• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీమిండియా టీ20 పగ్గాలు రోహిత్ శర్మకే ఎందుకు అప్పగించారు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

న్యూజీలాండ్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. ఈ సిరీస్‌లో భాగంగా నవంబర్ 17న జైపూర్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది.

rohit

ఈ టీ20 ప్రపంచ కప్ తరువాత కెప్టెన్సీ నుంచి వైదొలుగుతానని విరాట్ కోహ్లీ సెప్టెంబర్‌లోనే ప్రకటించాడు.

కోహ్లీ ప్రకటన తరువాత కొన్ని రోజులకు, సునీల్ గావస్కర్ ఒక స్పోర్ట్స్ ఛానల్‌తో మాట్లాడుతూ కోహ్లీ స్థానాన్ని రోహిత్ శర్మ భర్తీ చేయగలడని అన్నారు.

రాబోయే రెండు ప్రపంచ కప్‌లకు రోహిత్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించగలడని విశ్వాసం వ్యక్తం చేశారు.

"తదుపరి టీ20 ప్రపంచ కప్ వచ్చే ఏడాది జరగనుంది. ఆ తరువాత సంవత్సరం వన్డే వరల్డ్ కప్ ఉంటుంది. ఒకదాని తరువాత ఒకటి పెద్ద టోర్నమెంటులు ఉన్నప్పుడు కెప్టెన్‌ను మారుస్తుండటం సరి కాదు. కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ కావొచ్చు" అని గావస్కర్ అన్నారు.

అంతేకాకుండా, రిషభ్ పంత్ ఐపీఎల్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన తీరు, బౌలర్లను ఉపయోగించుకున్న పద్ధతి ఆకట్టుకున్నాయని, క్రికెట్‌లో పరిస్థితిని బట్టి త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌కు, రిషభ్ పంత్‌కు సమాన అవకాశాలు ఉన్నాయని గావస్కర్ అభిప్రాయపడ్డారు.

అయితే, జట్టులో వైస్ కెప్టెన్ పాత్రకు అంత ప్రాముఖ్యత ఉండదు. కెప్టెన్ అయ్యేవరకు వారి సామర్థ్యానికి గుర్తింపు పెద్దగా ఉండదు.

ధోనీ తరువాత కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాకే కోహ్లీలో ఉన్న నాయకత్వ లక్షణాలు బయటపడ్డాయి. అజింక్యా రహానేకు కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చు.

ఆస్ట్రేలియా పర్యటనలో రహానే వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. కెప్టెన్ కోహ్లీ భారత్‌కు తిరిగి రావడంతో తాత్కాలిక కెప్టెన్‌గా రహానే వ్యవహరించాడు.

అడిలైడ్‌లోని తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో జట్టు 36 పరుగులకే కుప్పకూలిన పరిస్థితుల్లో రహానే జట్టును నడిపిన తీరు, సిరీస్‌ను గెలుపొందిన తీరు అద్భుతం. అప్పుడే అతనిలోని కెప్టెన్ సామర్థ్యాలు వెలుగులోకి వచ్చాయి.

కెప్టెన్‌గా కోహ్లీ..

2014లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. అదే సంవత్సరం టెస్ట్ క్రికెట్ నుంచి ధోనీ రిటైర్మెంట్ తరువాత కోహ్లీ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు.

కోహ్లీ సారథ్యంలో భారత జట్టు ఎన్నో మ్యాచ్‌లు గెలుచుకుంది. విజయవంతమైన కెప్టెన్‌గా కోహ్లీ తన సత్తా చాటుకున్నాడు.

కాగా, ఐపీఎల్ కెప్టెన్సీ నుంచి కూడా వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు కోహ్లీ అక్టోబర్‌లో ప్రకటించాడు. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)కు కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరిస్తూ వచ్చాడు.

కెప్టెన్సీ ఒత్తిడి కోహ్లీ బ్యాటింగ్‌పై పడటం కనిపిస్తూనే ఉంది. గత రెండేళ్లల్లో టెస్ట్, వన్డే, టీ20లలో కోహ్లీ ఒక్క సెంచరీ కూడా చేయలేదు.

కోహ్లీ సారథ్యంలో భారత జట్టు ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌గానీ, ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌గానీ, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గానీ గెలవలేకపోయింది.

అలాగే, ఐపీఎల్‌లో ఆర్‌సీబీ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు.

కోహ్లీ ఇప్పటివరకు 50 టీ20 మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు. అందులో 30 మ్యాచ్‌లు గెలవగా, 16 ఓడిపోయారు. రెండు మ్యాచ్‌లు టై కాగా, రెండు మ్యాచ్‌ల్లో ఎలాంటి ఫలితాలూ రాలేదు.

కెప్టెన్‌గా రోహిత్ శర్మ..

