో అన్నారు.

విజయవాడలో నిర్వహిస్తున్న ఈ సభకు అధికార పక్షం భారీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వార్డు మెంబర్ నుంచి అన్ని పదవుల్లోనూ ఉన్న బీసీ నేతలందరికీ ఆహ్వానాలు పంపించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత వార్తలు

English summary
Why was Jayaho BC conducted by the YSRCP, what did the party gain
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X