మరోవైపు రోహిత్ శర్మ ఇప్పటివరకు 10 వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. వీటిలో భారత్ 8 మ్యాచ్‌లు గెలిచింది, రెండింటిలో ఓడిపోయింది.

2018లో రోహిత్ సారథ్యంలో భారత జట్టు ఆసియా కప్ గెలిచింది.

ఇది కాకుండా, రోహిత్ 19 టీ20 మ్యాచ్‌లలో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. వీటిల్లో 15 మ్యాచ్‌ల్లో గెలిచి, నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.

ఐపీఎల్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి.

రోహిత్ సారథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టు అయిదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. దీని కారణంగానే రోహిత్ కెప్టెన్సీ ఐరన్ లోహం అంతా దృఢమైనది అంటారు విశ్లేషకులు.

ముంబై ఇండియన్స్ జట్టు 2013, 2015, 2017, 2019, 2020లలో ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది.

రోహిత్‌ను కెప్టెన్ చెయ్యొచ్చన్న గావస్కర్ మాటలకు స్పందిస్తూ క్రికెట్ విమర్శకుడు అయాజ్ మెమెన్.. "బహుశా అందరిలాగే వైట్ బాల్‌కు, రెడ్ బాల్‌కు వేర్వేరు కెప్టెన్లు ఉండాలని గావస్కర్ భావించి ఉండవచ్చు" అని అన్నారు.

క్రికెట్‌లో మూడు ఫార్మాట్లకూ ఒకే కెప్టెన్ ఉండడం మేలా?

టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలిగినప్పటికీ వన్డే, టెస్ట్‌లలో కెప్టెన్‌గా కొనసాగుతానని కోహ్లీ స్పష్టం చేశాడు.

ఈ మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ ఉండాలనిగానీ, అన్ని దేశాలూ ఒకే పద్ధతి అనుసరిస్తున్నాయనిగానీ చెప్పలేం.

పాకిస్తాన్‌లో బాబర్ ఆజమ్ మూడు ఫార్మాట్లకూ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

ఆస్ట్రేలియాలో ఆరోన్ ఫించ్ వన్డే, టీ20లకి కెప్టెన్‌గా ఉండగా... టెస్ట్‌లకు టిమ్ పైన్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు.

ఇంగ్లండ్‌లో టెస్ట్‌లకు జో రూట్, వైట్ బాల్ గేమ్‌లకు ఇయాన్ మోర్గాన్ సారథ్యం వహిస్తున్నారు.

ఇప్పుడు 2022లో టీ20 ప్రపంచకప్, 2023లో వన్డే వరల్డ్ కప్‌ టోర్నీలు జరగాల్సి ఉంది. కాబట్టి ఈ రెండు ఫార్మాట్లకూ ఒకరే కెప్టెన్‌గా ఉంటే మేలు.

ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కెప్టెన్ ఉండడం సరి కాదు. గావస్కర్ కూడా ఇదే మాట చెబుతున్నారు.

విరాట్ కోహ్లీ Vs రోహిత్ శర్మ

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల కెప్టెన్సీ శైలి, ఆలోచనా విధానం భిన్నంగా ఉంటాయని అయాజ్ మెమెన్ అభిప్రాయపడ్డారు.

విరాట్ కోహ్లీ ఉత్సాహంగా మైదానంలోకి వస్తాడు. ఉన్నత స్థాయి ప్రదర్శన కనబర్చాలని ఆశిస్తాడు.

రోహిత్ శర్మ యుక్తి, వ్యూహాలతో జట్టును నడిపిస్తాడు. రోహిత్ పైకి కెప్టెన్‌లా కనిపించడు కానీ, తెర వెనుక చాలా చేస్తాడు.

రోహిత్ సారథ్యంలో ముంబై ఇండియన్స్ అయిదుసార్లు ఐపీఎల్, భారత జట్టు ఆసియా కప్ గెలిచింది కాబట్టి రోహిత్ కెప్టెన్ అయితే బాగుంటుందని అందరూ అనుకున్నారు.

ఇక రోహిత్ పనితనం ఎలా ఉంటుందో ముందు ముందు తెలుస్తుంది. ఎవరు మెరుగైన కెప్టెన్ అనేది భవిష్యత్తే నిర్ణయిస్తుంది.

భారత్‌ను విశ్వవిజేతగా నిలబెట్టే అవకాశం కోహ్లీకి రెండుసార్లు వచ్చినా ట్రోఫీ అందుకోలేకపోయాడు.

2017లో ఛాంపియన్స్ ట్రోఫీ చేతివరకు వచ్చి జారిపోయింది. ఫైనల్‌లో భారత జట్టు ఓడిపోయింది. అలాగే 2019 వరల్డ్ కప్‌లో సెమీ ఫైనల్స్ వరకు వచ్చి వెనుదిరిగింది.

ఇందుకే, ఈసారి టీ20 వరల్డ్ కప్‌కు ధోనీని మెంటార్‌గా నియమించారు.

ఈ టోర్నమెంట్‌తో కోహ్లీ కెప్టెన్సీకి స్వస్తి చెప్పి, తన బ్యాటింగ్‌పై శ్రద్ధ పెడతాడని కూడా అందరూ ఊహించారు. టెస్ట్ క్రికెట్‌లో భారత్‌కు, కోహ్లీకి కూడా ఇది మేలు చేస్తుందని భావించారు.

ఐపీఎల్ విషయానికొస్తే, దేశవాళీ క్రికెట్‌లో ఇది చాలా ప్రాచుర్యం పొందింది.

ఇందులో టైటిల్ గెలిస్తే, ఆ కెప్టెన్ పేరు మారుమోగిపోతుందని, రోహిత్‌కు ఐపీఎల్‌లో మంచి పేరు వచ్చిందని అయాజ్ మెమెన్ అన్నారు.

అందువల్లే రోహిత్ శర్మను టీమిండియాకు కెప్టెన్ చేయాలనే డిమాండ్ పెరిగింది.

అయితే, వన్డేల్లో కూడా రోహిత్‌ను కెప్టెన్ చేయాలనే చర్చ ఇప్పుడే మొదలవుతుందా?

టీ20లకి, వన్డేకు ఒకే కెప్టెన్ ఉంటే మేలనే వాదనలూ వినిపిస్తున్నాయి.

కెప్టెన్‌గా కోహ్లీ రికార్డ్ చెడ్డదీ కాదు, అలాగని అత్యుత్తమమైనదీ కాదు.

టీ20లో ధోనీ కన్నా మెరుగైన కెప్టెన్ అని పేరు తెచ్చుకున్నప్పటికీ, ఒక్క టైటిలూ గెలవలేదు. ప్రజలు టైటిళ్లు మాత్రమే గుర్తుపెట్టుకుంటారు.

ఈ విషయంలో రోహిత్ శర్మకు అనుకూలత ఉంది. రోహిత్ బ్యాటింగ్‌లోనూ బలంగా ఉన్నాడు.

రోహిత్ శర్మ, బుమ్రా, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజాలకు మూడు ఫార్మాట్లలోనూ చోటు ఖాయంగా ఉంటుంది.

అంతేకాకుండా రోహిత్‌కు ముంబై జట్టుకు 10 ఏళ్ల పాటు, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఆరేడేళ్లుగా కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం ఉంది.

'పెద్ద ఆటగాళ్ల మధ్య పోటీ ఉండదు'

రోహిత్, విరాట్‌ల మధ్య పోటీ విషయంలో.. పెద్ద ఆటగాళ్ల మధ్య పోటీ ఉండదని అయాజ్ మెమెన్ అభిప్రాయపడ్డారు.

రోహిత్ కెప్టెన్ అయితే కోహ్లీ సరిగ్గా ఆడడు అని చెప్పలేం. ఛాంపియన్ ప్లేయర్ల మధ్య ఇలాంటి వ్యత్యాసాలు ఉండవని ఆయన అన్నారు.

రోహిత్, కోహ్లీల మధ్య మంచి అవగాహన ఉంది. ఇందుకు ఉదాహరణ చెప్పాలంటే, ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లో కోహ్లీ కెప్టెన్సీలో రోహిత్ అత్యధిక పరుగులు సాధించాడు.

అయితే, ఆటగాళ్ల మధ్య సత్సంబంధాలు ఉండాలన్న రూలేమీ లేదు.

గావస్కర్, కపిల్ దేవ్‌ల మధ్య మంచి సంబంధాలు ఏర్పడలేదని మనం విన్నాం.

కానీ ఒకరు అత్యధిక సెంచరీలతో 10,122 పరుగులు సాధించగా, మరొకరు రికార్డు స్థాయిలో 434 వికెట్లు పడగొట్టారు.

వ్యక్తిగత స్థాయిలో ఆటగాళ్ల పనితీరు అద్భుతంగా ఉంటే, వారి మధ్య సత్సంబంధాలు అంత ప్రాముఖ్యం వహించవు.

కాగా, తాను ఎంపిక చేసిన ఆటగాళ్లను జట్టులోకి తీసుకోని కారణంగానే కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడనే వార్తలు వినిపించాయి.

అవన్నీ గాలి వార్తలని అయాజ్ మెమెన్ అన్నారు.

తన బ్యాటింగ్ పేలవంగా తయారవడం, ఫామ్‌లో లేకపోవడం కోహ్లీ ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య. రెండేళ్లుగా చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయాడు.

ఎవరైనా సరే ముందుగా ఒక ఆటగాడిగా రాణించాలని కోరుకుంటారు. తరువాతే కెప్టెన్సీ.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Why was Rohit sharma made Team India captain for T20s
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X